వాలెంటైన్స్ డే — ప్రేమను జరుపుకునే ప్రపంచపు ప్రత్యేక రోజు
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల రాగానే ప్రపంచమంతా ఒక మధురమైనటువంటి అనుభూతి చెందుతుంది. వీచే గాలిలో ప్రేమ పరిమళాలు, ఎక్కడ చూసినా ఎరుపు రంగు ,గులాబీలు, ఆకర్షణీయమైనటువంటి గ్రీటింగ్ కార్డులు కనిపిస్తాయి. ఎందుకో తెలుసా అదేనండి ప్రేమికుల రోజు వాలెంటైన్స్ డే (Valentine’s Day).కానీ అసలు ప్రేమికుల రోజును ఎవరు మొదలుపెట్టారు? ఎందుకు మొదలుపెట్టారు? దానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం మీకు తెలుసా? అయితే రండి తెలుసుకుందాం.
వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్స్ డే అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 14వ తారీకున జరుపుకునే పండుగ. అయితే ఇది క్రైస్తవ మతానికి చెందినటువంటి, ఒక అమరవీరుడి జ్ఞాపకార్థంగా మొదలై కాలక్రమేనా రూపాంతరం చెంది, మతపరమైనటువంటి హద్దులను దాటేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేమికులకు తమ ప్రేమను వ్యక్తపరచుకునే అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా మారిపోయింది.
సెయింట్ వాలెంటైన్ ఎవరు? (చరిత్ర పుటల్లోని రహస్యం)
వాలెంటెన్స్ డే (Valentine’s Day) వెనుక ఉన్నటువంటి కథ ఒక్కటి కాదు. ఎందుకంటే చరిత్రకారుల అభిప్రాయాల ప్రకారం, రోమన్ క్యాథలిక్ చర్చిలో కనీసము ముగ్గురు ముగ్గురు వేర్వేరు “వాలెంటైన్” అనే పేర్లు కలిగిన సెయింట్స్ ఉండేవారు. వీరందరూ ఒకే కాలంలో మరణించిన అమరవీరులు.
క్లాడియస్ II మరియు నిషేధించబడిన పెళ్లిళ్లు, దారితీసిన పరిస్థితులు
చరిత్ర ప్రకారం అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఒక కథ ఉంది. దాని ప్రకారం క్రీస్తుశకం 3 శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యాన్ని క్లాడియస్ II (Claudius II) అనే చక్రవర్తి పరిపాలించేవాడు.అతడు అత్యంత క్రూరమైన వాడు, తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం సైన్యాన్ని మరింతగా బలమైనదిగా తయారు చేయాలనుకున్నాడు. అయితే పెళ్లైన పురుషులు తమ భార్యాబిడ్డలను వదిలేసి యుద్ధానికి రావడానికి ఇష్టపడడం లేదని అతడు భావించాడు. అందుకోసం అతడు ఒక ప్రణాళికను వేసుకొని యువకులు ఎవరు పెళ్లిళ్లు చేసుకోకూడదు అనే ఒక విచిత్రమైన చట్టాన్ని తీసుకొని వచ్చాడు.
క్లాడియస్ II (Claudius II) తీసుకుని వచ్చినటువంటి ఆ చట్టాన్ని ఆ సమయంలో వాలెంటైన్ అనే క్రైస్తవ గురు తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రేమకు అడ్డుకట్ట వేయడం అన్యాయమని భావించి, క్లాడియస్ II (Claudius II) చక్రవర్తికి తెలియకుండా, రహస్యంగా ఆయన యువతి, యువకులకు వివాహాలు జరిపించడం మొదలుపెట్టాడు. ఈ విషయం చక్రవర్తి అయినా క్లాడియస్ II (Claudius II) కి తెలియడంతో ఆయన వాలెంటైన్ ని జైలులో పెట్టి మరణశిక్ష విధించాడు.
జైలులో పుట్టినటువంటి ఒక ప్రేమ సందేశం
వాలెంటైన్ జైల్లో ఉన్న సమయంలో ఒక అద్భుతం జరిగిందని కూడా కొందరు చెబుతారు. అదేమిటంటే వాలెంటైన్ ను బంధించినటువంటి జైలర్ కూతురు ఒక అంధురాలు. వాలెంటైన్ తన ప్రార్థనలతో ఆమెకు కంటిచూపు తెప్పించాడనే ఒక కథ కూడా ఉంది. వాలెంటైన్ మరణశిక్షకు వెళ్లడానికి ముందు ఆమెకు ఒక చిన్న లేఖ రాస్తాడు. అందులో “From your Valentine” అని సంతకం చేస్తాడు. నేటికీ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రేమికులు తమ సందేశాలలో ఈ విధంగా వాడుతూనే ఉన్నారు.
చివరికి, క్రీ.శ. 270, ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ను ఉరితీశారు. ఆయన ప్రేమ కోసం చేసిన త్యాగం ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది.
లుపర్‌కాలియా (Lupercalia): ప్రాచీన రోమన్ల పండుగ
వాలెంటైన్స్ డే (Valentine’s Day) అనేది వాలెంటైన్స్ డే కేవలం క్రైస్తవ మతానికి సంబంధించింది మాత్రమే కాదు. దీని మూలాలు అంతకంటే ప్రాచీనమైన రోమన్ పండుగ ‘లుపర్‌కాలియా’ లో కూడా ఉన్నాయి. ఆ పండుగలో ఒక వింత సంప్రదాయం ఉండేది. ఆ రోజుల్లో యువతులు తమ పేర్లను ఒక డబ్బాలో వేసే వాళ్ళు. యువకులు అందులో నుండి ఒక చీటీని తీసి ఆ వచ్చిన పేరు గల యువతీతో ఆ యువకుడు ఆ ఏడాది మొత్తము కలిసి జీవిస్తారు, అంటే సహజీవనం చేసేవారు. చాలా వరకు ఆ విధంగా కలిసి జీవించినటువంటి జంటలు తర్వాత పెళ్లి చేసుకునేవారు. 5వ శతాబ్దంలో పోప్ గెలాసియస్ ఈ లుపర్‌కాలియా పండుగను “అనైతికం” అని భావించి దానిని రద్దు చేశాడు. దానిని క్రైస్తవ పద్ధతిలో ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్ జ్ఞాపకార్థం జరుపుకోవాలని నిర్ణయించారు.
మధ్యయుగంలో ప్రేమ మరియు కవిత్వం దాని ప్రతిఫలం
వాలెంటైన్స్ డే కు ఒక రొమాంటిక్ ముద్ర పడటానికి మధ్యయుగ కవులు కూడా ఒక కారణం. ముఖ్యంగా ప్రసిద్ధ కవి జెఫ్రీ చాసర్ (Geoffrey Chaucer) 1382లో రాసిన “Parliament of Foules” అనే కవితలో, పక్షులు తమ జంటను ఎంచుకోవడానికి ఫిబ్రవరి 14న సమావేశమవుతాయని రాశాడు. అప్పటి నుండి వాలెంటైన్స్ డే ఒక రొమాంటిక్ సెలవు దినంగా ప్రాచుర్యం పొందింది.
వాలెంటైన్స్ వీక్: ఎనిమిది రోజుల వేడుక
మీకు తెలుసా ప్రస్తుతం మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఫిబ్రవరి 14 అనేది మాత్రమే ప్రేమికుల రోజు అని అనుకుంటారు. నిజానికి కేవలం ఒక్క రోజుకు మాత్రమే వాలెంటైన్స్ డే (Valentine’s Day) అనే పండుగ పరిమితం కాలేదు. దీనిని ఒక వారం అంతా జరుపుకునే వారు. దీనిని వాలెంటైన్స్ (Valentine’s week) వీక్ అని కూడా అంటారు. ఆ వారం అంతా ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారో తెలుసా?
ఫిబ్రవరి 7 – రోజ్ డే (Rose Day): గులాబీ పువ్వులతో ప్రేమను వ్యక్తపరుస్తారు.
ఫిబ్రవరి 8 – ప్రపోజ్ డే (Propose Day): తమ మనసులోని మాటను ధైర్యంగా చెబుతారు.
ఫిబ్రవరి 9 – చాక్లెట్ డే (Chocolate Day): మధురమైన చాక్లెట్లతో బంధాన్ని తీపి చేసుకుంటారు.
ఫిబ్రవరి 10 – టెడ్డీ డే (Teddy Day): క్యూట్ టెడ్డీ బేర్లను బహుమతిగా ఇస్తారు.
ఫిబ్రవరి 11 – ప్రామిస్ డే (Promise Day): జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేస్తారు.
ఫిబ్రవరి 12 – హగ్ డే (Hug Day): ఆత్మీయ ఆలింగనంతో అనురాగాన్ని పంచుకుంటారు.
ఫిబ్రవరి 13 – కిస్ డే (Kiss Day): ప్రేమను ముద్దుతో ముద్రిస్తారు.
ఫిబ్రవరి 14 – వాలెంటైన్స్ డే (Valentine’s Day): ముగింపు వేడుక.
వాలెంటైన్స్ డే (Valentine’s Day) కోసం ప్రపంచమంతా ఎందుకు ఎదురు చూస్తుంది
వాలెంటైన్స్ డే (Valentine’s Day) కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది ప్రజలు ఎదురు చూస్తారు. ఈ విధంగా ఎదురు చూడడానికి అనేక రకాల సామాజిక మరియు మానసికమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ప్రతినిత్యం బిజీ గా ఉండే జీవితంలో మనకు ఇష్టమైన వారి కోసం మనం ప్రేమను వ్యక్తపరచడం కూడా మర్చిపోతూ ఉంటాం. అటువంటి బిజీ లైఫ్ లో వాలెంటెన్స్ డే అనేది ఒక జ్ఞాపకంగా మన ఇష్టమైన వారికి ప్రేమను వ్యక్త పరచడం, అలాగే అందరినీ తమ ఆత్మీయుల దగ్గరకు చేర్చడం, వంటి మధురానుభూతులను ఈ వాలెంటెన్స్ డే గుర్తుచేస్తుంది. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు వాలెంటైన్స్ డే (Valentine’s Day) ని ఒక భారీ ఈవెంట్ గా ప్లాన్ చేస్తారు. ఫిబ్రవరి నెలలోనే ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లకు కొద్దిగా వ్యాపారం జరుగుతుంది. రకరకాల ఆఫర్లు, గిఫ్ట్స్ విపరీతంగా అమ్ముడు పోతాయి. దాని ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం కూడా జరుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వాలెంటైన్స్ డే (Valentine’s Day) ఎలా జరుపుకుంటారు
మన దేశంలో మనం అనుకున్నట్లుగా అందరూ వాలెంటెన్స్ డే ని ఒకే విధంగా సెలబ్రేట్ చేసుకోరు. జపాన్‌లో అయితే అమ్మాయిలు అబ్బాయిలకు చాక్లెట్ ఇస్తారు, దానికి బదులుగా తిరిగి అబ్బాయిలు మార్చి 14వ తారీఖున వైట్ డే రోజు వారికి బహుమతులు ఇస్తారు. దక్షిణ కొరియాలో విచిత్రంగా సాధారణంగా వాలంటైన్స్ డే జరుపుకున్న దానికి ఆపోజిట్ గా ఏప్రిల్ 14న (వైట్ డే) ను జరుపుకుంటారు. ఎవరైతే సింగిల్ గా ఉండి బహుమతులు అందుకోలేకపోయారో అటువంటివారు నల్లని నూడిల్స్ తింటూ తమ బాధను వ్యక్తపరచుకుంటూ ఉంటారు.
నేటి కాలంలో వాలెంటెన్స్ డే యొక్క ప్రాముఖ్యత ఏమిటి.
ప్రస్తుత కాలంలో, డిజిటల్ యుగంలో వాలెంటెన్స్ డే అనేది సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు. వాట్సాప్ లో స్టేటస్ లు పెడతారు.ప్రపంచానికి తమ ప్రేమను చాటి చెప్పడం అనేది ఒక ట్రెండింగ్ గా ఫీల్ అవుతారు. అయితే మరి కొంతమంది విచ్చలవిడితనానికి నాంది పలుకుతారు. అర్థం పర్థం లేని ఆలోచనలతో, ప్రేమ అనే భ్రమలో, వ్యామోహానికి, ప్రేమకి అర్థం తెలియని యువత ఫిబ్రవరి 14న తమ ప్రేమను వ్యక్తపరచుకుంటారు. ఇలాగ ప్రేమను వ్యక్తపరచుకున్నటువంటి అనేక మంది జంటలు మళ్లీ మరుసటి సంవత్సరం ఫిబ్రవరి 14 కల్లా విడిపోయే వారు కోకోనలుగా ఉన్నారు . ఎందుకంటే ఆకర్షణతో పుట్టే ప్రేమ ఎప్పటికీ నిలవదు. హృదయాన్ని చూసి కలిగే ప్రేమ ఇటువంటి వాలెంటైన్స్ డే (Valentine’s Day) లు ఎన్ని వచ్చినా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. నిజానికి వాలంటైన్స్ డే అనేది ప్రేమను వ్యక్తపరిచే రోజు అయినా, ఆ ప్రేమను ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా వ్యక్త పరచాలి అని తెలుసుకోవడం ముఖ్యం. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని అంటారు. కానీ అది నిజం కాదు, నిజమైన ప్రేమ ఒక వయసులోనే మొదలవుతుంది. ఆ వయసు కంటే ముందుగా మొదలైన ప్రేమలు ఆకర్షణలుగా మిగిలిపోతాయి. సరైన వయసులో ప్రేమ కలగకుండా ఒక వయసు దాటిన తర్వాత కలిగే ప్రేమ చాలామంది జీవితాలలో వ్యామోహం గానే మిగిలిపోతుంది. అంటే ప్రపంచమంతా చెప్పుకున్నట్లు ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని అంటారు కదా! అది నా దృష్టిలో పూర్తిగా తప్పు . ఎవరైతే బాధ్యతగా బ్రతుకుతారో అటువంటి వారికి ప్రేమ కూడా బాధ్యతగా అనిపిస్తుంది. ఎవరైతే బాధ్యత లేకుండా జులాయిగా తిరుగుతారో, అటువంటి వారికి ప్రేమ అనేది ఒక ఆకర్షణగా మిగులుతుంది. ఎవరైతే బాధ్యతలు పంచుకుంటూ ప్రేమను అనుభవిస్తూ, మరొకరిని చూసి ప్రేమిస్తారో అటువంటి వారికి అది వ్యామోహం గా ఉంటుంది. కాబట్టి ప్రేమకి వయసు ఉంది, సమయము ఉంది, సందర్భం ఉంది. ప్రేమ ఎవరిని మోసం చేయదు. కానీ ప్రేమించే మనమే ఆ ప్రేమను మోసం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ప్రేమ గురించి మనకు పూర్తిగా తెలియదు కదా? అందరికీ వాలెంటైన్స్ డే (Valentine’s Day) శుభాకాంక్షలు.
ఇటువంటి ఆసక్తికరమైనటువంటి సమాచారం కోసం మా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.మీకు ఈ సమాచారం నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు.
