మతం మారితే కులం మారుతుందా? ఒక నిజ జీవిత ప్రశ్న
హిందూ ధర్మంలో భీమయ్య – బానిసత్వపు బాల్యం
పుట్టుకతో వచ్చిన శాపం
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఒక మారుమూల గ్రామంలో భీమయ్య జన్మించాడు. రామయ్య తల్లి ఇంటి దగ్గరే ప్రసవం అయ్యింది. ఎందుకంటే వారికి ఆసుపత్రులు కానీ డాక్టర్ కానీ అందుబాటులో ఉండేవారు కాదు. మంత్రసాని పాత పద్ధతులతో ప్రసవం చేసింది. భీమయ్య మొదటి ఏడుపుని, ఆ గ్రామంలోని దేవాలయ గంటలు మోగించే బ్రాహ్మణుడు సుబ్బన్న కూడా విన్నాడు. సుబ్బన్న వెంటనే కామేశ్వరరావు దగ్గరికి వెళ్లి చెప్పాడు: “దొరా, మాదిగ చంద్రమ్మకు మగపిల్లాడు పుట్టాడు. మనకి ఇంకొక కూలివాడు వచ్చాడు.”
చిన్నతనంలో భీమయ్యకు తన పరిస్థితి గురించి తనకు ఏమీ అర్థం అయ్యేది కాదు – అతను ఎందుకు ఊరి చివరన, చెత్త కుప్పల పక్కన నివసించాలి? ఎందుకు అతను బావి దగ్గర నీళ్ళు తీసుకోవడానికి వెళ్తే, అగ్రకుల పిల్లలు “జాగ్రత్త, ఈ నీళ్ళు మాదిగోడు తాకేస్తాడు” అని అరుస్తారు?
ఒకసారి భీమయ్యకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. అతను గుడి దగ్గర ఆడుకుంటున్నాడు. ఒక అగ్ర కులం పిల్లవాడు అతని మీద రాయి విసిరి, “పోరా మాదిగోడ, దేవుడి ముందు నీ నీడ కూడా పడొద్దు” అన్నాడు. భీమయ్య ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిని అడిగాడు: “అమ్మా, మనం ఎందుకు ఇలా ఉన్నాము?” చంద్రమ్మ కళ్లలో నీరు పెట్టుకుంది. “అయ్యా, మనం పుట్టిందే మాదిగ జాతి లో. శివుడి వాహనం వృషభం, బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన కులాలు. మనం శివుడి పాదాల కింది దుమ్ము కూడా కాము. అని మా అమ్మ నాకు చెప్పింది.”
బాల్యంలో పనులు – ఏడేళ్ళ వయసులోనే బానిసత్వం, కష్టాలు, కన్నీళ్లు.
భీమయ్యకు ఏడేళ్లు వచ్చేసరికి, అతను పాఠశాలకు వెళ్లలేదు. బదులుగా, ప్రతి రోజు ఉదయం 4 గంటలకు లేచి, కామేశ్వరరావు గారి పొలంలో పనికి వెళ్లాలి. అతని పని – పశువులను నీళ్ళకు నడపడం, పేడ ఏరడం, గడ్డి కట్టలు మోయడం. ప్రతిరోజూ చీకటి పడే వరకు పని. అంత పనిచేసిన కూడా చివరకు తనకు సాయంత్రం దొరికేది ఒక రొట్టె ముక్క, ఒక గిన్నెడు గంజి.
అతని తండ్రి పోతురాజు చేసే పనులు మరింత హీనమైనవి:
ఆ ఊరిలో ఎక్కడ పశువులు చనిపోయిన వాటిని తీసుకెళ్లి దూరంగా పడేయాలి, వాటి యొక్క చర్మాన్ని తీయాలి.
ఊరిలో ఉన్న మురికి కాలువలు శుభ్రం చేయాలి. పెద్ద కులపోల్లా దొడ్లలో మనుషులపెండెత్తాలి. వారి ఇళ్లలో హీనమైన పనులన్నీ చేయాలి. లేకపోతే చచ్చేదాకా కొట్టేవారు.
అగ్ర కులంలో ఎవరైనా చనిపోతే వాళ్ల ఇంటి ముందు డప్పు కొట్టాలి. చచ్చిన శవాలను మోయాలి, స్మశానంలో గుంతలు తీయాలి, స్మశానంలో శవాలను తగలబెట్టాలి.
ఒకరోజు పోతురాజు ఒక చనిపోయిన ఆవు చర్మాన్ని తొలగిస్తున్నాడు. కామేశ్వరరావు అక్కడికి వచ్చి, పోతురాజును కాలితో తన్నాడు. “పోరా పోతురాజు, ఎంత సేపు పడుతుంది? సాయంత్రం లోగా చర్మాన్ని మాయం చెయ్యి. లేదంటే మీ కుటుంబానికి రేషన్ బియ్యం లేదు.” పోతురాజు తలవంచుకుని “అలాగే దొరా” అన్నాడు.
ఇక్కడ మాల, మాదిగలు పూర్తి బానిసల వలె ఎటువంటి ప్రతిఘటనా లేకుండా పనులు చేయించుకోవడం, తినడానికి ఒక పూట గంజికి తల ఒగ్గడం.ఇదే వారి జీవితం.
దేవుడి ముందు కూడా మాల మాదిగల కుల వివక్ష
భీమయ్య తల్లి చంద్రమ్మ చాలా భక్తురాలు. ఆమె ప్రతి శివరాత్రికి గుడికి వెళ్లాలనుకుంటుంది. కానీ గుడి అర్చకుడు ఆమెను లోపలికి అనుమతించడు. “పాపం, నువ్వు మాదిగ దానివి. దేవుడి విగ్రహానికి దూరంగా ఉండు. గుడి గోడ బయట నిలబడి దేవుణ్ణి చూసుకోవచ్చు. లోపలికి రావడం దోషం” అనేవాడు.
ఒకసారి చంద్రమ్మకు చాలా కోపం వచ్చింది. “దేవుడు అందరికీ సమానం అని నువ్వే చెప్పావు, సుబ్బన్నగారు. అలాగైతే నాకు ఎందుకు లోపలికి రానీయవు?” అని ప్రశ్నించింది. సుబ్బన్న నవ్వి, “దేవుడు సమానమే కానీ, అతని కొలువులో వుండే మేము బ్రాహ్మణులం. మేము స్పృశింపదగిన వారం. మీరు అస్పృశ్యులు. ఇది శాస్త్రం. నీకు తెలియదా?” మాదిగ దాన నాకు చెప్పే దానివా! తన మీద కన్న చేశాడు దాంతో భయపడి చంద్రమ్మ వెళ్ళిపోయింది.
అగ్రకులాల వారి వేధింపులు
భీమయ్య పెరిగే కొద్దీ, అతని తెలివి బయటపడింది. అతను రహస్యంగా గ్రామంలోని ప్రభుత్వ స్కూలుకు వెళ్లేవాడు. కానీ అక్కడ కూడా, మాస్టారు చివరన విద్యార్థులందరూ బెంచీల మీద కూర్చుంటే, తనను మాత్రం క్రింద కూర్చోబెట్టేవారు. ఒకసారి ఒక అగ్ర కులం పిల్లవాడు అతని తలమీద ఉమ్మివేశాడు. భీమయ్య కోపంగా చూశాడు. అప్పుడు మాస్టారు అన్నాడు: “భీమయ్య, నీ బ్రతుకేందో తెలుసుకో” అని కోపంగా చూశాడు.
భీమయ్యకు 12 ఏళ్లు వచ్చేసరికి, అతను పాఠశాల మానేశాడు. ఎందుకంటే అతన్ని ప్రతిరోజూ “మాల, మాదిగ” అనే దూషణలు విని విని అలసిపోయాడు.
పెళ్లి – మరొక బంధం
భీమయ్యకు 18 ఏళ్లు వచ్చినప్పుడు, అతని పెళ్లి మరియమ్మతో జరిగింది – మరో మాదిగ కుటుంబం. వారి పెళ్లి గుడిలో జరగలేదు, ఎందుకంటే గుడిలో మాల, మాదిగల వివాహానికి అనుమతి లేదు. అందుకోసం వారు ఊరి చివరన ఒక పందిరి వేసి, ఒక పెద్దాయన చదివించే కొన్ని మంత్రాలతో వివాహం జరిగింది.
ఆ తర్వాత భీమయ్య కూలీ చేస్తూ, మరియమ్మ పొలంలో పని చేస్తూ, ఎటో జీవితం గడిపారు. వారికి ఇద్దరు పిల్లలు – బాలకృష్ణ, సుశీల.
హిందుత్వం నుండి క్రైస్తవం లోకి మార్పు– నూతన ఆశ
పాస్టర్ జాన్ రాక
గ్రామానికి ఒక మిషనరీ సంస్థ వచ్చింది. పాస్టర్ జాన్ అనే వ్యక్తి ప్రతిరోజూ సాయంత్రం ఊరి చివర ఒక గుడారం వేసి బైబిలు బోధించేవాడు. అతను చెప్పేది: “దేవుని ముందు అందరూ సమానం. కులం లేదు, బ్రాహ్మణుడు లేడు, మాల లేడు, మాదిగ లేడు. ఎందుకంటే మీరందరూ యేసుక్రీస్తులో ఒక్కటే.”
ఈ మాటలు భీమయ్య చెవుల్లో తియ్యగా పడ్డాయి. మొదటిసారి ఒక మత గురువు అతన్ని “మనిషి”గా చూశాడు. పాస్టర్ జాన్ అతన్ని భుజంమీద చేయి వేసి, “సోదరా, నీకు నిజమైన స్వేచ్ఛ యేసులోనే ఉంది” అన్నాడు.
మరియమ్మ మొదట సందేహించింది. “భీమయ్యా, ఇది మన దేవుళ్లను కించపరచడం కాదా?” అని అడిగింది. కానీ ఒక రోజు, ఆమెకు జ్వరం వచ్చినప్పుడు, పాస్టర్ జాన్ వచ్చి ప్రార్థన చేసి, కొన్ని మందులు ఇచ్చాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుంచి ఆమెకు పాస్టర్ అంటే విశ్వాసం కలిగింది.
బాప్టిజం – కొత్త జీవితం
భీమయ్య, మరియమ్మ, శాంతిలాల్ (అతని మాల స్నేహితుడు) – ముగ్గురూ కృష్ణా నదిలో బాప్టిజం పొందారు. ఇది చాలా ముఖ్యమైన రోజు. పాస్టర్ జాన్ నీళ్లలో ముంచి, “నిన్ను యేసు నామంలో బాప్తిస్మం ఇస్తున్నాను, నీవు క్రొత్త సృష్టివి” అన్నాడు.
భీమయ్యకు ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంది. తన మీద ఉన్న “మాదిగ ” అనే బరువు తన భుజాల మీద నుంచి దింపేశారు. అతను అనుకున్నాడు: “ఇకపై నేను క్రైస్తవుడిని. కులం లేదు. అందరూ సోదరులే.”
క్రైస్తవంలో లభించిన ప్రయోజనాలు:
సామాజిక గౌరవం – చర్చిలో అందరూ ఒకే బెంచ్ మీద కూర్చునేవారు. భీమయ్య పక్కన ఒక అగ్ర కులం క్రైస్తవుడు కూర్చోవచ్చు. ఇది అతనికి అపూర్వమైన అనుభూతి.
విద్య – మిషనరీ స్కూలులో బాలకృష్ణ మరియు సుశీలకు ఉచిత విద్య, బట్టలు, భోజనం లభించాయి.
ఆరోగ్య సేవలు – చర్చి వారు నెలకు ఒకసారి ఆరోగ్య శిబిరం నిర్వహించేవారు. భీమయ్యకు తొలిసారి కంటి పరీక్ష చేయించుకునే అవకాశం వచ్చింది.
భాష మార్పు – పాస్టర్ జాన్ వారికి తెలుగు, ఇంగ్లీషు నేర్పించాడు. భీమయ్య కొంత చదవడం, వ్రాయడం నేర్చుకున్నాడు.
వేతనంలో న్యాయం – క్రైస్తవులైన తర్వాత, భీమయ్య ధైర్యంగా కామేశ్వరరావుతో “దొరా, కూలీ డబ్బులు సక్రమంగా ఇవ్వండి” అని అడగడం నేర్చుకున్నాడు. ఇంకా అతను అగ్రకులాల ఇళ్లలో పని చేయడానికి నిరాకరించాడు. అతను చర్చి తోటలో పని చేయడం మొదలుపెట్టాడు.
సామాజిక రక్షణ – ఎవరైనా అతన్ని “ఒరేయ్ మాదిగ” అని పిలిస్తే, పాస్టర్ జాన్ గ్రామ సర్పంచ్ దగ్గర ఫిర్యాదు చేసేవాడు. మొదటిసారి భీమయ్య తన కోసం న్యాయం కోరుకోవడం నేర్చుకున్నాడు.
సంతోషకరమైన రోజులు
ఈ 13 సంవత్సరాలు భీమయ్యకు స్వర్గం లాగా ఉండేవి. అతను చర్చిలో ప్రార్థనా నాయకుడిగా మారాడు. అతని గొంతు బాగుండేది – ఆదివారం ప్రార్థన సమయాల్లో అతను “యేసు నా ప్రభువు” పాట పాడేవాడు. ఆయన గొంతెత్తి పాడుతుంటే చర్చి దద్దరిల్లిపోయేది.
బాలకృష్ణ ఇంటర్ పాసయ్యాడు. సుశీల నర్సింగ్ డిప్లొమా చదివింది. భీమయ్యకు చిన్న చర్చి మిషన్ వారు ఒక సైకిలు బహుమతిగా ఇచ్చారు. అతను సైకిలెక్కి తొలిసారి పక్క గ్రామానికి వెళ్లినప్పుడు, అతను ఎంతో గర్వంగా భావించాడు.
మరియమ్మ చర్చి మహిళా సంఘం కార్యదర్శిగా పనిచేసింది. ఆమె చేతిలో నేర్చుకున్న ఎంబ్రాయిడరీ పని బాగా అమ్ముడుపోయేది. కుటుంబానికి ఆర్థిక స్థితి కొంచెం మెరుగుపడింది.
చట్టపరమైన విపత్తు – హక్కులు కోల్పోవడం
ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు
ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి అధికారి పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది. బాలకృష్ణకు డిగ్రీ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. అతను దరఖాస్తు చేసుకున్నాడు.
అతని జాతి ధృవీకరణ పత్రంలో “మాదిగ (SC)” అని ఉంది. కానీ అతను క్రైస్తవుడు. అతను ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది – అతని అప్లికేషన్‌ను ప్రభుత్వ అధికారి తిరస్కరించారు. కారణం: “మీరు క్రైస్తవ మతంలోకి మారారు. కాబట్టి మీరు షెడ్యూల్డ్ కులాల జాబితాలో లేరు.”
కోర్టు కేసు – సుప్రీంకోర్టు తీర్పు వరకు
భీమయ్య మరియు శాంతిలాల్ ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. వారు ఒక న్యాయవాదిని సంప్రదించారు. న్యాయవాది వారికి వివరించాడు: “1990లోనే సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు ఇచ్చింది – క్రైస్తవ లేదా ముస్లిం మతంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ జాబితాలో ఉండరు. దీనికి మూలకారణం 1950 ఎస్సీ ఆర్డర్. ఇప్పటికీ ఆ చట్టం అలాగే ఉంది.”
భీమయ్య నిరాశ చెందాడు. “కానీ నేను ఇప్పటికీ అదే మాలను కదా! నేను మారినది మతం మాత్రమే, కానీ నా రక్తం మారలేదు. నేను ఇప్పటికీ చేతులతో పని చేస్తున్నాను. నా పిల్లలు ఇప్పటికీ సామాజికంగా వెనుకబడి ఉన్నారు. ఎందుకీ అన్యాయం?”
కోర్టు తీర్పు వచ్చింది – వారికి వ్యతిరేకంగా. న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పులో ఇలా రాశారు: “క్రైస్తవ మతం కులాన్ని గుర్తించదు. కాబట్టి క్రైస్తవులుగా మారిన వ్యక్తులు సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఎదుర్కొనరని భావిస్తాం. వారు ఇక ఎస్సీ రిజర్వేషన్లకు అర్హులు కారు.”
ఆ కోర్టు తీర్పు వినగానే మనసు ముక్కలైపోయింది. అతను కోర్టు గది నుంచి బయటకు వస్తూ ఏడ్చాడు. “మా పూర్వీకులు చేసిన బానిసత్వం, శతాబ్దాల వివక్ష – వాటికి విలువ లేదా? మతం మారినంత మాత్రాన ఆ వేదన పోతుందా?”
సామాజికంగా తిరిగి ముందుకు రావడం
ఇప్పుడు భీమయ్య రెండు ప్రపంచాల మధ్య చిక్కుకున్నాడు:
హిందూ ప్రపంచం అతన్ని ఇప్పటికీ “మాల”గా చూస్తుంది, కానీ అతను ఇక హిందువు కాదు.
క్రైస్తవ ప్రపంచం అతన్ని సోదరుడిగా చూస్తుంది, కానీ అతనికి ప్రభుత్వ రిజర్వేషన్ లేదు.
ప్రభుత్వం అతన్ని “ఇతర వెనుకబడిన వర్గం” (OBC) లో కూడా చేర్చదు, ఎందుకంటే అతను పూర్వం SC అయినా ఇప్పుడు క్రైస్తవుడు కాబట్టి.
అతను నిరుపేదగా మారిపోయాడు. బాలకృష్ణ ప్రైవేట్ ఉద్యోగం కోసం అన్వేషించవలసి వచ్చింది, అక్కడ అతనికి తక్కువ జీతం, భద్రత లేని పని దొరికింది. సుశీల నర్సింగ్ పూర్తిచేసినా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం రాలేదు. ఎందుకంటే ఆమె కూడా క్రైస్తవురాలు.
ఎస్సీ అట్రాసిటీ కేసు లేని రక్షణ
భీమయ్య చర్చి నుండి ఇంటికి వెళ్తుండగా, కామేశ్వరరావు కొడుకు నాగేశ్వరరావు (అతను ఇంకా అగ్రకాలాన్ని విడిచిపెట్టలేదు) అతన్ని అడ్డగించి, “ఏయ్ క్రైస్తవ తక్కువజాతి వాడ, మా పొలంలో పని చేయడానికి రావాలి. లేదంటే చూసుకో” అని బెదిరించాడు. భీమయ్య తిరస్కరించాడు. దాంతో నాగేశ్వరరావు అతన్ని కొట్టాడు. భీమయ్య పోలీస్ స్టేషన్లో SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలనుకున్నాడు.
పోలీస్ స్టేషన్లో, సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు: “నీవు క్రైస్తవుడివి కదా? అట్రాసిటీ చట్టం SC, ST వారికి మాత్రమే. క్రైస్తవులకు కాదు. నీ కేసు సామాన్యమైన దాడి కేసు. దానికి సెక్షన్ 324, 506 ఉంటుంది.”
భీమయ్యకు కోపం వచ్చింది. “అయినా నన్ను ‘తక్కువ జాతి’ అని పిలిచి, నా కులాన్ని ఉద్దేశించి కొట్టాడు. అది అట్రాసిటీ కేసు కిందకు రాదా?”
SI నవ్వి, “చట్టం చెప్పింది అదే. మనం ఏం చేయగలం?”
ఆ రోజు భీమయ్య తిరిగి వెళ్లిపోయాడు, న్యాయం కోసం ఎదురుచూస్తూ. ఎప్పటికీ రాని న్యాయం.
మొలుపు తిరిగిన జీవితం – వేదన కథ
కుటుంబంలో చీలిక
రిజర్వేషన్ పోయిన తర్వాత, బాలకృష్ణ చాలా నిరాశ చెందాడు. అతను తండ్రిని నిందించసాగాడు: “నాన్నా, మీరు మతం మారితే మాకేమని? మాకు రిజర్వేషన్ పోయింది. నా స్నేహితులు ఎస్సీలుగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. నేను ప్రైవేట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా కష్టపడుతున్నాను. ఇది న్యాయమా?”
సుశీల కూడా నర్సుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది, కానీ ఆమెకు ప్రభుత్వ నర్సు కంటే 40% తక్కువ జీతం. ఆమె భర్త కూడా క్రైస్తవుడే, అతను కూలీ చేస్తున్నాడు.
మరియమ్మ మనసులో ఎప్పటికప్పుడు సందేహం: “దేవుడు మనల్ని ఇలా చేశాడా? క్రైస్తవులమైనందుకు ప్రభుత్వం మనకు ద్రోహం చేస్తే, ఈ మతం మనకు నిజంగా స్వేచ్ఛనిచ్చిందా?”
గ్రామంలో మరింత ఒంటరితనం
క్రైస్తవులైన తర్వాత, భీమయ్య తన స్వంత సంఘం నుంచి కూడా దూరమైపోయాడు. హిందూ మాలలు, మాదిగలు అతన్ని “మతం మారిన వాడు” అని దూషించేవారు. అతని సోదరుడు రాఘవయ్య కూడా అతనితో మాట్లాడటం మానేశాడు. “అన్నయ్యా, నువ్వు క్రైస్తవుడివైతే, మా హిందూ మాల మాదిగల పండగలకు రాలేవు. మా అమ్మాయి పెళ్లికి రావొద్దు” అన్నాడు రాఘవయ్య.
ఇక అగ్రకులాల వారి విషయం వేరే. వారు అతన్ని “మతం మారినా మాల మాదిగ” అని ఇప్పటికీ పిలుస్తారు. భీమయ్య ఇక ఏ ప్రపంచంలోనూ చెందినట్టు లేడు.
మరియమ్మ అతన్ని హత్తుకుంది. “అయినా మనం మనుషులం, భీమయ్యా. ఒక రోజు చట్టం మారుతుంది. ఒక రోజు మన పిల్లలకు న్యాయం లభిస్తుంది.”
భీమయ్య నిశ్శబ్దంగా తన పాత బైబిలు తెరిచాడు. ఆ పుటలో ఒక వాక్యం చదివాడు: “సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది” (యోహాను 8:32).
అతను నవ్వాడు – చేదు నవ్వు. “సత్యమా? నాకు నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందో?”
చట్టపరమైన ప్రశ్న: కులం జన్మతః వస్తుందా లేదా మతాన్ని బట్టి నిర్ణయించబడుతుందా? వృత్తి ఆధారంగా ఏర్పడిన కులం, శతాబ్దాలుగా ఒకే కుటుంబాలు అదే పని చేస్తుండడం వల్ల కొనసాగింది. ఆ వృత్తి ఇకపై చేయకపోయినా, సమాజం వారిని ఆ కులం ద్వారానే గుర్తిస్తుంది. అలాంటప్పుడు, మతం మారినందుకు వారి ఎస్సీ గుర్తింపు ఎందుకు రద్దు చేయబడుతుంది?
భీమయ్య చివరి మాటలు: “నేను మతం మార్చుకున్నాను, నా రక్తం మార్చుకోలేదు. నేను చేసిన పనులు, నా పూర్వీకులు పడిన బాధలు, నేడు నేను అనుభవించే వివక్ష – ఇవి నా కులానికి చిహ్నాలు. నా మతం కాదు. ఇప్పుడు చట్టం నన్ను ఎస్సీగా గుర్తించకపోతే, నేను ఎవరిని?”
ఈ సమస్య ఒక భీమయ్యది మాత్రమే కాదు దేశంలో అనేకమంది ఎస్సీలుగా ఉన్నటువంటి వారు అనుభవిస్తున్న మనోవేదన.ఒకప్పుడు మాదిగోడివి, నువ్వు మాలోడివి అని నిందించేవారు. సమాజంలో గౌరవం ఉండేది కాదు. దేవుడు దగ్గర గౌరవం ఉండేది కాదు. మనుషులంతా ఒక్కటే అని చెప్పే దేవుళ్ళు కులాలని మాత్రం హీనంగా విభజించారు. ధర్మాల ప్రకారం ఒక మనిషి హీనమైన వాడు అని అని ఏ విధంగా చెప్పిందో? ఏ కోణంలో చెప్పిందో ఇప్పటికే అర్థం కావటం లేదు. ఒక తండ్రికి పుట్టిన నలుగురు పిల్లలని ఒక్క పిల్లవానితో దొడ్లు కడిగించి, మనిషి వ్యర్ధాలను శుభ్రం చేపించే తండ్రి, తండ్రి అని పిలిచే హక్కుకి అర్హుడు అవుతాడా? అసలు దేవుడికి వివక్ష చూపించే లక్షణం ఉంటుందా? దేవునికి సమానత్వపు విలువలు తెలియవా? అటువంటి దేవుణ్ణి ఎందుకు పూజించాలి? ఇది కుల బానిసత్వంలో నలిగిపోతున్న వారి యొక్క వేదన. గుడిలోకి రానీయరు సమాజంలో విలువలు ఇవ్వరు ఇటువంటి సమాజాన్ని ఏమనాలి.
భారతదేశంలో క్రైస్తవులుగా మారిన చాలామంది సమాజం వారి పట్ల చూపించే వివక్ష వలన మాత్రమే జరిగింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి టెక్నాలజీ పెరుగుతున్న ఈ యుగంలో కూడా తక్కువ జాతి వారిని హీనంగా చూడటం మానవ సమాజంలో తొలగిపోవటం లేదు.
ఊరందరికీ చెప్పులు కుట్టే మాదిగోడికి చెప్పులేసుకుని తిరిగే హక్కు ఉండేదా? ఎంత దారుణమైన సమాజం అందుకనే కదా వారికి కూడా విలువ ఉండాలని రిజర్వేషన్లు కల్పించింది.
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఎప్పుడూ లేని విధంగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మరీ దారుణమైన పరిస్థితి. తండ్రి స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులే కులాలని కించపరుస్తూ ఉన్నారు. మతాలని అవమానిస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకులను ఎన్నుకున్న మనం ఎంత దౌర్భాగ్యులము. తండ్రి స్థానంలో ఉండి ప్రతి కులానికి ప్రతి మతానికి సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత ఉండి కూడా నేను ఈ కులం వాడిని, నేను ఈ మతం వాడిని నేను వారి కోసమే బ్రతుకుతా వారికి మాత్రమే పనిచేస్తా! అని చెప్పే ఇటువంటి దౌర్భాగ్య నాయకులని ఎన్నుకొని మన భవిష్యత్తుని మనం నాశనం చేసుకుంటున్నామా ? అని సందేహం కలగక మానదు. ఒకపక్క ప్రతి భారతీయుడికి మత స్వేచ్ఛ ఉంది అని అంటూనే మతం మారితే ప్రభుత్వం ఇచ్చే హక్కులని ప్రభుత్వమే తీసుకుంటుంది. అని చెప్తున్నటువంటి చట్టాలని ఏమనాలో అర్థం కావట్లేదు.
నా దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన శత్రువులు ఎవరో తెలుసా?
కులం, మతం, పేదరికం వీటిని తరిమి కొట్టిన రోజు, వీటిని జయించిన రోజు నా దేశం ప్రపంచంలోనే సంపన్న దేశంగా మారుతుంది. జైహింద్
Legal Disclaimer
ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న కథ, పాత్రలు, సంఘటనలు సామాజిక అవగాహన కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. ఇందులో ఉన్న విషయాలు ఏ ఒక్క మతం, కులం, వర్గం, వ్యక్తి లేదా సంస్థను అవమానించడానికి లేదా కించపరచడానికి ఉద్దేశించినవి కావు.
ఈ కథలో ప్రస్తావించిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగత దృక్కోణాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. ఇవి ఏ ప్రభుత్వ సంస్థ, మత సంస్థ లేదా సమాజపు అధికారిక అభిప్రాయాలను సూచించవు.
భారత రాజ్యాంగం అందించిన మత స్వేచ్ఛ, సమానత్వం, మరియు వ్యక్తిగత హక్కులను గౌరవిస్తూ ఈ ఆర్టికల్ రూపొందించబడింది. ఇందులో చర్చించిన అంశాలు సామాజిక సమస్యలపై చర్చను ప్రోత్సహించడానికి మాత్రమే.
ఈ కంటెంట్‌ను చదివే వారు తమ స్వంత వివేచనతో అర్థం చేసుకోవాలి. ఈ ఆర్టికల్ ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, వాటికి రచయిత లేదా వెబ్సైట్ బాధ్యత వహించదు.
ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
ఇప్పుడే మా యొక్క వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
