మోడీ 12 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధికి దోహదపడిన 12 కీలక పథకాల ప్రత్యేక విశ్లేషణ
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) తన బాధ్యతలను చేపట్టి ఇప్పటివరకు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2014 మే 26 న ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను, మౌలిక సదుపాయాలను, సామాజిక భద్రతను, ముఖ్యంగా డిజిటల్ సేవలను ప్రవేశపెట్టి దేశం యొక్క అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పవచ్చు. ఈ 12 సంవత్సరాల లో ఆయన ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన పథకాలు మన దేశం యొక్క భవిష్యత్తుని ఏ విధంగా మార్చాయో సవివరంగా తెలుసుకుందాం.
నరేంద్ర మోడీ (Narendra Modi) గారు భారత దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా 12 సంవత్సరాలు గడిచాయి. ఈ పన్నెండు సంవత్సరాల లో అనేకమైనటువంటి పథకాలను తీసుకువచ్చారు. దేశంలో అనేక మూలాలను అభివృద్ధి చేయటానికి తాను దిశా నిర్దేశం చేశారు. వాటిలో కొన్ని పథకాల గురించి అవి ఏ విధంగా ప్రభావం చూపాయో వివరంగా తెలుసుకుందాం.
1 ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం (Prime Minister Ujjwala Yojana Scheme)
మనదేశంలో గ్రామీణ ప్రాంతంలో అనేకమంది కట్టెల పొయ్యి ద్వారానే వంట చేసుకునేవారు.దాని వల్ల కాలుష్యం తో మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద కుటుంబాల మహిళల యొక్క సంక్షేమం కోసం 2016 లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి పేదలందరికీ వారి కుటుంబాలకి ప్రభుత్వ ఖర్చులతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించారు. ఈ పథకం ద్వారా దేశంలో కోట్లాదిమంది మహిళలకు లబ్ధి చేకూరిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలలో సహితం అనేకమంది LPG వాడుతున్నారు అంటే ఈ పథకం దేశంలో అద్భుతంగా అమలు అయింది అని చెప్పవచ్చు.
2 స్వచ్ఛ భారత్ మిషన్ పథకం (Swachh Bharat Mission Scheme)
భారతదేశంలో పరిశుభ్రతను పెంచాలి అనే గొప్ప మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని 2014 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛభారత్ మిషన్ (Swachh Bharat Mission) ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పట్టణాలలో అలాగే గ్రామీణ ప్రాంతాలలో అనేకమంది కుటుంబాలకి మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో వారి యొక్క అవసరాల కోసం బయటకు వెళ్లే సమస్య నుండి మన దేశం యొక్క స్త్రీల ఆత్మ గౌరవాన్ని ఈ పథకం ద్వారా నిలబెట్టారు అని చెప్పవచ్చు. బహిరంగ మలవిసర్జన చేయకుండా చాలామంది ఈ పథకం ద్వారా మరుగుదొడ్లను నిర్మించుకుని ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యకరంగా జీవిస్తూ ఉన్నారు. ఈ పథకం దేశంలో అనేక ప్రాంతాలలో కూడా అమలు అయింది.
3. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం (Prime Minister Jan Dhan Yojana Scheme)
నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఈ పథకం అద్భుతంగా అమలు అయింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మాత్రమే కలిగి ఉండేవారు. కానీ ఈ పథకం ద్వారా మారుమూల గ్రామాలలో సైతం మహిళలైనా, పురుషులైనా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండేలా ప్రోత్సహించారు. మినిమం డిపాజిట్ లేకుండా అనేకమందికి బ్యాంక్ అకౌంట్లను ఈ పథకం ద్వారా అందించారు. దీనివల్ల దేశంలో ఎన్నో కుటుంబాల యొక్క రూపురేఖలు మారాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి గవర్నమెంటు ప్రజలకు ఇస్తున్నటువంటి డబ్బులు నేరుగా ఆ అకౌంట్ లోనే జమ అవుతున్నాయి. దాని ద్వారా కూలి చేసుకునే కుటుంబాల నుండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారి వరకు బ్యాంకులో డబ్బులు దాచుకోవడం అనేది అలవాటు చేసుకున్నారు. అది ప్రజలకు మాత్రమే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థను కూడా బలోపేతం చేశాయి. దేశం యొక్క ఆర్థిక పురోగతిని మెరుగుపరిచాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.
4 ఆయుష్మాన్ భారత్ పథకం (Ayushman Bharat Scheme)
సామాన్య ప్రజల యొక్క ఆరోగ్య భద్రత కొరకు 2018 లో ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి బీమా పథకాలలో ఒకటిగా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొంది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి కుటుంబాలకు వివిధ రకాల వైద్య చికిత్సల కోసం సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యం బీమా ను ప్రభుత్వం అందించింది. ఇది ఒక గొప్ప సామాజిక భద్రత పథకం అని చెప్పవచ్చు.
5. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (Prime Minister’s Housing Scheme)
దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అనే అద్భుతమైన సంకల్పం ద్వారా పుట్టిన పథకమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Prime Minister Awas Yojana). ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతంలోనూ అలాగే గ్రామీణ ప్రాంతంలో నూ నివసించే నిరుపేదల కోసం పెద్ద సంఖ్యలో ఇళ్లను నిర్మించి ఇచ్చారు. దేశంలో ప్రతి కుటుంబానికి కనీసమైనటువంటి వసతి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా అనేకమంది ఇప్పుడు తన సొంత ఇంటి కలలు నెరవేర్చుకొని జీవిస్తున్నారు.
6. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Samman Nidhi Scheme)
దేశంలోని రైతులకి చేయూతను అందించే అద్భుతమైన పథకాన్ని 2019 లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి రైతుకి ప్రభుత్వం సంవత్సరానికి 6000 రూపాయల ఆర్థిక సాయం ని అందిస్తూ వస్తుంది. ఈ డబ్బులు మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతున్నాయి. ఈ పథకం ద్వారా చిన్న, మధ్య తరగతి రైతులు అనేకమంది లబ్ధి పొందుతున్నారు.
7. డిజిటల్ ఇండియా (Digital India)
ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశము ఈ విధంగా క్యూఆర్ కోడ్ ,UPI ద్వారా చిన్న షాప్ అయినా, పెద్ద షాప్ అయినా తక్కువ మొత్తమైన, ఎక్కువ మొత్తంలో ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం డిజిటల్ ఇండియా అనేటటువంటి నినాదమే. 2015లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించి అద్భుతంగా డిజిటల్ ఇండియా (Digital India) ప్రచారాన్ని మొదలుపెట్టింది. దీని ద్వారా ఆన్లైన్ సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఈ గవర్నెన్స్ వంటివి ఎక్కువగా మొదలయ్యాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ అన్ని డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగానే మన దేశంలో ఇంత అద్భుతంగా అభివృద్ధి చేశారు.
8 జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission)
దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి సురక్షితమైనటువంటి మంచి నీరు అందించాలని మంచి సంకల్పంతో 2019 లో జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకి నేరుగా త్రాగునీటిని అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది గ్రామాలకి నీటి సౌకర్యం లభించింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కేవలం బోరింగులు, బావులు మాత్రమే నీటికి ఆధారంగా అనిపించేది. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో త్రాగునీటి కొళాయిలు వచ్చాయంటే దానికి కారణం ఈ పథకం.
9.మేకింగ్ ఇండియా ప్రచారం (Make in India campaign)
భారతదేశాన్ని అంతర్జాతీయ తయారీ రంగంలో అభివృద్ధి చేసేందుకు ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని మార్చే లక్ష్యంతో 2014 లో మేకింగ్ ఇండియా ప్రచారం (Make in India campaign) ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ తయారీ ఆటోమొబైల్స్ వంటి అనేక రకాల కీలక రంగాలలో విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించడం పై ప్రభుత్వం ప్రత్యేక,దృష్టి పెట్టింది. ప్రస్తుతం ప్రపంచ మొబైల్ తయారీ రంగంలో భారత్ సాధించినటువంటి అద్భుతమైన విజయాలు దీనికి నిదర్శనం
10.స్టార్ట్ అప్ ఇండియా పథకం (Start-up India Scheme)
దేశంలో యువతలో దాగి ఉన్నటువంటి సరికొత్త ఆవిష్కరణ లను క్రొత్త వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు దీనివల్ల దేశంలో ఉన్నటువంటి సరికొత్త వ్యాపార వ్యవస్థలని అభివృద్ధి చేశారు. నేడు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల స్టార్ట్ అప్ కంపెనీలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
11.పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (PM Gati Shakti National Master Plan)
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత బలోపేతం చేయడం కోసం 2021 లో పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (PM Gati Shakti National Master Plan)ని ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి రోడ్లు, రైలు మార్గాలు, ఓడరేవులు విమానాశ్రయాలు, లాజిస్టిక్ నెట్వర్క్ లను ఒకే ప్లాట్ఫారం కిందికి తేవడమే ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ విభాగాల మధ్య సరైన అటువంటి సమన్వయం కోసం అలాగే వివిధ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది.
12.జాతీయ విద్యా విధానం (National Education Policy)
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల విద్యారంగంలో గత మూడు దశాబ్దాలుగా జరిగినటువంటి అతిపెద్ద సంస్కరణ ఈ జాతీయ విద్యా విధానం (National Education Policy). ఈ పథకం ద్వారా దేశంలో పాఠశాలల విద్య నుండి ఉన్నత విద్య వరకు సమగ్రమైన, నాణ్యమైన విద్యను అనేక రకాల మార్పులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తు తరాలకు పూర్తి నైపుణ్యమైనటువంటి విద్య,వినూత్నమైన అలాగే ప్రపంచ పోటీ తత్వానికి అనుకూలంగా ఉండేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశంలో మోడీ నాయకత్వంలో అనేక రకాల ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టారు అయితే వాటిలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ చర్చించడం జరిగింది . దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు భవిష్యత్తు మార్పులు మనం ఊహించి చెప్పలేం కానీ పార్టీలు ఏవి వచ్చినా మన దేశానికి మన దేశ ప్రజలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
