డిజిటల్ అప్పుల ఊబి: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్ పెట్టడం ఎలా?
లోన్! లోన్! లోన్! సార్, మేడం, మీకు క్రెడిట్ కార్డు (Credit card) అప్రూవల్ ఉంది, లోన్ (Lone) అప్రూవల్ ఉంది అని ఎన్నోసార్లు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాటిని ఇగ్నోర్ చేస్తారు. మరి కొంతమంది ఆ క్రెడిట్ కార్డు (Credit card) లోన్ (Lone) ఉచ్చులో పడిపోతారు. సామాన్యుల మధ్యతరగతి వ్యక్తుల యొక్క అవసరాలను క్యాష్ చేసుకొని పదేపదే మనకు ఫోన్ చేసి లోన్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ మనకు అవసరం లేకున్నా అంటగడుతూ ఉంటారు. కొన్నిసార్లు సేల్స్ ఏజెంట్స్ అనేకసార్లు ఫోన్ చేయడం వల్ల తనకు నిజంగా డబ్బు వస్తుందేమో అవసరాలు తీరుతాయేమో అనే ఆశతో మరికొంతమంది క్రెడిట్ కార్డు (Credit card) లోన్ (Lone) కానీ తీసుకుంటూ ఉంటారు. ఒకసారి మన చేతికి క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ వస్తే సేల్స్ ఏజెంట్ యొక్క టార్గెట్ ముగుస్తుంది. తర్వాత మన టార్గెట్ మొదలవుతుంది, అదేనండి నెలవారి క్రెడిట్ కార్డు (Credit card) రీపేమెంట్స్ లోన్ (Lone) EMI . ఒకవేళ మనం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోతే, క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేయకపోతే? అంతవరకు మనల్ని గౌరవంగా మాట్లాడి తీసుకోమని ఎంకరేజ్ చేసినటువంటి క్రెడిట్ కార్డు (Credit card) లోన్ (Lone) మనకు ఇచ్చినటువంటి వారి అసలైన రంగు బయటపడుతుంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు మరియు ఇన్స్టంట్ లోన్ యాప్‌లు సామాన్యుడి అవసరాలను తీరుస్తున్నప్పటికీ, సరైన అవగాహన లేకపోతే అవి ఒక తీరని ‘రుణ ఊబి’గా మారుతున్నాయి. ముఖ్యంగా రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
లోన్ రికవరీ ఏజెంట్ల హరాస్మెంట్: మీ హక్కులు, చట్టపరమైన పరిష్కారాలు మరియు ఆప్షన్లు
నేడు స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, నిమిషాల్లో లోన్ వచ్చేస్తోంది. “ముందు వాడుకో.. తర్వాత కట్టుకో” అనే ఆకర్షణీయమైన ప్రకటనలతో క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లోన్ యాప్‌లు మనల్ని ఊరిస్తున్నాయి. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో చెల్లించలేకపోతే, ఆ “సహాయం” కాస్తా “నరకం”గా మారుతోంది. రికవరీ ఏజెంట్ల ఫోన్ కాల్స్, బంధువులకు మెసేజ్‌లు, ఇంటి వద్ద గొడవలు.. ఇవన్నీ చట్టబద్ధమేనా? ఒకవేళ కట్టలేని పరిస్థితి వస్తే మనకున్న హక్కులేంటి? తెలుసుకుందాం.
రికవరీ ఏజెంట్లు ఏం చేయకూడదు? (RBI నిబంధనలు)
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రికవరీ ఏజెంట్ల కోసం కఠినమైన నియమాలను రూపొందించింది. బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు ఈ క్రింది పనులు చేస్తే అది నేరం:
అకాల సమయంలో కాల్స్: ఉదయం 8 గంటల కంటే ముందు, రాత్రి 7 గంటల తర్వాత కాల్ చేయకూడదు.
వ్యక్తిగత దూషణలు: అసభ్య పదజాలంతో దూషించడం లేదా శారీరకంగా బెదిరించడం చట్టవిరుద్ధం.
గోప్యత భంగం: కస్టమర్ అనుమతి లేకుండా వారి కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులకు (బంధువులకు, స్నేహితులకు) ఫోన్ చేయడం లేదా లోన్ వివరాలు చెప్పడం తీవ్రమైన నేరం.
సామాజిక వేధింపులు: సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం లేదా ‘డిఫాల్టర్’ అని ప్రచారం చేయడం ఐటీ చట్టం ప్రకారం శిక్షార్హం.
ఆర్థికంగా కట్టలేని స్థితిలో ఉంటే మీకున్న ఆప్షన్స్:
ఒకవేళ మీరు నిజంగానే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి లోన్ కట్టలేకపోతే, పారిపోవడం పరిష్కారం కాదు. ఈ క్రింది మార్గాలను ప్రయత్నించండి:
లోన్ రీస్ట్రక్చరింగ్ (Loan Restructuring): మీ బ్యాంకును సంప్రదించి, మీ ఆర్థిక పరిస్థితిని వివరించండి. వడ్డీ తగ్గించమని లేదా కట్టే కాలపరిమితిని (EMI duration) పెంచమని కోరవచ్చు.
వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS): అసలు మొత్తం కడతామని, వడ్డీ మాఫీ చేయమని బ్యాంకుతో చర్చలు జరపవచ్చు. దీనివల్ల సిబిల్ (CIBIL) స్కోర్ తగ్గుతుంది కానీ, వేధింపులు తప్పుతాయి.
డెట్ కౌన్సెలింగ్: అనేక స్వచ్ఛంద సంస్థలు రుణ విముక్తి కోసం ఉచిత సలహాలను ఇస్తాయి.
రికవరీ ఏజెంట్ల వేధింపులు ఎదురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని టార్చర్ చేస్తుంటే, మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు.
బ్యాంకుకు ఫిర్యాదు
ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ నోడల్ ఆఫీసర్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయండి. 30 రోజుల్లో వారు స్పందించకపోతే తదుపరి అడుగు వేయండి.
ఆర్బీఐ అంబుడ్స్‌మన్ (RBI Ombudsman)
ఇది అత్యంత శక్తివంతమైన వేదిక. RBI Ombudsman వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 14448 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయవచ్చు
లోన్ యాప్‌లు మీ ఫోటోలను మార్ఫింగ్ చేసినా లేదా కాంటాక్ట్స్ వేధించినా వెంటనే cybercrime వెబ్సైట్ లో ఫిర్యాదు చేయండి లేదా 1930 నంబర్‌కు కాల్ చేయండి.
పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు
ఇంటికి వచ్చి గొడవ చేసినా, బెదిరించినా ఐపీసీ సెక్షన్ 506 (బెదిరింపు), సెక్షన్ 509 (మహిళల పట్ల అసభ్యత) కింద స్థానిక పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయవచ్చు.
ముగింపు
అప్పు తీసుకోవడం నేరం కాదు, కానీ అప్పు పేరుతో వేధించడం ఖచ్చితంగా నేరమే. రికవరీ ఏజెంట్ల వేధింపులకు భయపడి ప్రాణాలు తీసుకోవద్దు. చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది. సరైన మార్గంలో పోరాడితే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు.
మీకు ఈ సమాచారం నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలు మా వెబ్సైట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
