బియ్యం ధరలు పెరిగినప్పుడు ఇంటి ఖర్చు ఎలా తగ్గించుకోవాలి
ప్రతి ఇంట్లో ఉదయం లేచిన వెంటనే వంటగదిలో మొదట చూసేది బియ్యం డబ్బా. ఇప్పుడు ఆ డబ్బా ముందు నిలబడి నెలవారీ ఖర్చు లెక్కలు వేసుకునే పరిస్థితి వచ్చింది. గత కొన్ని నెలలుగా బియ్యం ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారత బియ్యం ధర మే నెలలో టన్నుకు సుమారు 317 డాలర్లు ఉండగా, అక్టోబర్ నాటికి 378 డాలర్లకు చేరిందని ప్లాట్స్ నివేదిక చెబుతోంది. దక్షిణ భారతంలో వర్షాభావం, కరువు పరిస్థితులు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఆంధ్ర ,తెలంగాణ, ప్రాంతాలలోనే కాకుండా దేశం మొత్తం కూడా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు 25 కేజీల బస్తా 800 నుంచి 1200 వరకు ఉండేది. అదే బస్తా ఇప్పుడు దాదాపుగా 2000 నుండి 2500 వరకు ఉంటుంది. ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మన ఇంటి బడ్జెట్ ను కాపాడుకోవాలంటే వంటింట్లో కొన్ని మార్పులు చేసుకోవడం ఖచ్చితంగా అవసరం.
బియ్యం ఎందుకు ప్రధాన ఆహారంగా ఉంది?
అన్నం కేవలం ఆహారమే కాదు అలవాటు కూడా. మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో రోజుల్లో మూడు పూటలా అన్నం తింటారు. అయితే మన పూర్వీకులు ఎన్నో రకాల చిరుధాన్యాలు, పప్పులు, దుంపలతో పోషకమైన భోజనం చేశారని తెలుసా? ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు మనం కొత్త కోణంలో చూడాల్సిన సమయం వచ్చింది.
చిరుధాన్యాలు: రాగులు, జొన్నలు, సజ్జలు
మనం తినే అన్నానికి అత్యంత సహజమైన ప్రత్యామ్నాయ ఆహారం చిరుధాన్యాలు. రాగి సంగటి, జొన్న రొట్టె, సజ్జ రొట్టె వంటివి తయారు చేసుకొని తినేవారు. పీచు పదార్థం ఉండడంతో కడుపు ఎక్కువసేపు నిండినట్లు అనిపిస్తుంది. అన్నంతో పోలిస్తే తక్కువగా తిన్న మన కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఒకసారి అలవాటయితే రుచి కూడా చాలా బాగా నచ్చుతుంది.
గోధుమ రవ్వ (దలియా)
గోధుమ రవ్వతో ఉప్మా అనగానే చాలామందికి అబ్బా ఉప్మా అని అనిపిస్తుంది. కానీ గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా పులిహోర, పొంగలి, కిచిడి వంటి వంటకాలు కూడా వండుకోవచ్చు. రకరకాలుగా గోధుమ రవ్వ వంటకాలు ట్రై చేస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఉదయాన్నే ఇవి తినటం వల్ల త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా ఎక్కువ సేపు శక్తి కూడా ఉంటుంది. మంచి మంచి వంటకాలు చేస్తూ బియ్యం ఖర్చును కొద్దిగా తగ్గించుకోవచ్చు.
అటుకులు (పోహా)
అటుకులు తక్కువ సమయంలో వండే ఆహారం. పోహా, అటుకుల ఉప్మా, అటుకుల పులిహోర వంటివి ఉదయం అల్పాహారానికి చాలా బాగుంటాయి. పల్లీలు, కూరగాయలు, కరివేపాకు కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. ఇంట్లో పని ఎక్కువగా ఉండే గృహిణులకు, ఉద్యోగస్తులకు ఇది చాలా ఉపయోగకరం.
పెసర, శనగ, కంది పప్పు తో చేసే వంటకాలు
పప్పుధాన్యాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పెసరట్టు, సెనగ దోస, పెసర పొంగలి, పప్పుచారు వంటి అన్నానికి బదులుగా మనం ఆహారంగా తీసుకోవచ్చు. అల్లం జీలకర్ర కరివేపాకు వేసి చేస్తే ఇవి మరింత రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇవి బాగా తింటారు.
చిలగడదుంప, బంగాళదుంప
దుంపలు పూర్వకాలం నుండి అందరూ ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఇవి త్వరగా కడుపు నిండుగా చేస్తాయి. బంగాళాదుంప మనందరికీ తెలిసిందే. దీంతో కూర వండుకోవడమే కాకుండా చపాతీలో కలుపుకొని కూడా తినవచ్చు. సాధారణంగా చపాతీలు తినటం అలవాటు లేని వారు బంగాళదుంప ఉడకపెట్టి అందులో మసాలా కలుపుకొని చపాతి పిండిలో మిక్స్ చేసి చపాతి చేసుకొని తింటే రెండు చపాతీలు తిన్న కూడా మంచి శక్తి ఉంటుంది. కడుపునిండా ఉంటుంది. అలాగే చిలగడ దుంపను కూడా కూర లాగా వండుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ఉడకపెట్టి తినవచ్చు.
మొక్కజొన్న ఆహారం
మొక్కజొన్నతో రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు. మొక్కజొన్నని రొట్టెలు చేసుకోవడానికి మాత్రమే కాకుండా, ఉప్మా మొక్కజొన్న అన్నం, కూడా చేసుకొని తినచ్చు. ఇది మంచి పుష్కలమైన ఆహారమే కాకుండా మనకి త్వరగా శక్తిని కూడా ఇస్తుంది. అన్నం కు బదులు రోజులో ఒకసారి మనం ఇది యాడ్ చేసుకుంటే మన బడ్జెట్ ని తగ్గించుకోవచ్చు. అలాగే మన పూర్వీకుల అలవాట్లు కూడా మనం నేర్చుకుని వారిలాగా మంచి శక్తి పొందవచ్చు.
ఓట్స్ మరియు సేమియా
ఓట్స్ తో ఉప్మా చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఓట్స్‌ని దోశ పిండిలో కలిపి కూడా ఓట్స్ దోసెలు కూడా వేయవచ్చు. అలాగే సేమియా ఉప్మా కూడా మనం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల చాలా తేలికగా ఉంటాయి. వీటితోపాటు పచ్చి కూరగాయలు ఉడకపెట్టి ఆహారంగా తీసుకుంటే మన బడ్జెట్లో చాలావరకు పొదుపు చేయవచ్చు.
పెరుగుతున్న బియ్యం ధరలకు అనుకూలంగా మన జీవనశైలి కూడా మార్చుకోవడం చాలా అవసరం. చాలామంది ఉదయాన్నే టిఫిన్ తినే అలవాటు ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో రాత్రి కూడా అన్నానికి బదులుగా మనం ప్రత్యామ్నాయంగా మంచి ఆరోగ్యకరమైన అలాగే శక్తి నుంచే ఆహారాలు చాలానే ఉన్నాయి. వాటిని మన రోజువారి జీవితంలో అలవాటు చేసుకుంటే ఖర్చుతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతాము. ఇప్పుడు బియ్యం రేట్లు మరింత పెరిగిన మనము చేయగలిగే పరిస్థితి ఏమీ లేదు కాబట్టి ప్రతివారం బియ్యానికి బదులుగా ప్రత్యామ్నాయ వంటకాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే దీనిని మన రొటీన్ లైఫ్ లో అలవాటు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఎందుకంటే రాబోయే పరిస్థితులలో మనము ఇటువంటి ధరల పెరుగుదలను అలాగే బియ్యం కూడా దొరకని పరిస్థితులను కూడా చూడవచ్చేమో? కాబట్టి దానికి మనము సిద్ధంగా ఉండాలి. మన జీవనశైలిని కూడా మార్చుకోవాలి. రాబోయే కాలము ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు కాబట్టి పరిస్థితులు ఏవైనా మనం ముందుగానే సిద్ధపడి మన కుటుంబంలో ఇటువంటి అలవాట్లను నేర్చుకుంటే, ఈ ప్రపంచం తో పాటు ముందుకు వెళ్ళగలం. లేదంటే పరిస్థితులు మన చేయి దాటి పోతాయి కాబట్టి బియ్యం అంటే ఒక ఆహారంగానే కాకుండా బియ్యాన్ని కూడా రోజుల్లో ఒక ఆహారంగా మాత్రము తీసుకుంటూ మిగిలిన సమయాలలో ప్రత్యామ్నాయ ఆహారాలు తీసుకోవడం అనేది మనకు చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితులకు చాలా ముఖ్యం.










