ఏపీ స్థానిక పోరులో కూటమి క్లీన్‌స్వీప్ విజయం వెనుక దాగి ఉన్న అసలు రణతంత్రం.. 2029 కోసం జగన్ వేసిన మైండ్‌గేమ్ విశ్లేషణ.
రాజకీయాల్లో బహిరంగంగా మాట్లాడే ప్రతి మాటకు బయటకు ఒక అర్థం ఉంటే, అంతర్గతంగా నడిచే వ్యూహాత్మక సంకేతం వేరేలా ఉంటుంది. కంటికి కనిపించే ఘర్షణల వెనక కనిపించని చదరంగం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections)సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య—“ఎక్కడైనా ఏకగ్రీవమైతే, అక్కడ మన పార్టీ అభ్యర్థికి భవిష్యత్ ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తే లేదు”—ఈ మాట రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.
సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే స్థానిక ఎలక్షన్లలో మెజారిటీ సీట్లు అలాగే స్థానాలు అధికార పక్షమే గెలుస్తుంది. ఇది జగమెరిగిన సత్యం, దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ నిజం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనటానికి ఒక నిగూఢమైన మర్మం దాగి ఉంది.పైకి మాత్రం ఈ మాటలు స్వపక్ష నేతలకు చేసిన హెచ్చరికలా అనిపించిన కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయటానికి చేసిన అంతరార్థం కలిగిన మాటలాగా అనిపిస్తుంది.లోతైన విశ్లేషణ చేస్తే ఈ వ్యాఖ్య వెనుక రాజకీయ శత్రువు మానసిక ప్రవర్తనను కొలవడానికి, కూటమి ప్రభుత్వము (Coalition government) యొక్క నిజస్వరూపాన్ని బహిర్గతం చేయటానికి, 2029 సార్వత్రిక ఎన్నికలకు బలమైన పునాది వేయడానికి పన్నిన అత్యంత పగడ్బందీ ‘మైండ్‌గేమ్’ గా స్పష్టంగా అర్థమవుతుంది.
కథనం: శత్రువును ఉచ్చులోకి లాగిన ప్రాచీన రణనీతి
కళింగ దేశాన్ని పాలిస్తున్న కళింగ రాజు తన పొరుగు రాజ్యాల సైనిక బలంపై ఎప్పటినుంచో అనుమానం ఉంది. అతని సైన్యం ఏ శైలిలో యుద్ధం చేస్తుంది, వారి వ్యూహాల్లోని హింసాత్మక తీవ్రత ఎంతవరకు ఉంటుంది, వారి సైనికుల సహనం ఎక్కడ నశిస్తుంది అనే ప్రాథమిక సమాచారం లేకుండా వారితో తలపడటం అంత తెలివైన పని కాదని కళింగ రాజు గ్రహించాడు.
ఓ పౌర్ణమి రాత్రి, తన అంతరంగిక గూఢచారుల ద్వారా ప్రత్యర్థి రాజ్యపు వేగులకు ఒక సమాచారం ఉద్దేశపూర్వకంగా చేరేలా చేశాడు: “రేపు సాయంత్రం సరిహద్దు కొండ లోయల గుండా నేను స్వల్ప అంగరక్షకులతో మాత్రమే నగరానికి చేరుకుంటాను.”
ఈ వార్త వినగానే శత్రు దేశపు రాజు అలాగే సేనాని సంబరపడిపోయారు. రాజును సులువుగా చుట్టుముట్టి మట్టుబెట్టవచ్చని, ఆ సరిహద్దు లోయను పూర్తిగా కైవసం చేసుకోవచ్చని భావించి తన ప్రధాన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని అటువైపు మోహరించారు. యుద్ధం జరిగింది; కళింగ రాజు స్వల్ప సైన్యం వెనక్కి తగ్గింది. శత్రువు ఆ భూభాగాన్ని ఆక్రమించి, ‘మేము గెలిచాం’ అని విజయదుందుభి మోగించారు.
కానీ ఆ కొండల పైనుంచి గమనిస్తున్న కళింగ రాజు పెదవులపై చిన్న దరహాసం మెరిసింది. కారణం: ఆ చిన్న ఆక్రమణ కోసం శత్రువు తన సర్వశక్తులనూ, వ్యూహాత్మక స్థావరాలనూ, వారి నాయకత్వపు దూకుడు శైలినీ బయటపెట్టుకున్నాడు. శత్రువు తాత్కాలిక విజయోత్సవాల్లో మునిగి తేలుతుండగా, కళింగ రాజు ఆ సమాచారంతో రాబోయే అసలైన మహాసంగ్రామానికి సరికొత్త రణతంత్రాన్ని సిద్ధం చేశాడు.
నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన “ఏకగ్రీవమైతే ఆ అభ్యర్థికి వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదు” అనే ఒక్క వ్యాఖ్య సరిగ్గా ఈ రాజనీతి తరహాలోనే ఉందా? దీని వెనుక ఉన్న లోతైన రాజకీయ సంకేతాలు ఇవేనా?
పొలిటికల్ డికోడ్:ప్రత్యర్థి నీ రెచ్చగొట్టడం,జగన్ మైండ్‌గేమ్ వెనుక అసలు లెక్కలేమిటి?
ఎన్నో అవమానాలు, నిందలు, జైలు జీవితం అనుభవించి అధికారాన్ని సంపాదించిన తర్వాత ఇక మనకు తిరుగులేదు ప్రజలకు మంచి చేస్తున్నాం, ఇక నిరంతరము పాలించేది మనమే, అని సంతోషిస్తూ ఉన్న తరుణంలో అనుకోకుండా ఓటమిపాలు అయిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ (YSRCP party). ఓడిపోయిన తర్వాత గ్రామస్థాయి నాయకుల దగ్గర నుండి పేరున్న పెద్ద నాయకుల వరకు చాలా మంది కేసులను ఎదుర్కొంటున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి తన అయోమయ పరిస్థితి భయాందోళనలో ఉన్న కేడర్ ని మొత్తం పూర్తిస్థాయిలో రోడ్లపైకి తేవడం కూడా అంత సులువైన పని కాదు.ఈ సహజమైన బలహీనత జగన్‌కు తెలియనిది కాదు. అయినా సరే, ఆయన ‘ఏకగ్రీవమైతే టికెట్ లేదు’ అని కరాఖండీగా ప్రకటించారు.
ఈ మాటలతో ఆయన ప్రత్యర్థికి నేరుగా ఒక సందేశం పంపారు. “మీరు గెలవాలంటే మా వాళ్ళని అడ్డుకోవాలి, మా వాళ్ళు నామినేషన్ వేయకుండా ఆపాలి, లేదా బలవంతంగా నామినేషన్ ఉపసంహరింప చేయాలి”
ఇది విన్నాక కూటమి శ్రేణులు సహజంగానే ప్రతిష్టకు పోయాయి. వైయస్సార్సీపి పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకూడదని, అంతట ఏకగ్రీవాలే సాధించి తమ యొక్క సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవాలని భావించాయి. ఫలితంగా క్షేత్రస్థాయిలో నామినేషన్లు దాఖలు మొదలుకొని, ఉపసంహరణల వరకు కూడా కూటమి నాయకులు అత్యుత్సాహాన్ని చూపించారు. ప్రత్యర్థిని అసలు పోటీలోనే లేకుండా చేస్తే తాము సులభంగా గెలవచ్చు అనే ఆరాటంలో అధికార పార్టీలు ఏ స్థాయికి దిగజార గలవు అని ప్రపంచానికి చూపించేలా చేయడమే జగన్ యొక్క ప్రణాళికలో భాగంగా అనిపిస్తుంది.
కూటమి! జగన్ బుట్టలో పడిందా?
ఎన్నికలలో పోటీ అనివార్యమైతే కచ్చితంగా ఘర్షణలు లేదా అధికార దుర్వినియోగం బయటపడతాయి. వైయస్సార్సీపి అభ్యర్థులు బరిలో గట్టిగా నిలబడాలని నిబంధన పెట్టడం ద్వారా కూటమి నేతలు ఏకగ్రీవాలు సాధించడానికి ఏ స్థాయి ఒత్తిడి తీసుకొస్తారు, అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వాడుకుంటారు, అసలు క్షేత్రస్థాయిలో వారి దూకుడు, బలము, ఎంతవరకు వెళుతుంది. అనే పచ్చి నిజాన్ని ప్రజల ముందు ఉంచడమే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం.
పైకి చూస్తే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి నూటికి తొంభై శాతం స్థానాలు కైవసం చేసుకున్నట్లు కనిపిస్తుంది. అధికార పక్ష మీడియా దీనిని ఘనవిజయంగా సంబరాలు చేసుకుంది. కానీ రాజకీయ శాస్త్రం ప్రకారం ఇది ‘పైరిక్ విక్టరీ’ (Pyrrhic Victory)—అంటే భారీ మూల్యం చెల్లించి పొందిన గెలుపులా కనిపిస్తూ ఉంది.
ప్రజాస్వామిక ముసుగు తొలగిపోవడం:ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగాయని చెప్పుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం తనకు తానుగా కోల్పోయింది. భారీ సంఖ్యలో జరిగిన ఏకగ్రీవాలు ప్రజలలో సహజంగానే ఒక ప్రతికూల భావనను కలిగించే విధంగా చేశాయి. అధికార దుర్వినియోగం జరిగిందనే ప్రచారానికి కూడా కూటమి యొక్క దూకుడే ఆజ్యం పోసింది.
అంతర్జాతీయ, జాతీయ మీడియా దృష్టి:నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు, అలాగే కోర్టుకెక్కిన కేసులు, అధికారుల తీరుపై వచ్చిన విమర్శలు ఢిల్లీ స్థాయి వరకు చాలా మంది నాయకుల దృష్టిలో పడ్డాయి. అలాగే ప్రజల దృష్టిని కూడా ఆకర్షించేలా చేశాయి.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి:అధికారం చేపట్టిన తర్వాత ఇంతటి నిరంకుశ పాలన అనుసరిస్తుందా? అనే ప్రశ్నను సామాన్య ఓటరు మదిలో బలంగా నాటడంలో ఈ పరిణామాలు చాలా తోడ్పడ్డాయి.స్థానిక స్థానాలను గెలుచుకున్న కూటమి, నైతిక మైలేజీని కొంతవరకు చేజార్చుకుందనేది నిర్వివాదాంశం.
2029 కోసం స్క్రీనింగ్ టెస్ట్: అసలైన సైనికులను గుర్తించే లాయల్టీ ఫిల్టర్
ఓడిపోయిన తర్వాత ఏ పార్టీకైనా అత్యంత ప్రమాదకరమైన అంశం ఒకటి ఉంటుంది. అదేమిటంటే లోపల ఉంటూనే ప్రత్యర్థి పార్టీతో చేతులు కలిపే ‘కోవర్టులు’, అంటే అధికారం కోల్పోయాక వాళ్ల సొంత అవసరాలకోసం,మనుగడ కోసం, అధికారంలో ఉన్న పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకునే వారు ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉంటారు. దీనికోసం స్థానిక సంస్థల వేదికను ఉపయోగించుకొని జగన్ తన సొంత పార్టీ నాయకత్వం మొత్తానికి కలిపి ఒక అగ్నిపరీక్ష పెట్టారు.
స్థానిక ఎలక్షన్ లలో కూటమి నుంచి బెదిరింపులు వచ్చిన, కేసులు పెట్టిన, భయపడకుండా నామినేషన్ వేసి పోరాడగలిగే కార్యకర్త ఎవరు? భయపడి ఇంట్లో కూర్చున్న నాయకుడు ఎవరు? పైరవీలు చేసి కూటమినేతలతో లోపాయి కారి ఒప్పందాలు చేసుకొని ఏకగ్రీవాలకు సహకరించిన ‘నయా నాయకుడు’ ఎవరు? ఈ వివరాలన్నీ నేడు జగన్ టేబుల్ పై నివేదిక ల రూపంలో ఉంటాయి. రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు కేటాయించడానికి ఇంతకంటే విశ్వసనీయమైనటువంటి డేటాబేస్ మరొకటి ఉండదు.ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు, నిలబడని నాయకుడికి రేపు అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత ఇవ్వకూడదనే స్పష్టత అధిష్టానానికి వస్తుంది. ఈ విధంగా తన సైన్యాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి జగన్ ఈ ఎన్నికలను ఒక సాధనంగా వాడుకున్నారు.
అలాగే 2029 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అని అర్థం చేసుకోవడానికి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ పోరుని ఒక శాంపిల్ సర్వే గా జగన్ ఉపయోగించుకున్నాడు. ఏయే జిల్లాలో టిడిపి క్యాడర్ బలంగా ఉంది, జనసేన ప్రభావం ఏ మేరకు క్షేత్రస్థాయిలో ఓట్లుగా, బలంగా మారింది, కూటమిలోని పార్టీల మధ్య స్థానిక సీట్ల సర్దుబాటులో వచ్చిన అంతర్గత విభేదాలు ఏమిటి? పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఏ మేరకు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతోంది? వంటి అన్ని అంశాలపై వైయస్సార్సీపి (YSRCP) కి నిఖార్సయిన అవగాహన ఏర్పడింది. ప్రత్యర్థి బలం ఎక్కడో ఉందో తెలిస్తే దానిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రచించడం సులభం అవుతుంది. అలాగే ప్రత్యర్థి బలహీనతలు కూడా తెలిసినప్పుడే భవిష్యత్తులో ఆ విభేదాలను మరింతగా ఎలా ఉపయోగించుకోవచ్చో లెక్కలు వేయవచ్చు.
బాధితుల కోణం ద్వారా ప్రజా సానుభూతి సమీకరణ
ఏకగ్రీవాలు పెరిగే కొద్దీ నామినేషన్లు వేయలేకపోయామని, దాడులు జరిగాయని, వైయస్సార్సీపి శ్రేణులు క్షేత్రస్థాయిలో బాధితులుగా ప్రజలలోకి వెళ్లే అవకాశం లభించింది. భారతీయ రాజకీయాల్లో అన్నింటికంటే శక్తివంతమైన భావోద్వేగం ‘బాధిత తత్వం’ (Victimhood). అధికారంలో ఉన్నప్పుడు చూపించిన దూకుడు కంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురయ్యామనే భావనే ప్రజల్లో ఎక్కువగా సానుభూతిని రేకెత్తిస్తుంది. భవిష్యత్తులో న్యాయపోరాటాలకు ప్రజల ఉద్యమాలు నిర్మించడానికి అవసరమైనటువంటి గ్రౌండు ప్రిపరేషన్ ని ఈ ఎలక్షన్ ప్రక్రియ ద్వారా YSRCP సమకూర్చుకుంది.
ఏకగ్రీవాల కోసం జరిగిన ప్రయత్నాలు, నామినేషన్ల తిరస్కరణల ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ‘బాధితులు’గా నిలిచారు. ఈ పరిణామం శ్రేణులను మానసికంగా ఏకం చేయడానికి, ప్రభుత్వంపై పోరాట పటిమను పెంచడానికి ఒక ఆయుధంగా మారింది. “మాపై దాడులు జరుగుతున్నాయి, మా హక్కులను కాలరాస్తున్నారు” అని ప్రజల ముందుకు వెళ్లి ధర్నాలు చేయడానికి, కోర్టుల్లో పిల్స్ వేయడానికి, శాంతిభద్రతల సమస్యను ఎత్తిచూపడానికి ఒక బలమైన వేదిక దొరికింది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎలక్షన్ల లో కూటమి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని పై చేయి సాధించినట్లు కనిపించిన, లోతైన రాజకీయ విశ్లేషణ ప్రకారం, శత్రువు దాడి స్వభావాన్ని అంచనా వేయడానికి, తన సొంత దళంలో అసలైన సైనికులను గుర్తించడానికి జగన్మోహన్ రెడ్డి కావాలనే ఈ ఎత్తుగడని వేశారు అని అనిపిస్తుంది. రాబోయే 2029 మహాసంగ్రామానికి కూటమి యొక్క వ్యూహాలను నిశితంగా పరిశీలించి వాటిని తిప్పికొట్టగలిగే సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లు దోహదపడ్డాయని స్పష్టమవుతుంది.
రాజకీయ చదరంగంలో నెక్స్ట్ మూవ్ ఎవరిది?
చరిత్రలో గొప్ప గొప్ప నాయకులు ఎవరూ తక్షణమైన బలాల కోసం ఆలోచించరు. వారు తాత్కాలికంగా ఒక కోటను లేదా ఒక సరిహద్దును లేదా ఒక పల్లెను కోల్పోవడానికి సిద్ధపడతారు. కానీ అంతిమంగా యుద్ధాన్ని గెలవడమే వారి యొక్క అసలైన లక్ష్యం.
స్థానిక సంస్థల ఫలితాలు కూటమి ప్రభుత్వం యొక్క ఖాతాలో అంకెలను నింపాయి; సందేహం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి తన ప్రకటన ద్వారా ప్రత్యర్థి సైనిక వ్యూహాన్ని బయటికి లాగారు. ప్రభుత్వ పాలన శైలిలోని దూకుడును, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందా?లేదా? అని ప్రజల కళ్లకు కట్టినట్లుగా చూపించారు. తమ పార్టీలో నిజమైన విధేయులెవరో, వెన్ను చూపించే వారెవరో గుర్తించారు. అన్నిటికీ మించి 2029 ఎన్నికల కోసం ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత విత్తనాలను నాటడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేసుకున్నారు.
రాజకీయాల్లో యుద్ధం ఎప్పుడు ఒక రోజుతో ముగిసిపోదు. ఒక చిన్న సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి ప్రత్యర్థుల యొక్క గుట్టుమట్లను కనిపెట్టిన ప్రాచీన రాజు లాగే-వైయస్ జగన్ కూడా తన ఏకగ్రీవ వ్యాఖ్యలతో కూటమి ఆలోచన విధానాన్ని, వ్యూహాలను రికార్డు చేశారు. ఈ రికార్డు ఆధారంగా రాబోయే రోజుల్లో ఆయన వేబోయే ఎత్తులు, పైఎత్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తాయో అని వేచి చూడాలి. తాత్కాలికంగా గెలిచినవారు ఆనందంలో మైమరచిపోతే, ఆ గెలుపు వెనుక పన్నిన వ్యూహాన్ని గుర్తించకపోతే అంతిమ పోరాటంలో ఫలితాలు తారుమయ్య ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది.
గమనిక (Disclaimer):
ఈ కథనంలో పేర్కొన్న అంశాలు పూర్తిగా రచయిత మరియు రాజకీయ పరిశీలకుల వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే. ఇది కేవలం పాఠకులకు రాజకీయ సమాచారం, విశ్లేషణాత్మక అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రచురించిన కథనం. ఏ రాజకీయ పార్టీని గానీ, నాయకులను గానీ వ్యక్తిగతంగా కించపరచడం మా ఉద్దేశం కాదు. అలాగే ఈ కంటెంట్ ఏ ఒక్క పార్టీకి మద్దతుగానో, వ్యతిరేకంగానో ఉద్దేశించినది కాదు.









