జూన్ 30 వరకు భారీ వర్షాలు, పిడుగులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మీ జిల్లా వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతోకాలంగా ఎండలు, ఉక్కపోత వేధిస్తున్నటువంటి తరుణంలో నైరుతి రుతుపవనాలు చల్లని కబురు తీసుకొచ్చాయి. వాతావరణ శాఖ జారీ చేసినటువంటి తాజా వివరాల ప్రకారం జూన్ 25 నుండి జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు పలు జిల్లాల్లో పడవచ్చని అమరావతి హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావం.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణలో కొంత ఆలస్యంగా విస్తరించాయి. జూన్ 8 తారీఖున జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా తెలంగాణలో అడుగుపెట్టినటువంటి రుతుపవనాలు మధ్యలో పలుమార్లు నిలిచిపోవడంతో విస్తరణలో కొద్దిగా ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు జూన్ 23 నాటికి తెలంగాణ మొత్తాన్ని రుతుపవనాలు కప్పేయడంతో ప్రజలకు ఉక్కపోత నుండి ఎండ నుండి కొద్దిగా ఉపశమనం లభించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా రుతుపవనాల ప్రభావం పూర్తిగా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు ప్రారంభమయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరియు ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో వర్షపాతం మరింతగా తీవ్రం కానుంది.
ఏ జిల్లాలకు వర్షాలు పడే అవకాశం ఉంది
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, పార్వతీపురం, మన్యం ,అల్లూరి ,సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి ,కాకినాడ ,ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది. తెలంగాణలో హైదరాబాద్, సహా అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంషాబాద్ రాజేంద్రనగర్ పలుచోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
రాబోయే రోజులలో మరింత తీవ్రతరం కానున్న వర్షాలు
జూన్ 26 మరియు 27 తేదీలలో ఉత్తర కోస్తా,దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరింత తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ వివరించింది. అలాగే శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూర్, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో జూన్ 26న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ వర్షాల సమయంలో గాలి వేగము గంటకి దాదాపుగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
పెద్దపల్లి లో అత్యధిక వర్షపాతం నమోదు
ఇటీవల కాలంలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కోనారంలో అత్యధికంగా 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఒకరోజులోనే ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం అనేది వాతావరణ తీవ్రతకు నిదర్శనమని చెప్పవచ్చు. రాత్రిపూట అనేక ప్రాంతాలలో కుండపోతలుగా వర్షాలు కురవడం వల్ల నీరు నిలబడటం ద్వారా రోడ్లు జలమయం అవ్వడంతో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొన్నారు.
జూన్ 30 వరకు వర్షాలు కురిసే అవకాశం
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 30వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు విస్తరించడం తో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పూర్తిస్థాయిలో వర్షాకాలం మొదలైందని చెప్పవచ్చు. వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు ఎంతో అవసరం అయినప్పటికీ అతి భారీగా వర్షాలు కురవడం వల్ల, ఒక సారి నష్టం కూడా కలిగిస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో పాటించాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలు
వర్షాలు పడే సమయం లో ప్రజలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదు. బహిరంగ ప్రదేశాలలో, పొలాలలో, నది తీర ప్రాంతాలలో ఉండకూడదు. ఇళ్ల నుండి అనవసరంగా బయటకు వెళ్లడం అనేది మంచిది కాదు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నదులు, వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయకూడదు. వర్షాలు పడి రోడ్లమీద నీరు నిలబడి ఉన్నప్పుడు వాహనాలను జాగ్రత్తగా నడపడం మంచిది. మీ ప్రాంతంలో ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ ఉన్నట్లు తెలిస్తే స్థానికంగా ఉన్నటువంటి అధికారుల సూచనలను తప్పని తప్పకుండా పాటించండి.
రైతులకు ప్రత్యేక సూచనలు
వ్యవసాయదారులకు ఈ వర్షాకాలం సమయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు చాలా అవసరం. పొలాలలో పనులు చేసే సమయంలో మెరుపులు ఉరుములు ఉన్నటువంటి సమయాలలో వెంటనే సురక్షిత ప్రదేశాలకి తరలిపోవాలి. ముఖ్యంగా భారీ చెట్ల నీడలో ఉండకూడదు. పొలాలలో నీరు నిలబడకుండా సరైనటువంటి నీటిపారుదల ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఖరీఫ్ పంటలకు సాగుకు ఇవి అనువైన రోజులైనప్పటికీ వర్షాలు పడే సమయంలో పొలం పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది.
విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం
భారీగా వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ వైర్లు తెగిపోయే అవకాశం ఉంది. మెరుపుల వల్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ప్రజలు తెగిపడినటువంటి విద్యుత్ తీగలను ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. వర్షంలో తడిసినటువంటి పరికరాలను ఉపయోగించవలసి వస్తే అవి పూర్తిగా తేమ లేకుండా ఆరిన తర్వాత మాత్రమే వాటిని వాడుకోవడం మంచిది. ఇళ్లల్లో నీరు నిలబడినట్లయితే తక్షణమే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్ సంబంధిత అత్యవసరమైన పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు APEPDCL లేదా TSSPDCL హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి.
అప్రమత్తం అయినటువంటి ప్రభుత్వాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వర్షాకాలం నుంచి విపత్తు నిర్వహణ బృందాలను అప్రమంతంగా ఉంచాయి. ముఖ్యంగా వరద ప్రాంతాలైనటువంటి గోదావరి, కృష్ణ పెన్నా, నది ప్రాంతాలలో ముందస్తు చర్యలుగా జిల్లా కలెక్టర్లకి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. NDRF, SDRF బృందాలను అవసరమైన చోట్ల మోహరించేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 1070 (రాష్ట్ర విపత్తు నిర్వహణ) లేదా 112 (అత్యవసర సేవలు) కు కాల్ చేయవచ్చు.
మొత్తానికి ఈ వేసవి నుండి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతులకు ఎంతో సంతోషకరమైన వార్త అయినప్పటికీ మరోవైపు అతి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. వాతావరణ శాఖ చారి చేసినటువంటి హెచ్చరికలను పాటిస్తూ మీ జిల్లాలలో వాతావరణ సమాచారం తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి వాతావరణం అప్డేట్స్ కొరకు మా నవయుగం TV ఫాలో చేయండి.
