స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం, రాజకీయ ఆధిపత్యం మధ్య ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుదే.
ప్రజాస్వామ్యానికి పల్లెలే పట్టుకొమ్మలు అని పెద్దవారు అనేవారు. గ్రామీణ స్థాయి నుంచి నాయకత్వ నాయకత్వాన్ని ఎదిగేలా చేయటానికి, స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి ప్రజలే స్వయంగా పరిష్కరించుకోవటానికి రాజ్యాంగం మనకు కల్పించిన వ్యవస్థ స్థానిక సంస్థల ఎన్నికలు. సర్పంచులు(Sarpanch), ఎంపీటీసీలు (MPTC), జడ్పీటీసీలు(ZPTC), మున్సిపల్ కౌన్సిలర్లుగా (municipal councilors) ఎన్నికైన వారు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కష్టసుఖాలను పంచుకొని వ్యవస్థను అభివృద్ధి బాటన నడిపించటానికి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కే స్థానిక సంస్థల ఎన్నికలు. ఇదే దానికున్నటువంటి ప్రధాన ఉద్దేశం. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పనితీరును నిశితంగా పరిశీలిస్తే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునే దయనీయమైన పరిస్థితి మన దేశానికి దాపురించిందని అనిపిస్తుంది. ప్రతిసారి లాగే ఇప్పుడు కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. కానీ అది ఒక ప్రజాస్వామ్య పండగలా కాకుండా ఒక మహాసంగ్రామం లా, ఆదిపత్యం కోసం జరిగే ఒక కురుక్షేత్రంలా, గొడవలు, బెదిరింపులు, హింసలు ఇవన్నీ చూస్తుంటే ఈ పరిణామాలు కేవలం ఎన్నికల సమయంలో జరిగే హింస కు మాత్రమే ప్రతీక కాకుండా మన సమాజ నైతిక పతనానికి, విలువలకి, సజీవ సాక్షాలుగా ఉన్నాయి.
సున్నా జీతం.. కోట్లలో పెట్టుబడి: అంతుచిక్కని వైరుధ్యం
ఈ వ్యవస్థలో అత్యంత విచిత్రమైనది ఏమిటో తెలుసా? అసలు అంత చిక్కని వైరుధ్యం ఏమిటో తెలుసా? ఈ పదవులకు ఉండే జీతభత్యాలు. గ్రామాల్లో పంచాయతీలను ఏలే సర్పంచ్ యొక్క అత్యంత కీలకమైన మరియు బాధ్యతాయుతమైన పదవికి వచ్చే ప్రభుత్వ జీతం చాలా తక్కువ. కొన్ని పదవుల కైతే అసలు ఎలాంటి జీతభత్యాలు ఉండవు. కేవలం నామమాత్రంగా ఉండే వేతనం మాత్రమే వస్తుంది. దానినే గౌరవ వేతనం అని అంటారు. ఇప్పుడు పరిస్థితి అంతా మారింది, గౌరవ వేతనంతో చేసే పదవుల కోసం అభ్యర్థులు నేడు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నామినేషన్ దగ్గర నుండి పోలింగ్ ముగిసే వరకు దౌర్జన్యాలు, బెదిరింపులు, రక్తపాతాలు, ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక ప్రజాసేవ కాదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సేవలు చేయడానికే మేము పోటీ పడుతున్నాం అని బల్లలు గుద్ధి, మైకులలో అరిచి చెప్పే నాయకులు ఆ పవిత్రమైన సేవ కోసం దౌర్జన్యాలు చేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు, డబ్బులు కుమ్మరిస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. ప్రత్యర్ధుల పై దాడులు చేస్తున్నారు. ఇటువంటి హింసలు, దౌర్జన్యాలు, బెదిరింపులు గ్రామాలు మొదలుకొని జిల్లా స్థాయి వరకు ఇదే తంతు.దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే సేవ చేయటానికి కండబలం, తన బలం అధికార బలం ఎందుకు అవసరం అవుతున్నాయి. ఇక్కడే ప్రతి ఒక్కరూ నిర్మొహమాటంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సేవా ముసుగులో రాజకీయం.. వ్యాపారంగా మారిన అధికార పీఠం
నిజమైన సేవ అనేది చట్టబద్ధంగా, రాజ్యాంగ పరిధిలో ప్రజల యొక్క మన్నలను పొందడం ద్వారా రావాలి. ప్రజలతో, ప్రజల మధ్యనే తిరుగుతూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకోవడం ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలి. కానీ నేడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.”నువ్వు కాదు, మేమే సేవ చేయాలి” అంటూ ప్రత్యర్థులపై భౌతిక దాడికి దిగడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం సర్వసాధారణమైపోయింది.ఒకరు నిజంగా ప్రజలకు మేలు చేయాలనుకుంటే అక్కడ రక్తపాతానికి, దౌర్జన్యానికి తావు ఎందుకు ఉంటుంది? సేవ అనేది ప్రేమతో, బంధంతో ముడిపడి ఉంటుందే తప్ప, భయంతోనూ, బరితెగింపుతోనూ సాధ్యం కాదు. కానీ, నేడు రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి, దౌర్జన్యాల ద్వారా గెలిచే నాయకులు పీఠం ఎక్కిన క్షణం నుంచి ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారని మనం ఆశించగలం? ఎలక్షన్లో ఖర్చుపెట్టిన డబ్బులు ఏవిధంగా సంపాదించాలి ఇదే కొందరి నాయకుల పరమావధిగా ఉంటుంది.
గ్రామీణ అభివృద్ధికి గ్రహణం.. పదవి పీఠం దోపిడీకి హరివిల్లు
ఈ దుస్థితికి ప్రధాన కారణం రాజకీయాల్లోకి నేరపూరిత ధోరణులు ప్రవేశించడమే. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత పూర్తిగా గాలికి కొట్టుకుపోతుంది. వేసే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి ప్రాజెక్టులు కొద్ది రోజులకే నామరూపు లేకుండా పోతాయి. కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి టెండర్లు కట్టబెట్టాలి? ప్రభుత్వ నిధులలో నుంచి ఎంత పర్సెంట్ కమీషన్ రావాలి? అనే లెక్కలే వారికి నిద్రలేకుండా చేస్తాయి. ప్రజాధనం ప్రజల సంక్షేమానికి ఖర్చు కావాల్సింది పోయి, నాయకుల జేబులను నింపడానికి, వారి అనుచరుల ఆస్తులను పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. ఇక సంక్షేమ పథకాల అమలులోనూ పక్షపాతమే తాండవిస్తుంది. సంక్షేమ పథకాలు రాజకీయ, కులపరమైన భేదాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి. అర్హత ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో ఎవరికైనా అన్యాయం జరిగితే దానిని ప్రశ్నించే వ్యవస్థ ఉండాలి.
మూగబోయిన జనం.. నాయకుల విలాసాలు
ఈ వ్యవస్థలో అంతిమంగా నష్టపోయేది బాధితులుగా మారుతున్నది మాత్రం సాధారణమైన ప్రజలే. నాయకులు మాత్రం గొడవలు పడి, దౌర్జన్యాలు చేసి సంపాదించే సంపద ఎవరికోసం? అది ఏనాడూ ప్రజల కోసం ఖర్చు పెట్టేది కాదు. కేవలం ఆ నాయకులు కుటుంబాల అభివృద్ధి కోసం, వారి రాబోయే తరాల విలాసవంతమైన జీవితం కోసం మాత్రమే. అయినప్పటికీ ప్రజలు కులాల పేరుతో, మతాల పేరుతో, రాజకీయ పార్టీల ముసుగులో విడిపోయి వీరు ఆడే నాటకాలను చూస్తూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు.కొందరు రాజకీయ నాయకులకు ప్రజా సంక్షేమంపై ఉన్న శ్రద్ధ కంటే, ఏ విధంగా అక్రమ ఆదాయం వస్తుంది? ఎలా వెనకేసుకోవాలి? అనే దానిపైనే నిరంతరం కళ్లుంటాయి. ప్రజల్ని మోసం చేయడం, అభివృద్ధి ముసుగులో నిధులను పక్కదారి పట్టించడం నేడు ఒక కళగా మారిపోయింది. దీనిని ప్రశ్నించాల్సిన మేధావులు, యువత కూడా కొన్నిసార్లు మౌనం వహించడం లేదా పార్టీలకతీతంగా ఆలోచించలేకపోవడం సమాజ దురదృష్టం.
మేల్కొనాల్సింది ఎవరు? చాటాల్సింది ఎక్కడ?
వర్తమాన రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే గొంతులను అణచివేయడం, విమర్శలను రాజకీయ రంగు పులిమి అడ్డుకోవడం తరచూ కనిపిస్తున్న ఒక ఆందోళనకరమైన ధోరణి ఈ సమాజంలో సాధారణమైపోయింది, రాబోయే తరాలలో కళ్ళు లేని వారి వలె ఎవరు మభ్యపెడితే వారికి మాత్రమే ఓటు వేసి తలవంచుకొని వచ్చే సమాజంగానే మనం మిగిలిపోతామేమో. ఇంత దౌర్జన్యం చేసి ఇన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కుమ్మరించి ఓట్లల్లో విజయం సాధించేవారు నిజంగా నీకోసం, నీ కుటుంబం కోసం, మీ గ్రామం కోసం, మీ మండలం కోసం, మీ జిల్లా కోసం కష్టపడతారని అనుకుంటున్నారా? అది మన భ్రమ మాత్రమే. వాళ్లు మనకు పంచిన డబ్బుల్ని తిరిగి ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో మునిగిపోయి ఉంటారు.
అందువల్ల, వేళ్లూనుకుపోతున్న ఈ ధన, దౌర్జన్య రాజకీయాలకు చరమగీతం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. పదవి అంటే అధికారం కాదు, అదొక పవిత్రమైన బాధ్యత అని గుర్తించే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలి. డబ్బుకు, బెదిరింపులకు, కుల పిచ్చికి తలవంచకుండా, నిజాయితీగా సేవ చేసే నాయకులను ఎంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు నిజమైన అర్థం వస్తుంది. సమాజంలో ఒక బాధ్యత గల గొంతుకగా చెప్పేది ఒక్కటే.. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే, నాయకుల అధికార దాహానికి మన పల్లె సీమలు పూర్తిగా కాలి బూడిదవుతాయి. ఆలోచించండి.. మన ఓటు మన భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం కావాలి కానీ, కొందరి అక్రమ సంపాదనకు, దౌర్జన్యాలకు మెట్లు కాకూడదు. ఈ మార్పు కేవలం చట్టాల ద్వారా రాదు, ప్రతి ఓటరు ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో నిజమైన ప్రజాస్వామ్య సూర్యోదయం సాధ్యమవుతుంది.
(Disclaimer)
ఈ ఆర్టికల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు మరియు ఆలోచనలు కేవలం ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక పరిస్థితులు మరియు ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టే ఉద్దేశంతో మాత్రమే రాయబడినవి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల తీరుతెన్నులపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై సామాజిక స్పృహను పెంపొందించడానికి, ప్రజల్లో ఆలోచన రేకెత్తించడానికి మాత్రమే ఈ కథనాన్ని రూపొందించడం జరిగింది.
ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీని, నాయకుడిని, లేదా వర్గాన్ని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శించడం గానీ, కించపరచడం గానీ చేయదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, విలువలు, నైతికత ప్రాధాన్యాన్ని గుర్తుచేయడమే ఈ ఆర్టికల్ ప్రధాన ఉద్దేశం. పాఠకులు దీనిని కేవలం విశ్లేక్షణాత్మక దృక్పథంతో మాత్రమే పరిశీలించవలసిందిగా కోరడమైనది.









