ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు — అది మెదడు మరియు హార్మోన్ల శాస్త్రీయ ప్రక్రియ.
ప్రేమ ఈ రెండు అక్షరాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో అనేక మంది శాస్త్రవేత్తలు నిరంతరము పరిశోధన సాగిస్తూనే ఉన్నారు. ప్రేమ అనేది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి భావోద్వేగం. ఈ ప్రేమ ఎంతో మంది కవుల కలాలకు పనులు పెట్టింది, ప్రేమికులను కవులుగా మార్చింది, ఎంతోమంది ప్రేమికులను పిచ్చివాళ్లుగా మార్చింది. బ్రతికిన ప్రేమ కోసమే చనిపోయిన ప్రేమ కోసమే అనేంతగా ఇప్పటివరకు ఎంతోమంది యువతి, యువకులు ఈ ప్రేమ బారిన పడ్డారు. అయితే మన ముద్దుగా ప్రేమ అని పిలుచుకునే ఈ మధురమైన అనుభూతి కేవలం హృదయానికి సంబంధించినది మాత్రమే కాకుండా దీని వెనక ఒక అద్భుతమైన రసాయన శాస్త్రం, జీవశాస్త్రం దాగి ఉన్నాయి. మనకు కనులకు నచ్చిన అమ్మాయి కానీ అబ్బాయిని కానీ చూసినప్పుడు మన గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది, వారిని ఆలోచనల లోనే ఊహించుకుంటూ రాత్రి అంతా నిద్ర లేకుండా ఎందుకు గడుపుతారు. వారితో జీవితాంతం కలిసి బ్రతకాలి కలిసి ఉండాలి అని ఎందుకు అనుకుంటారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన మెదడు విడుదల చేసే రసాయనాలలో మరియు మన జన్యువుల ఎంపికలో ఉంది. ప్రముఖ మానవ శాస్త్రవేత్త హెలెన్ ఫిషర్ పరిశోధనల ప్రకారం ప్రేమ అనేది ఒకేసారి సంభవించే ప్రక్రియ కాదు, ఇది మూడు విభిన్న దశలలో సాగే ఒక ప్రయాణం.
ప్రేమ యొక్క మొదటి దశ – వ్యామోహం (Lust)
ప్రేమలో పడడానికి ప్రధానమైన కారణం వ్యామోహం. ఎందుకంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు వారి గుణగణాలు తెలియకుండా, వారి కుటుంబం తెలియకుండా, కేవలం ఒక మనిషిని చూసి ఇష్టపడతారు. అంటే వారి యొక్క శరీరాన్ని మనము చూసి మొహం లో పడతాం, దీనినే వ్యామోహం అంటారు. ఇది ప్రేమలో మొదటి అడుగు, ఇది సాధారణ ప్రక్రియ అయినప్పటికీ ఇందులో లోతుగా ఆలోచిస్తే ఇది మానవునిలోని సంతానోత్పత్తి యొక్క కాంక్షలు, అలాగే శరీర ఆకర్షణను కల్పిస్తుంది. ఈ వ్యామోహానికి శాస్త్రీయపరమైనటువంటి కారణమేమంటే టెస్టోస్టిరాన్ మరియు ఈస్ట్రోజెన్ అనే సెక్స్ హార్మోన్లు. సాధారణంగా టెస్టోస్టిరాన్ పురుషులకు మాత్రమే పరిమితమని అనుకుంటారు, కానీ మహిళల్లో కూడా ఇది లైంగిక కోరికలను ప్రేరేపించడంలో ప్రేరేపించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. పరిణామ క్రమంలో భాగంగా మానవజాతిని ముందుకు తీసుకెళ్లడానికి తన భాగస్వామిని వెతుక్కునేలా ఈ హార్మోన్లు మనుషులని ప్రేరేపిస్తాయి. ఈ మొదటి దశలో స్త్రీ పురుషుల మధ్య లోతైన భావోద్వేగా భావన, బంధం కంటే శారీరక ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఒక జీవ సంబంధమైనటువంటి ఒక ప్రేరణ మాత్రమే, కానీ ప్రేమకు ఇది పునాది వేస్తుంది.
ఈ దశలో మనం తీసుకునే నిర్ణయాలు పూర్తిగా భావోద్వేగాల ఆధారంగా ఉంటాయి. ఆలోచన కంటే ఆకర్షణ బలంగా పనిచేస్తుంది. అందుకే చాలామంది ఈ దశలో తీసుకున్న నిర్ణయాలను తర్వాత ఆశ్చర్యంగా చూసుకుంటారు.
ప్రేమ యొక్క రెండో దశ – ఆకర్షణ (Attraction)
వ్యామోహం కాస్త బలపడి రెండవ దశకు చేరుకుంటుంది. ఈ రెండవ దశని ఆకర్షణ అంటారు, నిజానికి దశలో ఒక్క వ్యక్తికి “నేను ప్రేమలో పడ్డాను” అనే ఆలోచన కలుగుతుంది. ఈ సమయంలో మానవ యొక్క మెదడు ఒక రకమైనటువంటి మత్తులో ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం డోపమైన్, నోరెపినెఫ్రిన్ మరియు సెరొటోనిన్ అనే రసాయనాల కలయిక. డోపమైన్ మన మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను ఉత్తేజపరుస్తుంది. మనకు నచ్చిన వ్యక్తితో ఉన్నప్పుడు లేదా వారి గురించి ఆలోచించినప్పుడు మనకు కలిగే అమితమైన ఆనందానికి ఇదే కారణం. ఇది కొకైన్ వంటి డ్రగ్స్ ఇచ్చే మత్తుతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇక నోరెపినెఫ్రిన్ (అడ్రినలిన్) వల్ల మనకు తెలియకుండానే చెమటలు పట్టడం, నోరు ఆరిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశలో సెరొటోనిన్ స్థాయిలు తగ్గడం వల్ల మనకు ఆ వ్యక్తి గురించి తప్ప వేరే ఆలోచన రాదు. ఇది ఒక రకమైన తాత్కాలిక ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ (OCD) వంటి స్థితిని కలిగిస్తుంది, అందుకే ప్రేమించిన ప్రేమలో ఉన్నవారు తిండి, నిద్ర మర్చిపోయి పగటి కలలు కంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం మన శరీరంలో, మెదడులో జరిగే మార్పులే కారణం.
ప్రేమ యొక్క మూడో దశ – అనుబంధం (Attachment)
ఆకర్షణ దశ అనేది ఒక తుపాను లాంటిది, అది ఎల్లకాలం కొనసాగదు. ఒక జంట సుదీర్ఘ కాలం పాటు కలిసి ఉండాలంటే వారు మూడో దశ అయిన ‘అనుబంధం’ (Attachment) లోకి ప్రవేశించాలి. ఈ దశలో ప్రేమ ఉద్వేగాల నుండి ప్రశాంతమైన మరియు నమ్మకమైన బంధంగా మారుతుంది. ఇక్కడ ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెస్సిన్ అనే రెండు హార్మోన్లు ముఖ్య భూమిక పోషిస్తాయి. ఆక్సిటోసిన్‌ను ‘కౌగిలింత హార్మోన్’ (Cuddle Hormone) అని కూడా పిలుస్తారు. ఇది కేవలం దంపతుల మధ్యే కాకుండా, తల్లి మరియు బిడ్డల మధ్య బంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది. శారీరక సామీప్యం పెరిగినప్పుడు ఈ హార్మోన్ విడుదలయ్యి, ఇద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇక వాసోప్రెస్సిన్ అనేది భాగస్వామి పట్ల అంకితభావాన్ని, రక్షణ భావాన్ని పెంచుతుంది. ప్రెయిరీ వోల్స్ వంటి జంతువులపై చేసిన పరిశోధనలు ఈ హార్మోన్ల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో నిరూపించాయి.
ప్రేమ మీద నా భావన ఏమిటంటే
ప్రేమ గురించి ఎన్ని పరిశోధనలు చేసినా, ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. నిజానికి ప్రేమ వెనుక రసాయన హార్మోన్లు మరియు జన్యుపరమైన కారణాలు ఉన్నాయని వినడానికి కొంత యాంత్రికంగా అనిపించిన, సైన్స్ ప్రకారం ఈ రసాయన చర్యలే మానవ బంధాలకి, ప్రేమకి, ఆకర్షణకి సాక్ష్యంగా ఉంటున్నాయి. కానీ సైన్స్ ఎన్ని విధాల వివరణలు ఇచ్చిన, ఒక వ్యక్తి పట్ల కలిగే ప్రేమకైన, ఆకర్షణకైన, ఆత్మీయత, అనురాగం, త్యాగం అనేవి ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీలే. ఎన్నో విషయాలని మనము ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నాము. అమితంగా ప్రేమించిన వ్యక్తిని కడతేరుస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డని అన్యాయం చేస్తున్నారు. ఒకే మనిషి ప్రేమించగలడు ద్వేషించగలడు, చావగలడు, చంపగలడు ఇన్ని భావోద్వేగాలు ఒక మనిషిలో ఉండటానికి అంతర్గతంగా ఒక శాస్త్రీయ కారణం అయినప్పటికీ, ఇది దేవుని సృష్టిలో ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఒక వస్తువును సరియైన పనికి ఉపయోగించవచ్చు చెడు పనికి ఉపయోగించవచ్చు, టెక్నాలజీని మేలు చేయటానికి ఉపయోగించవచ్చు కీడు చేయడానికి ఉపయోగించవచ్చు, అలాగే మనము కూడా ఒక మనలోని మంచిని అంటే ప్రేమని అభిమానాన్ని ఇతరులకు చూపిస్తే మనం మంచివారగా మిగిలిపోతాము.
మీకు ఈ సమాచారం నచ్చిందా? అయితే ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
ఇప్పుడే మా యొక్క వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
