ఆంధ్ర స్టైల్ గుంటూరు రొయ్యల ఫ్రై
ఆంధ్ర వంటకాల గురించి మాట్లాడే సమయంలో గుంటూరు మిర్చి యొక్క ఘాటు మనకు గుర్తు రాకుండా ఉండదు. ఆ ఘాటుకి రొయ్యలు తోడైతే వచ్చేదే గుంటూరు రొయ్యల ఫ్రై. తాజా రొయ్యలకు కారము, మసాలా బాగా పట్టి, నూనెలో దోరగా వేయించేటప్పుడు వచ్చే సువాసన ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం అన్నంతో కలుపుకొని లేదా సాయంకాలం వేడివేడి స్నాక్ గా తీసుకుంటే ఆ రుచికి ఏదీ సాటి రాదు.
ఈ వంటకం ఎందుకు అంత ప్రత్యేకమైనది
గుంటూరు ప్రాంతంలో పండించే మిర్చికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉందని అందరికీ తెలిసిన విషయమే. అక్కడి వంటింట్లో కారం అంటే అది కేవలం వంటే కాదు దానికి ఒక చక్కని రంగు, రుచి, వాసన ఆ టేస్టే వేరు. అందుకే గుంటూరు స్టైల్ రొయ్యల ఫ్రై లో కారం ఎక్కువగా ఉన్న ఆ ఘాటు రొయ్యల తీపి తో కలిసి ఒక చక్కని రుచిని తయారు చేస్తుంది. ఇంట్లో చేసే సాధారణ ఫ్రైకి హోటల్లో దొరికే ఈ వంటకానికి మధ్య ఉన్న తేడా ఇదే.
గుంటూరు రొయ్యల ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం
ఈ వంటకం చేయటానికి ప్రధానమైనవి రొయ్యలు. మద్యస్థ పరిమాణంలో ఉన్న తాజా రొయ్యలు ఒక అరకిలో తీసుకుంటే నలుగురికి సరిపోతాయి. చిన్న రొయ్యలైతే త్వరగా ఉడికి రుచి బాగా తెలుస్తుంది. పెద్దవైతే మాంసం గట్టిగా జ్యూసీగా ఉంటుంది రొయ్యలను శుభ్రం చేసి తల పెంకు తీసేసి నడుము భాగంలో చిన్నగా చేస్తే మసాలా లోపలికి బాగా వెళ్లి రుచిని రెట్టింపు చేస్తుంది.
మసాలా మొత్తం గుంటూరు కారం లోనే దాగి ఉంటుంది. ఇది ఎండుమిర్చి పొడి కానీ సాధారణ కారం కంటే గుంటూరు కారం రంగు ఘాటు ఎక్కువగా ఉంటుంది. రెండు టేబుల్‌స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా స్పైసీ యాడ్ చేసుకోవాలంటే మీకు నచ్చినంత కారంపొడి తీసుకోవచ్చు. రంగు కోసం కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పొడి కలిపితే ఫ్రై ఎర్రగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక అర టీ స్పూన్ పసుపు వేస్తే రొయ్యలకు వాసనతో పాటు సహజ రంగు కూడా వస్తుంది.
ధనియాల పొడి ఒక టీస్పూన్ కలిపితే కారానికి మృదుత్వం వస్తుంది. గరం మసాలా అర టీస్పూన్ చివర్లో వేస్తే సువాసన పెరుగుతుంది. జీలకర్ర, సోంపు, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క వంటి మసాలాలు ఫ్రైకి ప్రత్యేకమైన వాసన ఇస్తాయి. ఇంట్లో అన్నీ ఉండకపోయినా, కనీసం జీలకర్ర, మిరియాలు ఉంటే చాలు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే వంటకానికి పునాది వస్తుంది. ఉల్లిపాయలు రెండు, మధ్యస్థ టమాటాలు రెండు ఉపయోగిస్తే గ్రేవీ లేకుండానే ఫ్రై చిక్కగా, తేమగా ఉంటుంది. పచ్చిమిర్చి రెండు నుంచి నాలుగు వరకు, కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర కొద్దిగా, అర నిమ్మకాయ రసం చివర్లో వేస్తే రుచి పూర్తవుతుంది. తాలింపు కోసం ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఉపయోగిస్తారు. నూనె నాలుగు టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుంది, గుంటూరు స్టైల్లో కొంచెం ఎక్కువ నూనె ఉంటే రుచి బాగుంటుంది.
గుంటూరు రొయ్యల ఫ్రై తయారీ విధానం
రొయ్యలను నీళ్లతో రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒకటి స్పూన్ కారం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ రసం వేసి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెడితే రొయ్యల మెతపడతాయి కాబట్టి కొద్ది సమయం సరిపోతుంది.
ఇప్పుడు చిన్న బాణీలో నూనె వేసి వేడి చేయాలి తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉల్లిపాయలను వేయించాలి. రొయ్యల ఫ్రై లో అసలు రుచి రావటానికి మెయిన్ ప్రాసెస్ ఇదే. కాబట్టి తొందర పడకూడదు. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి.
తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు గుంటూరు కారం, ధనియాల పొడి, పసుపు, అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు బాగా మగ్గించాలి. మసాలా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మసాలా గట్టి పడుతూ ఉంటే అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు.
మసాలా సిద్ధం చేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యలను వేసి మసాలా కలిసే ఎంతవరకు కలపాలి. మూత పెట్టి చిన్నని మంట మీద ఐదు నుండి పది నిమిషాలు ఉడికించుకోవాలి. రొయ్యలు గులాబీ రంగులోకి మారితే ఉడికినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మూత తీసి మంట కొద్దిగా పెంచి నీరు ఆవిరి అయిపోయి లాగా వేయించుకోవాలి. చివరన కొద్దిగా గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, వేసి కలిపితే ఘుమఘుమలాడే గుంటూరు, రొయ్యల ఫ్రై సిద్ధం అవుతుంది.
వడ్డించే విధానం మరియు చిట్కాలు
గుంటూరు రొయ్యల ఫ్రై ని వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి అన్నంతో కలిపి వడ్డిస్తే సంప్రదాయమైన చక్కని భోజనం లాగా ఉంటుంది. రోటి, పరోటా, లేదా గోంగూర పచ్చడితో కూడా తిన్న చాలా బాగుంటుంది. పిల్లలకు కారం తక్కువగా కావాలంటే మిర్చి పొడి కొద్దిగా తగ్గించి కాశ్మీరీ మిర్చి పొడిని ఎక్కువగా వాడుకోవచ్చు.
రొయ్యలు ఎక్కువసేపు ఉడికిస్తే రబ్బర్ లాగా గట్టిగా ఉంటాయి. కాబట్టి సమయం గమనించి వండుకోవడం చాలా ముఖ్యం. తాజా రొయ్యలు తీసుకోవడం కూడా చక్కని రుచిని మనం ఆస్వాదించవచ్చు. మసాలాలు అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే చాలా త్వరగా మనం వంట కూడా పూర్తి చేసుకోవచ్చు. ఈ వంటకం మీరు ఈసారి ప్రయత్నించి మీ ఇంటి వారందరికీ చక్కని రుచితో వడ్డించండి.
తాజా వార్తల అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి
Navayugam TV ఛానల్లో జాయిన్ అవ్వండి









