ఉదయం పరిగడుపున ఈ నీళ్లు తాగితే బరువు నిజంగా తగ్గుతారా? అసలు నిజానిజాలు ఇవే!
ప్రతిరోజు ఏ సోషల్ మీడియాలో చూసిన “పరగడుపున ఈ ఒక్క గ్లాసు నీరు తాగండి, నెల రోజుల్లో పది కేజీల కొవ్వు కరిగిపోతుంది”, “ఈ మ్యాజిక్ వాటర్ తాగితే పొట్ట ఫ్లాట్ అయిపోతుంది” ఇది పాటిస్తే ఖచ్చితంగా మీ పొట్ట విపరీతంగా తగ్గిపోతుంది. మీ బరువు తగ్గిపోతుంది. అని ఊదరగొడుతూ ఉంటారు. దీన్నే క్యాష్ చేసుకునే వాళ్ళు లేకపోలేదు. రకరకాల ప్రోడక్ట్‌లు మార్కెట్ లోకి రిలీజ్ చేయడం, విపరీతమైన పబ్లిసిటీ చేయడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాము. ఇవన్నీ చూసి చూసి చాలామందిలో గాఢంగా నాటుకుపోయిన ఒక భావన ఉంది. అదేమిటంటే నిద్రలేవగానే కాలి కడుపుతో దీన్ని తాగటం వల్ల ఖచ్చితంగా మన శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి, కొవ్వు కరిగిపోయి, మనం బరువు తగ్గిపోతామేమో అనే ఆలోచన చాలా మందిలో నాటుకుపోయి ఉంది. కానీ ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే జీవక్రియ ఆధారంగా ఇది సాధ్యమేనా? ఇది జరిగే అవకాశం ఉందా? అని తెలుసుకుందాం.
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందా?
రోజంతా అలసిపోయిన మన శరీరం రాత్రిపూట దాదాపు 6 నుండి 8 గంటల పాటు నిద్రలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ సమయంలో మనం దాదాపుగా ఏ ఆహారము తీసుకోము అలాగే పానీయాలు తీసుకోము కాబట్టి సహజంగానే శరీరం కొద్దిగా డిహైడ్రేషన్ స్థితిలో ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగటం వల్ల శరీరానికి కావలసినటువంటి నీటి శాతం దొరుకుతుంది. మన జీర్ణ వ్యవస్థలో నిలిచిపోయిన అవయవాల కదలిక చురుగ్గా పనిచేయడం మొదలవుతుంది. ప్రేగులలో పేరుకుపోయిన వ్యర్ధాలు సులభంగా బయటికి పంపి వేయబడతారు. ఒక గ్లాసు సాధారణ గోరువెచ్చని నీరు తాగినప్పుడు అది జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, శరీరంలోని మెటబాలిజాన్ని తాత్కాలికంగా వేగవంతం చేయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే ఇది ఏదో మాయ లాగా మారి కడుపులోని విసెరల్ ఫ్యాట్ లేదా పొట్ట కొవ్వును పొట్టలో పేరుకుపోయిన కొవ్వును నేరుగా కరిగివేస్తుందని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే.
నిమ్మరసము మరియు తేనె తీసుకుంటే మ్యాజిక్ లాగా పని చేసే కొవ్వు కరిగిపోతుందా?
చాలా సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉండే ఒక మ్యాజిక్ డ్రింక్ ఏమిటో తెలుసా? ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండి, ఒక చెంచా తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు.అసలు ఇలా చేయడం వలన మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి ఒక మంచి యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. చర్మానికి మంచి మెరుపు వచ్చేలా చేయగలదు. అలాగే రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. తేనే జీర్ణక్రియకు కొంత మేలు చేస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే తేనెలో ఉండేది కూడా ప్రక్టోస్ మరియు గ్లూకోస్ అంటే ఇవి కూడా కేలరీలు. మీరు బరువు తగ్గాలని ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో తేనె వాడుతుంటే తెలియకుండానే మీ శరీరంలోకి కేలరీలు వచ్చి చేరుతున్నాయి. నిమ్మకాయలోని ఆమ్లగుణం నేరుగా శరీరంలోని కొవ్వును కరిగించే రసాయన ప్రక్రియ వైద్యశాస్త్రంలో ఎక్కడ నిరూపించబడలేదు. ఇది శరీర ఆరోగ్యానికి రీహైడ్రేషన్ కు ఉపయోగపడుతుంది.మనం రొటీన్ గా తాగే చక్కెరతో కూడినటువంటి టీ, కాఫీలకు బదులుగా ఆరోగ్యకరమైనటువంటి ప్రత్యామ్నాయ డ్రింక్ గా మాత్రమే ఇది పనిచేస్తుంది.
జీలకర్ర, మెంతులు లేదా దాల్చినచెక్క నీరు
రాత్రిపూట ఒక చెంచా జీలకర్ర లేదా మెంతులు నానబెట్టి ఉదయం వాటిని మరిగించి వడకట్టి తాగే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. భారతీయ సంప్రదాయమైన వంటకాల్లో ఉపయోగించే ఈ మసాలా దినుసుల కి సహజంగానే అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. జీలకర్ర జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి కడుపులో ఉబ్బరము, గ్యాస్ సమస్యలను తగ్గించవచ్చు. మెంతులు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. సాధారణంగా వీటి అన్నింటి ప్రభావం వలన జీర్ణ వ్యవస్థ సజావుగా పని చేసినప్పుడు కడుపు కొద్దిగా తేలికగా అనిపిస్తుంది. పొట్ట తగ్గినట్లు మనం ఫీల్ అవుతాము. అంతే తప్ప ఈ నీళ్లు తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కణాలను కరిగించి బయటకు పంపిస్తాయి అని చెప్పే శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు.
ఆపిల్ సైడర్ వెనిగర్ వాటర్ (Apple cider vinegar water)
ఫిట్నెస్ ప్రపంచంలో చాలా క్రేజ్ సంపాదించుకున్న మరో పదార్థం ఆపిల్ సైడర్ వెనిగర్. ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలుపుకొని తాగితే వెంటనే పొట్టలోని కొవ్వు తగ్గిపోతుందని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. నిజానికి సైంటిఫిక్ పరిశోధనల ప్రకారం ఆపిల్ సైడర్ వెనిగర్ లోని ఎసిటిక్ యాసిడ్ భోజనం తర్వాత జీర్ణం కాకుండా కాసేపు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఆకలి వేగాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మనం రోజంతా కొద్దిగా తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనిని మనం పరగడుపున మోతాదుకు మించి ఎక్కువ తీసుకుంటే కడుపులో ఎసిడిటీ గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో పాటు, మన పంటి యొక్క ఎనామిల్ పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆకలిని కొంతవరకు నియంత్రించగలదే తప్ప అందరూ అనుకున్నట్టుగా కొవ్వును కరిగించి మన బరువును తగ్గించగలిగే శక్తి దీనికి లేదు.
అసలు మన శరీరంలో కొవ్వు ఎలా కరుగుతుంది?
బరువు తగ్గడం అనేది మనం రోజు ఉదయాన్నే పాటించే అలవాటు మీద ఆధారపడి ఏమి ఉండదు. అది సంపూర్ణ జీర్ణక్రియ యొక్క నియమం మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది. శరీర శక్తి కోసం మనం తీసుకున్న ఆహారంలోని కేలరీల పై ఆధారపడి ఉంటుంది. మన శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ క్యాలరీలు కలిగి ఉన్న ఆహారం మనం తీసుకున్నప్పుడు, ఆ శరీరం ఆ అదనపు శక్తిని సాధారణంగా కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది. దీనినే మనం కొవ్వు పేరకపోవడం అంటారు. శరీరం ఆ నిల్వ ఉన్న కొవ్వును కరిగించాలంటే ‘క్యాలరీ డెఫిసిట్’ (Calorie Deficit) ఏర్పడాలి. అంటే శరీరానికి రోజువారీ అవసరానికి కావలసినటువంటి కేలరీల కంటే కొద్దిగా తక్కువ ఆహారం తీసుకోవడం లేదా వ్యాయామం చేయడం ద్వారా మనలో పేరుకుపోయిన క్యాలరీలను ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.అంతేకాని ఉదయం లేవగానే ఏదో ఒక నీరు తాగిన, ఆ తర్వాత రోజంతా మనకు ఇష్టం వచ్చినట్లు అధిక కార్బోహైడ్రేట్లు, జంక్ ఫుడ్, నూనెతో వేయించిన పదార్థాలు, రకరకాల స్వీట్లు తింటూ ఉంటే మన బరువు తగ్గడం అసాధ్యం.
ఉదయం నీళ్లు తాగడం వల్ల కలిగే అసలైన ప్రయోజనాలు
ఈ ప్రత్యేకమైన పానీయాలు ఏవి కొవ్వును నేరుగా కరిగించలేకపోయినా వీటిని తాగడం వల్ల కొన్ని పరోక్షమైన లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఉదయాన్నే ఒక పెద్ద గ్లాస్ నీరు లేదా మనం పైన చెప్పుకున్నట్టు ఆ నీటిలో ఏదైనా మిక్స్ చేసుకొని తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో బ్రేక్ ఫాస్ట్ లో అధికంగా తినే అవకాశం కొద్దిగా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా పాలు పంచదార వేసినటువంటి టీ, కాఫీలతో రోజున ప్రారంభించే అలవాటు ఉన్నవారు వాటికి బదులుగా ఇప్పుడు మనం చెప్పుకున్న పానీయాలను తీసుకోవడం ద్వారా ఉదయాన్నే శరీరంలోకి చేరే 100 నుండి 200 ల అదనపు కేలరీలను సులభంగా తప్పించుకోవచ్చు.శరీరానికి కావలసినటువంటి ద్రవాలు అందినప్పుడు రక్తప్రసరణ మెరుగు పడుతుంది. అలాగే కణాలకు ఆక్సిజన్ సరఫరా వేగవంతమై రోజంతా మనం చురుకుగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
బరువు తగ్గడం అనేది ఒక రోజు లోనో, వారంలోనూ, నెలలోనూ జరిగే విషయం కాదు. కాదు అది ఒక క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అలవర్చుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం లేదా జీలకర్ర నీళ్లు తాగడం అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన ఆరంభం మాత్రమే. కానీ అదే అసలైన పద్ధతి కాదు. నిజంగా శరీర బరువును పొట్ట కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే రోజువారి ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అధిక పిండి పదార్థాలు ఉన్న ఆహారం కానీ చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహాలను కానీ తినకుండా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు ఆకుకూరలు మంచి ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నడకను అలవాటు చేసుకోవాలి. యోగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానితోపాటు శారీరక శ్రమను కూడా అలవాటు చేసుకోవాలి.శరీరము బాగా కదలగలిగే పనులు చేయడం మంచిది. వీటన్నిటితో పాటు రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు ఉండేలా చూసుకోవాలి. అలాగే శరీరంలో హార్మోన్లు సమతుల్యతలో ఉండి మెటపాలితం చురుగ్గా పనిచేస్తుందా లేదా అనే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా మన రోజువారి జీవితాన్ని అలవాటు చేసుకుంటే మనకు తెలియకుండానే మన పొట్ట కరిగిపోతుంది.మన శరీర బరువు కూడా తగ్గుతుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా మనకు దొరుకుతుంది.
గమనిక (డిస్క్లైమర్): ఈ వ్యాసంలో అందించిన సమాచారం కేవలం సాధారణ అవగాహన, ఆరోగ్య స్పృహ కల్పించడం కోసం మాత్రమే. ఇది నిపుణులైన వైద్య సలహాకు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. బరువు తగ్గడానికి మీ రోజువారీ ఆహారంలో లేదా అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకునే ముందైనా, ముఖ్యంగా మీకు గ్యాస్ట్రిక్, డయాబెటిస్, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన డాక్టర్ లేదా క్లినికల్ డైటీషియన్‌ను సంప్రదించండి.










