
ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో తక్కువ సమయంలో తయారు చేసుకోగల 7 రుచికరమైన వంటకాలు
మనం ఇళ్లలో ప్రతిరోజు అన్నం వండడం సాధారణంగా జరిగే విషయమే, అయితే కొన్నిసార్లు అన్నం ఎక్కువగా వండడం లేదా చేసిన అన్నమే మిగిలిపోవడం జరుగుతుంది. చాలామంది ఈ అన్నం పారేస్తూ ఉంటారు. కొంతమంది అందులో పెరుగు వేసుకొని మిగిలిపోయిన అన్నం తింటూ ఉంటారు. అయితే చాలా సందర్భాలలో అన్నం మిగిలిపోయినప్పుడు దానిని ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటాం. దానివల్ల మన డబ్బులు కూడా వృధా అవుతుంది.. కానీ కొంచెం క్రియేటివిటీతో ఆలోచిస్తే, మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఇందులో మీ కోసం మిగిలిపోయిన అన్నంతో సులభంగా చేయగల 7 వంటకాలను, వాటికి కావాల్సిన పదార్థాలు మరియు అవి ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందామా!
అన్నం వడలు (రైస్ కట్లెట్స్) తయారీ విధానం
మిగిలిపోయిన అన్నంతో చక్కని అన్నం వడలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం
కావాల్సిన పదార్థాలు: మిగిలిన అన్నం – 2 కప్పులు, ఉడికించిన బంగాళదుంప – 1 (మ్యాష్ చేసినది), ఉల్లిపాయ – 1 (మెత్తగా తరిగినది), పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, రవ్వ లేదా బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: మిగిలిన అన్నాన్ని పెద్ద గిన్నెలో వేసి చెంచాతో లేదా చేతితో మెత్తగా మెత్తగా ముద్దలాగ చేయాలి.ఆలుగడ్డలను కూడా మెత్తగా ఉడికించుకొని ముద్దగా చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి . అల్లం వెల్లుల్లి పేస్టు కూడా సిద్ధం చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి అన్నము అలాగే ఆలుగడ్డ పేస్టుని రెండింటిని కలుపుకొని అందులో ఈ మిశ్రమాలన్నింటినీ వేసి బాగా కలిసే వరకు చేత్తో బాగా కలియబెట్టాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడల ఆకారంలో ఒత్తుకొని బానిలో నూనె వేడి చేసుకుని అందులో ఫ్రై చేయాలి. వడలు బంగారు రంగు కలర్ వచ్చేవరకు సన్నని మంట మీద వేయించుకొని తర్వాత టమోటా సాస్ లేదా పుదీనా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచికరంగా ఉంటుంది.
అన్నం ఇడ్లీ తయారీ విధానం
ఇడ్లీలు ఇడ్లీ పిండితో తయారు చేసుకోవడం తెలుసు కానీ అన్నంతో కూడా ఇడ్లీ చేస్తారని తెలుసా? ఎలా చేస్తారు ఏ ఏ పదార్థాలు కావాలి తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు: మిగిలిన అన్నం – 2 కప్పులు, పులిసిన పెరుగు – అర కప్పు, రవ్వ లేదా బియ్యప్పిండి – పావు కప్పు, ఇంగువ – చిటికెడు, బేకింగ్ సోడా లేదా ఈనో – చిటికెడు (ఐచ్ఛికం), ఉప్పు – రుచికి సరిపడా, నూనె – ఇడ్లీ ప్లేట్‌కి పూయడానికి.
తయారీ విధానం: మిగిలిన అన్నాన్ని పులిసిన పెరుగుతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమానికి రవ్వ లేదా బియ్యప్పిండి, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలిపి 2-3 గంటలు పక్కన పెట్టాలి, పిండి కొద్దిగా చిక్కగా అవ్వాలి. ఇడ్లీ వేసే ముందు బేకింగ్ సోడా వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్‌కి నూనె పూసి, ఈ మిశ్రమాన్ని పోసి 10-12 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి. చల్లారిన తర్వాత ప్లేట్ నుండి తీసి కొబ్బరి చట్నీ, సాంబార్‌తో సర్వ్ చేయాలి.
టమాటో రైస్ తయారీ విధానం
మిగిలిపోయిన అన్నం తో రెండు టమాటాలు ఉంటే చక్కని టమాటా రైస్ తయారు చేసుకోవచ్చు. ఎలా చేస్తారు ఏ పదార్థాలు కావాలి చూద్దామా
కావాల్సిన పదార్థాలు: మిగిలిన అన్నం – 2 కప్పులు, పండిన టమాటాలు – 3 (తరిగినవి), ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 4, పచ్చిమిర్చి – 2, సాంబార్ పొడి లేదా గరం మసాలా – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. తరిగిన టమాటాలు వేసి, పసుపు వేసి, మెత్తగా మగ్గి నూనె పైకి వచ్చేవరకు ఉడికించాలి. సాంబార్ పొడి లేదా గరం మసాలా వేసి బాగా కలపాలి. చివర్లో మిగిలిన అన్నం వేసి, జాగ్రత్తగా కలుపుతూ 2-3 నిమిషాలు మీడియం మంటపై ఉడికించాలి. ఉప్పు సరిచూసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
పెరుగన్నం (కర్డ్ రైస్)
పెరుగు అన్నం అందరూ తినేది కానీ మసాలా పెరుగన్నం మరింత టేస్ట్ గా ఉంటుంది దాన్ని ఎలా చేస్తారో తెలుసుకుందాం
కావాల్సిన పదార్థాలు: మిగిలిన అన్నం – 2 కప్పులు, తాజా పెరుగు – 1 కప్పు, పాలు – పావు కప్పు, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం తురుము – అర టీ స్పూన్, నూనె – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: మిగిలిన అన్నాన్ని గిన్నెలో వేసి, పాలు వేసి మెత్తగా మ్యాష్ చేయాలి, తర్వాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. చిన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసి కొద్దిసేపు వేయించి ఈ తాలింపును పెరుగన్నంలో వేసి బాగా కలపాలి. కావాలంటే దానిమ్మ గింజలు లేదా ద్రాక్ష వేసి అలంకరించవచ్చు. మామిడికాయ ఊరగాయతో సర్వ్ చేస్తే రుచి రెట్టింపు అవుతుంది.
లెమన్ రైస్ (నిమ్మకాయ అన్నం)
కావాల్సిన పదార్థాలు: మిగిలిన అన్నం – 2 కప్పులు, నిమ్మకాయ – 1 (రసం తీసినది), వేరుశనగలు – 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు – 1 టీ స్పూన్, మినపప్పు – 1 టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు, ఇంగువ – చిటికెడు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: బాణలిలో నూనె వేడి చేసి వేరుశనగలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే నూనెలో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి పసుపు వేయాలి. వెంటనే మిగిలిన అన్నం వేసి, వేయించిన వేరుశనగలు వేసి బాగా కలపాలి. మంట ఆపేసిన తర్వాత నిమ్మరసం పిండి, ఉప్పు సరిచూసుకుని బాగా కలపాలి (వేడి మీద నిమ్మరసం వేస్తే చేదు రావచ్చు, కాబట్టి మంట ఆపేసిన తర్వాతే వేయాలి).
వెజ్ ఫ్రైడ్ రైస్
కావాల్సిన పదార్థాలు: మిగిలిన అన్నం – 2 కప్పులు, క్యారెట్ (సన్నగా తరిగినది) – అర కప్పు, బీన్స్ – పావు కప్పు, క్యాప్సికం – పావు కప్పు, ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది), వెల్లుల్లి రెబ్బలు – 4, సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, స్ప్రింగ్ ఆనియన్ – గార్నిష్‌కి.
తయారీ విధానం: బాణలిలో నూనె వేడి చేసి వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికం వేసి మీడియం మంటపై 3-4 నిమిషాలు వేయించాలి, కూరగాయలు క్రంచీగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి వేసి కలపాలి. చివర్లో మిగిలిన అన్నం వేసి, విడివిడిగా విడిపోయేలా జాగ్రత్తగా కలుపుతూ 2-3 నిమిషాలు వేడి చేయాలి. ఉప్పు సరిచూసుకుని స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
7. అన్నం దోశె (రైస్ దోశ)
దోసె పిండితో దోసెలు తిన్నాం కానీ అన్నంతో వెరైటీగా దోసెలు చేసుకుని ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు: మిగిలిన అన్నం – 2 కప్పులు, మినపప్పు – పావు కప్పు, మెంతులు – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – దోశలు వేయడానికి సరిపడా.
తయారీ విధానం: మినపప్పు, మెంతులు కలిపి 4-5 గంటలు నానబెట్టాలి. మిగిలిన అన్నాన్ని కూడా విడిగా అర గంట నానబెట్టాలి. నానిన మినపప్పును మెత్తగా రుబ్బి, తర్వాత అన్నం వేసి కలిపి మళ్ళీ కొద్దిగా రుబ్బాలి, పిండి దోశ పిండిలా చిక్కగా ఉండాలి. ఉప్పు వేసి కలిపి రాత్రంతా లేదా 6-8 గంటలు పులియబెట్టాలి. పులిసిన తర్వాత పిండిని బాగా కలిపి, వేడి చేసిన పెనం మీద పలచగా దోశలు వేసి, రెండువైపులా కరకరలాడే వరకు కాల్చాలి. కొబ్బరి చట్నీ, సాంబార్‌తో వేడివేడిగా సర్వ్ చేయాలి.
మిగిలిపోయిన అన్నాన్ని పారేయడం కంటే, పైన చెప్పిన 7 వంటకాల్లో ఏదోఒకటి ప్రయత్నిస్తే ఆహార వృథాను తగ్గించడమే కాక, కొత్త రుచులను కూడా ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలన్నీ తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే తయారు చేసుకోగలిగినవి. మీ ఇంట్లో మిగిలిన అన్నంతో ఏ వంటకం ఎక్కువగా చేస్తారో కామెంట్స్‌లో మాకు తెలియజేయండి.


