

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సేవింగ్ చిట్కాలు మరియు ఛార్జింగ్ సెట్టింగ్స్
మనం ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీఉన్నట్లుండి చార్జింగ్ 50% నుండి 20% కి 20% నుండి 10% కి పడిపోతే ఉన్న చిరాకు అంతా ఇంతా కాదు అప్పుడే చార్జింగ్ అయిపోయింది అని అనిపిస్తుంది. ఒకప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు మూడు రోజుల పాటు నిరాటంకంగా పనిచేసిన మొబైల్స్, నేడు సాయంత్రం కూడా గడవకముందే ఆగిపోతున్నాయి. బ్యాటరీ కెపాసిటీ మాత్రం నాలుగు వేల, ఐదు వేల మిల్లీయాంపియర్ల సామర్థ్యానికి పెరిగినా ఛార్జింగ్ నిలవకపోవడానికి ప్రధాన కారణం మన అలవాట్లు, మన ప్రమేయం లేకుండా ఫోన్లో రన్ అయ్యే హిడెన్ సాఫ్ట్వేర్ ప్రక్రియలే. అయితే ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి. మన బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి సెట్టింగ్స్ చేసుకోవాలి అనే కంప్లీట్ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు మన మొబైల్ ఫోన్ బ్యాటరీలు ఎలా పనిచేస్తాయి
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా అందులోని లిథియం-అయాన్ లేదా లిథియం-పాలిమర్ బ్యాటరీ పనితీరును అంటే అసలు అది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి. చాలామంది బ్యాటరీని ఏదో ఒక నీటి బకెట్ లాంటిదని, పూర్తిగా నింపి పూర్తిగా ఖాళీ చేయాలని అనుకుంటారు. కానీ ఆధునిక కెమికల్ కణాల పనితీరు అలా ఉండదు. బ్యాటరీ పూర్తిగా సున్నా శాతానికి (0%) పడిపోయినప్పుడు లేదా వంద శాతానికి (100%) నిండినప్పుడు లోపల ఉండే లిథియం అయాన్లు విపరీతమైన రసాయన ఒత్తిడికి గురవుతాయి. ప్రతి బ్యాటరీకి ఒక నిర్దిష్టమైన ఛార్జింగ్ సైకిల్ పరిమితి ఉంటుంది. సున్నా నుండి వంద శాతానికి వెళ్లడాన్ని ఒక పూర్తి సైకిల్ అంటారు. సాధారణంగా ఒక బ్యాటరీ మూడు వందల నుండి ఐదు వందల సైకిల్స్ వరకు మాత్రమే తన పూర్తి ఆరోగ్యాన్ని నిలుపుకోగలదు. మనం రోజుకు ఒకటి లేదా రెండుసార్లు పూర్తిగా ఖాళీ చేసి నింపుతుంటే, ఏడాది తిరిగేసరికి బ్యాటరీ సామర్థ్యం సగానికి పడిపోతుంది.
బ్యాటరీ హెల్త్‌ను ఎక్కువ కాలం పాటు సరిగ్గా ఉంచడానికి టెక్నాలజీ ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందిన సూత్రం ఏమిటంటే ఇరవై-ఎనభై నియమం. మీ మొబైల్ ఛార్జింగ్ ఇరవై శాతానికి (20%) పడిపోగానే ఛార్జర్ కనెక్ట్ చేయాలి, అలాగే ఎనభై లేదా ఎనభై ఐదు శాతం చేరగానే ఛార్జింగ్ ఆపివేయాలి. ఈ పరిధిలో ఉన్నప్పుడు బ్యాటరీలోని లిథియం అయాన్లు అతి తక్కువ వోల్టేజ్ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ప్రస్తుతం దాదాపు అన్ని సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రొటెక్ట్ బ్యాటరీ లేదా ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆన్ చేసి ఉంచడం ద్వారా రాత్రంతా ఫోన్ ప్లగ్‌లో ఉన్నప్పటికీ బ్యాటరీని ఎనభై శాతం వద్ద ఆపి, మీరు నిద్రలేచే సమయానికి మాత్రమే నెమ్మదిగా మిగిలిన భాగాన్ని నింపుతుంది.
చార్జింగ్ పెట్టేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే?
చాలామంది చేసే అత్యంత సాధారణమైన తప్పు రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో వదిలేయడం. ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లలో కరెంట్ ఆగిపోయే స్మార్ట్ చిప్సెట్లు ఉన్నప్పటికీ, ఫోన్ ఎల్లప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లో నెట్వర్క్ లేదా యాప్‌లను రన్ చేస్తూనే ఉంటుంది. వంద శాతం (100%) నిండిన తర్వాత ఒక్క శాతం తగ్గినా మళ్లీ ఛార్జర్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగి ట్రికిల్ ఛార్జింగ్ మోడ్ మొదలవుతుంది. ఈ ప్రక్రియ బ్యాటరీ కణాలలో నిరంతర వేడిని పుట్టిస్తుంది. బ్యాటరీలకు వేడి అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. వేడి పెరిగే కొద్దీ బ్యాటరీలోని ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెరిగిపోయి ఛార్జింగ్ త్వరగా తగ్గిపోవడం మొదలవుతుంది.
మనం చేసే మరియొక అతిపెద్ద పొరపాటు ఏమిటంటే మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు గేమ్స్ ఆడటం లేదా హై రెసల్యూషన్ వీడియోలను చూడటం. దీన్ని పారాసిటిక్ లోడ్ అంటారు. ఈ సమయంలో బ్యాటరీ ఒకవైపు ఛార్జ్ అవుతూనే మరోవైపు అత్యంత వేగంగా డిశ్చార్జ్ అవుతుంది. డిస్ప్లే, ప్రాసెసర్ ఉత్పత్తి చేసే వేడికి తోడు బ్యాటరీ ఛార్జింగ్ వల్ల వచ్చే వేడి తోడై మొబైల్ అంతర్గత ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది. ఇది దీర్ఘకాలంలో బ్యాటరీ ఉబ్బిపోవడానికి లేదా శాశ్వతంగా పాడైపోవడానికి దారితీస్తుంది.
వీటికి తోడు మార్కెట్లో దొరికే చౌకబారు లేదా లోకల్ ఛార్జర్లు, కేబుల్స్ వాడటం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడి మదర్‌బోర్డుపై ఉండే పవర్ మేనేజ్మెంట్ ఐసీ దెబ్బతింటుంది. అలాగే మన ఫోన్ కి పెట్టుకున్నటువంటి మందంగా ఉన్న మొబైల్ పౌచులు ఉన్నప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే లోపలి వేడి బయటకు వెళ్లలేక పరికరం లోపలే బంధించబడుతుంది. కాబట్టి వేగంగా ఛార్జ్ చేసే సమయంలో మన మొబైల్ పౌచ్ తీసి పక్కన పెట్టడం వల్ల మన మొబైల్లో ఉత్పత్తి అయ్యే వేడి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.
మొబైల్ డిస్ప్లే అలాగే చూసే వీడియోల బ్యాక్ గ్రౌండ్ లో బ్యాటరీ ఎలా డ్రైన్ అవుతుందో తెలుసా?
స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీని అత్యధికంగా ఖర్చు చేసే ప్రధాన విభాగం డిస్ప్లే. ప్రస్తుతం చాలా మొబైల్స్ AMOLED లేదా OLED ప్యానెల్స్‌తో వస్తున్నాయి. ఈ స్క్రీన్ల పనితీరును అర్థం చేసుకుంటే సగానికి పైగా బ్యాటరీని ఆదా చేయవచ్చు. ఎల్సీడీ డిస్ప్లేలలో స్క్రీన్ మొత్తం వెనుక ఒకే బ్యాక్‌లైట్ వెలుగుతుంది. కానీ అమోలెడ్ స్క్రీన్లలో ప్రతి పిక్సెల్ తన సొంత వెలుగును తానే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. అంటే మీరు స్క్రీన్‌పై పూర్తిగా నలుపు రంగును చూస్తున్నప్పుడు ఆ నల్లటి భాగంలో ఉన్న పిక్సెల్స్ పూర్తిగా ఆగిపోతాయి. అక్కడ విద్యుత్ ఖర్చు సున్నా అవుతుంది. అందుకే మీ ఫోన్ సిస్టమ్ సెట్టింగ్స్‌లో డార్క్ మోడ్ ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉంచడం ద్వారా, వాల్‌పేపర్‌గా పూర్తిగా నలుపు రంగు నేపథ్యాన్ని ఎంచుకోవడం ద్వారా డిస్ప్లే వాడే బ్యాటరీలో దాదాపు ముప్పై నుండి నలభై శాతం వరకు విద్యుత్‌ను నిలువరించవచ్చు.
ఇదే కోవలోకి వచ్చే మరో అంశం స్క్రీన్ రిఫ్రెష్ రేట్. నేటి తరం మొబైల్స్ తొంభై హెర్ట్జ్, నూట ఇరవై హెర్ట్జ్ లేదా అంతకంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటున్నాయి. ఇది స్క్రోలింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపించినప్పటికీ, స్క్రీన్ ప్రతి సెకనుకు నూట ఇరవై సార్లు రీఫ్రెష్ అవ్వడం వల్ల గ్రాఫిక్స్ ప్రాసెసర్ నిరంతరం పనిచేస్తూ బ్యాటరీని వేగంగా ఖాళీ చేస్తుంది. మీకు గేమింగ్ వంటి ప్రత్యేక అవసరాలు లేనప్పుడు డిస్ప్లే సెట్టింగ్స్‌లోకి వెళ్లి డైనమిక్ రిఫ్రెష్ రేట్ లేదా స్టాండర్డ్ అరవై హెర్ట్జ్ మోడ్‌కు మార్చుకోవడం వల్ల స్క్రీన్ ఆన్ టైమ్ అనూహ్యంగా పెరుగుతుంది. అలాగే ఆటో బ్రైట్నెస్ సెట్టింగ్ కొన్నిసార్లు గదిలోని చిన్న చిన్న కాంతి మార్పులకు కూడా రియాక్ట్ అవుతూ స్క్రీన్ బ్రైట్నెస్ను అనవసరంగా పెంచుతుంది. దీన్ని మాన్యువల్‌గా మీకు సరిపడే స్థాయిలో పెట్టుకోవడం, స్క్రీన్ టైమ్అవుట్ను ముప్పై సెకన్లకు పరిమితం చేయడం వల్ల డిస్ప్లే డ్రైనేజ్‌ను పూర్తిగా అదుపు చేయవచ్చు.
వైఫై మరియు బ్లూటూత్ కనెక్ట్ ద్వారా బ్యాటరీ చార్జింగ్ ఎలా తగ్గుతుందో తెలుసా?
మనం బయట తిరుగుతున్నప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే బ్యాటరీని పీల్చేసే మరో ప్రధాన వ్యవస్థ వైర్లెస్ రేడియో నెట్వర్క్. ఇందులో మొదటిది వై-ఫై మరియు బ్లూటూత్ స్కానింగ్. మీ ఫోన్ సెట్టింగ్స్‌లో వై-ఫై లేదా బ్లూటూత్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్‌లో అవి పూర్తిగా ఆగిపోవు. లొకేషన్ ఖచ్చితత్వాన్ని పెంచడం కోసం పరిసరాల్లో ఉన్న వై-ఫై రూటర్లను, బ్లూటూత్ డివైజ్‌లను ఫోన్ ప్రతి సెకనుకు స్కాన్ చేస్తూనే ఉంటుంది. మీ మొబైల్ సెట్టింగ్స్‌లోని లొకేషన్ సర్వీసులలోకి వెళ్లి వై-ఫై స్కానింగ్ మరియు బ్లూటూత్ స్కానింగ్ అనే ఆప్షన్లను మాన్యువల్‌గా టర్న్ ఆఫ్ చేయాలి. దీనివల్ల జీపీఎస్ పనిచేసినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ స్కానింగ్ ఆగిపోయి చాలా బ్యాటరీ ఆదా అవుతుంది.
తర్వాత చెప్పుకోవలసింది 5G నెట్వర్క్ నిర్వహణ. భారతదేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఇంకా చాలా ప్రాంతాల్లో సిగ్నల్ హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉంటాయి. మొబైల్ ఆటో 5G మోడ్‌లో ఉన్నప్పుడు, అది స్థిరమైన సిగ్నల్ కోసం నిరంతరం 4G మరియు 5G టవర్ల మధ్య మారుతూ నెట్వర్క్ కోసం నిరంతరం స్కానింగ్ చేస్తూ ఉంటుంది. నెట్వర్క్ స్కానింగ్ కోసం మోడెమ్ తన పవర్ యాంప్లిఫైయర్‌ను గరిష్ట సామర్థ్యంతో నడుపుతుంది. మీకు అత్యవసరమైన డౌన్లోడ్లు లేనప్పుడు సాధారణ రోజువారీ బ్రౌజింగ్ లేదా సోషల్ మీడియా కోసం నెట్వర్క్ మోడ్‌ను 4G/LTE ఓన్లీగా మార్చుకుంటే బ్యాటరీ లైఫ్‌లో అద్భుతమైన మార్పును గమనించవచ్చు. ఇదే విధంగా లొకేషన్ యాక్సెస్ విషయంలో కూడా అవసరం లేని యాప్‌లకు లొకేషన్ పర్మిషన్ “వైల్ యూజింగ్ ద యాప్” లేదా పూర్తిగా డినై చేసి ఉంచడం మంచిది.
యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వటం వల్ల ఏమవుతుందో తెలుసా
మనం ఒక యాప్‌ను ఉపయోగించి హోమ్ స్క్రీన్‌పైకి రాగానే ఆ యాప్ మూతపడిందని భావిస్తాం. కానీ సోషల్ మీడియా, షాపింగ్, న్యూస్ యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూనే ఉంటాయి. సర్వర్ల నుండి డేటాను లాగడం, నోటిఫికేషన్లను తనిఖీ చేయడం, యూజర్ డేటాను అప్లోడ్ చేయడం వంటి పనులను నిరంతరం నడిపిస్తాయి. ప్రతి ఫోన్ సెట్టింగ్స్‌లో బ్యాటరీ విభాగంలోకి వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ యూసేజ్ లిమిట్స్ తనిఖీ చేయాలి. మీరు అరుదుగా వాడే యాప్‌లను డీప్ స్లీపింగ్ యాప్స్ లిస్ట్‌లోకి పంపాలి. ఈ డీప్ స్లీప్ మోడ్‌లో ఉన్న యాప్‌లు మీరు స్వయంగా వాటిని తెరిచే వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి డేటాను లేదా బ్యాటరీని తీసుకోలేవు.
అలాగే గూగుల్ మరియు ఇతర ఈమెయిల్ అకౌంట్ల ఆటో-సింక్ ఫీచర్ మరొకటి. ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి సర్వర్‌తో కనెక్ట్ అయ్యే బదులు, మీకు అవసరమైనప్పుడే మాన్యువల్‌గా సింక్ అయ్యేలా మార్చుకోవచ్చు. హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ అంటే కీబోర్డ్‌పై టైప్ చేస్తున్నప్పుడు లేదా కాల్స్ వస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్ కూడా విద్యుత్ వినియోగానికి కారణం. ఫోన్ లోపల ఉండే చిన్న వైబ్రేషన్ మోటార్ విద్యుత్‌ను యాంత్రిక శక్తిగా మార్చే సమయంలో సాధారణ సౌండ్ కంటే రెండింతల పవర్‌ను ఖర్చు చేస్తుంది. కీబోర్డ్ టైపింగ్ వైబ్రేషన్, టచ్ సౌండ్స్ ఆపివేయడం ద్వారా రోజువారీ వినియోగంలో స్పష్టమైన ఫలితం కనిపిస్తుంది.
బ్యాటరీ హెల్త్‌ను కాపాడే అత్యుత్తమమైన మార్గాలు ఏంటో తెలుసా
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచడం అంటే కేవలం కొన్ని సెట్టింగులు మార్చడం మాత్రమే కాదు, దాన్ని ఒక జీవక్రియలా చూసుకోవడం. వాతావరణం కూడా లిథియం బ్యాటరీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎండలో పార్క్ చేసిన బైక్ లేదా కారు డాష్‌బోర్డుపై మొబైల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేయకూడదు. ముప్పై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బ్యాటరీ అంతర్గత సెల్స్ క్షీణించే వేగం మూడు రెట్లు పెరుగుతుంది.
అలాగే నెలకొకసారి మాత్రమే బ్యాటరీని ఇరవై శాతం నుండి వంద శాతం వరకు ఎలాంటి అంతరాయం లేకుండా నెమ్మదిగా ఛార్జ్ చేసి బ్యాటరీ కాలిబ్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. పైన వివరించిన విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కానింగ్‌లు ఆపివేయడం, అమోలెడ్ డార్క్ మోడ్ పాటించడం, అనవసరపు ఫాస్ట్ ఛార్జింగ్ హీట్‌ను నివారించడం మరియు ఇరవై-ఎనభై శాతాల మధ్య ఫోన్‌ను నడపడం అనేవి అలవాటు చేసుకుంటే మీ మొబైల్ బ్యాటరీ రోజంతా ఎలాంటి ఆందోళన లేకుండా పనిచేయడమే కాకుండా, పరికరం కొన్న రెండు మూడేళ్ల వరకు కూడా కొత్తదనం కోల్పోకుండా ఉంటుంది.
తాజా వార్తల అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి








