జ్వరం వస్తే ఆకలి వేయదా? నోరు చేదుగా ఉంటుందా? దీని వెనుక ఉన్న అసలు కారణాలివే!
సాధారణంగా వాతావరణం మారినప్పుడు లేదంటే వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి ఫంక్షన్లకు వెళ్లి వచ్చినప్పుడు మనకి జ్వరం వచ్చిన ఫీలింగ్ వస్తుంది.కొంతమందికి నిజంగానే జ్వరం వస్తుంది. అసలు జ్వరం(Fever) వస్తే మన శరీరము ఎందుకు వేడెక్కుతుంది? మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసా. జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా ఏమీ తినాలని (Loss of appetite) అనిపించదు. అలాగే మన నోరంతా చేదుగా ఉన్నట్టువంటి భావన కలుగుతుంది.దీనిపై ప్రముఖ పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ శాస్త్రీయ కారణాలను వివరించారు.
జ్వరం రావడానికి కేవలం వాతావరణ మార్పులే కాదు, అవి ఏ రకమైనవో తెలుసుకోవడం ముఖ్యం. సాధారణ వైరల్ ఫీవర్లు (Viral Fevers), బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్, మలేరియా లేదా డెంగ్యూ వంటి రకాలు ఉంటాయి. ప్రతి జ్వరానికి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, జ్వరం తీవ్రతను బట్టి చికిత్స అవసరమవుతుంది.
సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 98.6 F (37 C) ఉంటుంది. ఇది 100.4 F దాటినప్పుడు మాత్రమే దానిని జ్వరంగా పరిగణించాలి. డిజిటల్ థర్మామీటర్ ఉపయోగించి ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడం వల్ల డాక్టర్‌కు సరైన సమాచారం అందించవచ్చు.
జ్వరం(Fever)వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది.
జ్వరం వచ్చినప్పుడు మనకు ఎంతగా ఇష్టమైన ఆహార పదార్థాలు ఉన్న మనకు తినాలని అనిపించదు . మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు దానిపై మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ పోరాటం చేస్తుంది. ఈ పోరాట క్రమంలోనే మన రోగ నిరోధక వ్యవస్థ ‘సైటోకైన్స్’ (Cytokines) అనే కొన్ని ప్రత్యేక రసాయనాల్ని విడుదల చేస్తుంది.ఈ సైటోకైన్స్ నేరుగా మెదడులోని ‘అపెటైట్ సెంటర్’ (ఆకలిని నియంత్రించే కేంద్రం) మీద ప్రభావం చూపుతాయి.దీనివల్ల మెదడు ఆకలి సంకేతాలను పంపడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తుంది.దీనివల్ల తాత్కాలికంగా మన యొక్క ఆకలిని నియంత్రించే విధంగా మారుతుంది. దీని ఫలితంగా మనకు ఆహారం తీసుకోవాలనే కోరిక కలగదు. నిజానికి ఇది శరీరంలో ఉన్నటువంటి శక్తిని జీర్ణ క్రియ కు కాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మళ్లించేందుకు ఉపయోగిస్తుంది.
జ్వరం(Fever)వచ్చినప్పుడు నోరు ఎందుకు చేదుగా అనిపిస్తుంది.
చాలామందికి జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉన్నట్టు ఏది తిన్న రుచిగా లేనట్టు అనిపిస్తుంది.దీనికి కారణం ఏమిటో తెలుసా? ఇన్ఫెక్షన్ సమయంలో మన రక్తంలో కొన్ని రకాల విషయపదార్థాలు ఏర్పడతాయి. ఇవి మన లాలాజలంలో కలిసి సహజంగా ఉండే రుచిని మార్చివేస్తాయి. దానివల్ల మనకు అటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే నాలుక పై ఉండే రుచి మొగ్గలు పనితీరు కూడా ఈ సమయంలో చాలా మందగిస్తుంది.జ్వరం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి తక్కువగా ఉండటం. నోరు ఆరిపోవడం కూడా జరుగుతుంది. అలాగే రుచి కూడా చేదుగా అనిపిస్తుంది.
జ్వరం(Fever)వచ్చినప్పుడు ఉన్నప్పుడు చికెన్ తింటే కామెర్లు వస్తాయా?
జ్వరం ఉన్నప్పుడు మాంసాహారం కానీ ముఖ్యంగా చికెన్ కానీ తింటే కామెర్లు వస్తాయని చాలామంది పెద్దవారు మన ఇంట్లో చెబుతూ ఉంటారు.దీనిపై డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ స్పష్టతనిస్తూ, చికెన్ తినడం వల్ల నేరుగా కామెర్లు రావని, అయితే జ్వరంలో జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని సూచించారు.
స్వీయ వైద్యం (Self-Medication): డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు.
మరీ చల్లని నీటి స్నానం: జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ వాటర్ లేదా అతి చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. గోరువెచ్చని నీటితో ఒళ్లు తుడవడం (Sponge bath) మంచిది.
భారీ వ్యాయామాలు: జ్వరం ఉన్నప్పుడు శరీరం విశ్రాంతి కోరుకుంటుంది, కాబట్టి శారీరక శ్రమ తగ్గించాలి.
జ్వరం(Fever) త్వరగా తగ్గిపోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
జ్వరం నుండి త్వరగా కోలుకోవడానికి ముఖ్యంగా శరీరం డిహైడ్రేషన్ గురికాకుండా ఉండటానికి కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, మంచినీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే తేలికపాటి ఆహారం అయినటువంటి ఇడ్లీ, గంజి, వంటివి సులభంగా జీర్ణం అవుతాయి, కాబట్టి వాటిని తీసుకోవడం మంచిది . తక్కువ మసాలాలతో కూడినటువంటి పప్పు కానీ వెజిటబుల్స్ కూరలు కానీ తీసుకోవడం వల్ల మన శరీరం శక్తిని కోల్పోకుండా ఉంటుంది.
ఎప్పుడు డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి? (When to See a Doctor)
జ్వరం 3 రోజుల కంటే ఎక్కువ కాలం తగ్గకుండా ఉంటే.
తీవ్రమైన తలనొప్పి లేదా మెడ బిగుసుకుపోవడం (Stiff neck).
శరీరంపై దద్దుర్లు రావడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
మరీ నీరసించిపోయి స్పృహ కోల్పోయేలా అనిపించడం.
జ్వరం వచ్చినప్పుడు ఆకలి మందగించడం లేదా నోరు చేరుగా మారడం అనేది మన శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడుతుందని చెప్పడానికి ఒక సంకేతం. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం. లేదు శరీరానికి కావలసినటువంటి విశ్రాంతినిస్తూ, సరైన పోషకాలు కలిగినటువంటి ఆహారం తీసుకుంటూ, అలాగే త్వరగా జీర్ణం అయ్యేటటువంటి ఆహారం తీసుకుంటూ, ద్రవ పదార్థాలను తీసుకుంటూ, మనం జ్వరం నుండి త్వరగా కోలుకోవచ్చు. ముఖ్యంగా డాక్టర్ని సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు . మనం ఏది చేసిన మొదటిగా డాక్టర్ సలహా తీసుకొని చేయడం చాలా మంచిది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ వివరించిన వివరాల ఆధారంగా ఇవ్వబడింది. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపించిందా? మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి! ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
