ఐదేళ్ల కాలాన్ని సైతం వెనక్కి నెట్టి ఇద్దరి మనసులను కలిపిన ఒక వింతైన మాయా డైరీ ప్రేమ కథ
“ఒకవేళ మీరు రాసే పాత డైరీ… ఐదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తితో మిమ్మల్ని మాట్లాడించగలిగితే?”
హైదరాబాద్ మహానగరం చీకటి పడుతూ ఉంది చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. కాఫీ షాప్ కిటికీ పక్కన కూర్చుని, వేడి కాఫీ తాగుతూ విండో గ్లాస్ పై పడుతున్న నీటి బిందువులను చూస్తోంది అనన్య. తను ఒక ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. పాత వస్తువులన్నా, డైరీలన్నా తనకి ప్రాణం. ఆ రోజే కోఠి సండే మార్కెట్లో కొన్న ఒక పాత, వింతైన డైరీని బ్యాగ్‌లోంచి తీసింది. ఆ డైరీ కవర్ పేజీపై విచిత్రమైన డిజైన్ ఉంది, తాళం వేసి తెరిచినట్టు ఒక గుర్తు ఉంది.
డైరీ మొదటి పేజీ తిప్పింది. ఆశ్చర్యంగా అందులో ఏమీ రాసి లేదు. అన్నీ ఖాళీ పేజీలే. ఇది ఖాళీ డైరీ నా? అని ఆశ్చర్యపోయింది.
“ఇంత పాత డైరీలో ఒక్క ముక్క కూడా రాయలేదేంటి?” అనుకుంటూ, సరదాగా తన చేతిలో ఉన్న పెన్నుతో మొదటి పేజీలో ఇలా రాసింది: “ఈ వానలో ఒంటరిగా కాఫీ తాగడం బాగుంది, కానీ నా మనసులోని మాటలు పంచుకోవడానికి ఎవరైనా తోడుంటే ఎంత బాగుంటుందో!”
రాసి, డైరీ మూసేసి ఇంటికి బయల్దేరి వెళ్లిపోయింది.
మరుసటి రోజు ఉదయం. నిద్ర లేవగానే అనన్యకు ఎందుకో ఆ డైరీ గుర్తొచ్చింది. టేబుల్ పై ఉన్న డైరీని తెరిచి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. నిన్న తను రాసిన లైన్ క్రింద, సరిగ్గా అదే పేజీలో నీలి రంగు సిరాతో ఒక కొత్త వాక్యం ప్రత్యక్షమైంది!
“ఒంటరితనం అనేది ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ప్రేమతో నింపే తోడు మీకు త్వరలోనే దొరుకుతుంది. – సిద్ధార్థ్”
అనన్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తన గదిలోకి ఎవరూ రాలేదు, ఈ డైరీని ఎవరూ ముట్టుకోలేదు. మరి ఈ అక్షరాలు ఎలా వచ్చాయి? ‘సిద్ధార్థ్’ ఎవరు? ఇదంతా ఏదైనా మాయా? లేక తన భ్రమనా?
ఆ కంగారులోనే పెన్ను తీసుకుని వణుకుతున్న చేతులతో మళ్ళీ రాసింది: “ఎవరు నువ్వు? నా డైరీలో ఎలా రాస్తున్నావు?”
కొద్ది నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయింది. మెల్లగా, మ్యాజిక్ లాగా ఆ తెల్లటి కాగితంపై అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి అప్పుడే రాస్తున్నట్టుగా విడిపోతూ కనిపించాయి: “నేను కూడా నీలాగే ఒక ఒంటరి మనసుని. నా చేతిలో ఉన్న డైరీలో నేను రాస్తుంటే, అది నీ డైరీలో కనిపిస్తోంది. నమ్మశక్యంగా లేదు కదూ? కానీ ఇది నిజం!”
తెలియని ఆత్రుత అలాగే తన మొహంలో ఏదో తెలియని సంతోషం చేరాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు మనసులను కలుపుతున్న ఆ ‘మాయా డైరీ‘ వారిద్దరి ప్రేమ ప్రయాణానికి మొదటి అడుగు అని ఆమెకు అప్పుడు తెలియదు.
ఆ వింతైన అక్షరాలను చూస్తూ అనన్య అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకే తెలియదు. ఇది కల కాదు, నిజం అని నమ్మడానికి తన చేతిని తానే గిల్లి చూసుకుంది. గుండెల్లో ఒక రకమైన మధురమైన అలజడి మొదలైంది. ఎవరో తెలియని ఒక వ్యక్తి, ఎక్కడో ఉండి తన డైరీ ద్వారా మాట్లాడుతున్నాడు. నిజంగా ఇది ఒక అద్భుతమైన విషయం అని అనుకుంది.
మెల్లగా బెడ్ రూమ్ కిటికీ తెరిచి చూసింది. అప్పుడప్పుడే సూర్యోదయం మొదలవుతూ ఉంది. గులాబీ రంగు లో ఆకాశం సరికొత్త ఆశలను మోసుకొస్తున్నట్టు అనిపించింది. మళ్ళీ డైరీ దగ్గరకు వచ్చి, ఆలోచనల్లో మునిగిపోతూ రాయడం ప్రారంభించింది: “నిజంగానే నువ్వు వేరే చోట ఉండి రాస్తున్నావా సిద్ధార్థ్? అసలు ఈ డైరీ నీకు ఎక్కడ దొరికింది? నమ్మడం కష్టంగా ఉన్నా… ఈ క్షణం నాకెందుకో చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది.”
రాసి, ఆన్సర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఒక నిమిషం… రెండు నిమిషాలు… పేజీలో ఎలాంటి మార్పూ లేదు. ‘అతను నిద్రపోతున్నాడేమో‘ అనుకుని అనన్య నవ్వుకుంది. తను కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది.
కానీ, ఆమె గది దాటి వెళ్ళిన మరుక్షణమే… డైరీలోని ఖాళీ పేజీపై నీలి రంగు సిరా మెల్లగా కదలడం ప్రారంభించింది.
“నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అనన్యా! వైజాగ్ సముద్ర తీరంలో ఒక పాత బుక్ స్టాల్ లో ఈ డైరీ నాకు దొరికింది. నిన్న రాత్రి నేను నా ఒంటరితనాన్ని ఇందులో రాస్తుంటే, నీ అక్షరాలు నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. బహుశా కాలం మన ఇద్దరినీ ఈ డైరీ ద్వారా కలపాలని అనుకుంటోంది!”
అనన్య హాల్లో కాఫీ తాగుతూ ఫోన్ చూసుకుంటోంది. కానీ ఆమె మనసంతా ఆ రూమ్ లో ఉన్న డైరీ పైనే ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి డైరీ తెరిచిన ఆమెకు, సిద్ధార్థ్ రాసిన సమాధానం చూసి ఒళ్ళు జలదరించింది. ముఖ్యంగా అతను తన పేరు ‘అనన్య’ అని రాయడం చూసి షాక్ తింది.
ఆమె వెంటనే పెన్ను పట్టుకుని ఆత్రుతగా ఈ విధంగా రాసింది: “ఆగు! నా పేరు అనన్య అని నీకు ఎలా తెలిసింది? నేను డైరీలో ఎక్కడా నా పేరు రాయలేదు కదా? నువ్వు నన్ను గమనిస్తున్నావా? అసలు ఎవరు నువ్వు?”
వెంటనే సిద్ధార్థ్ నుండి రిప్లై వచ్చింది: “కంగారు పడకు అనన్యా! నువ్వు రాయలేదు, కానీ నీ డైరీ మొదటి పేజీ కవర్ లోపల చాలా చిన్న అక్షరాలతో ‘అనన్య’ అని ఎవరో రాసి ఉంది. బహుశా అది నీ సంతకం అనుకుంటా. నా డైరీ కవర్ లోపల కూడా నా పేరు ‘సిద్ధార్థ్’ అని రాసి ఉంది. ఒకసారి చూడు!”
అనన్య వెంటనే డైరీ కవర్ తిరగేసి చూసింది. అవును! తను గమనించలేదు కానీ, అక్కడ చాలా చిన్నగా ఆమె సంతకం ఉంది. ఆమెకు నవ్వాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదు. ఒకరు హైదరాబాద్ లో, ఇంకొకరు వైజాగ్ లో… మధ్యలో వందల కిలోమీటర్ల దూరం. కానీ చేతిలో ఉన్న ఒకే రకమైన రెండు మాయా డైరీలు వారి ఆలోచనలను క్షణాల్లో పంచుకుంటున్నాయి.
అలా ఆ రోజు నుండి వారిద్దరి మధ్య డైరీ ముచ్చట్లు మొదలయ్యాయి. ఫోన్ నంబర్లు ఇచ్చుకోలేదు, సోషల్ మీడియా ఐడీలు అడగలేదు. కేవలం ఆ డైరీ పేజీల్లోనే వారి ప్రపంచం దాగి ఉంది. ఒకరి ఇష్టాలు, ఒకరి బాధలు, రోజువారీ విశేషాలు అన్నీ ఆ కాగితాలపై అక్షరాల రూపంలో ప్రవహించడం ప్రారంభించాయి.
రోజులు గడుస్తున్న కొద్దీ, అనన్యకు ఉదయం లేవగానే సిద్ధార్థ్ మెసేజ్ చూడటం ఒక అలవాటుగా, వ్యసనంగా మారిపోయింది. సిద్ధార్థ్ రాసే ప్రతి మాటలోనూ ఒక తెలియని ఆత్మీయత, గౌరవం ఆమెను ఆకట్టుకున్నాయి.
ఒకరోజు రాత్రి అనన్య డైరీలో ఇలా రాసింది: “సిద్ధార్థ్, మన ఈ వింత ప్రయాణం ఎక్కడికి దారితీస్తుందో తెలీదు కానీ… ప్రతిరోజూ నీ అక్షరాల కోసం నా మనసు ఎదురుచూసేలా చేశావు. ఇది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ నిన్ను ఒక్కసారైనా చూడాలనిపిస్తోంది.”
ఆమె రాసిన దానికి సిద్ధార్థ్ నుండి చాలా సేపటి వరకు సమాధానం రాలేదు. అనన్య గుండెల్లో కంగారు మొదలైంది. ఒక గంట తర్వాత మెల్లగా అక్షరాలు కనిపిస్తూ వచ్చాయి… కానీ ఆ సమాధానం చూసి అనన్య చేతిలోని పెన్ను కింద పడిపోయింది.
అందులో సిద్ధార్థ్ ఇలా రాశాడు: “అనన్యా… నేను కూడా నిన్ను చూడాలనుకుంటున్నాను. కానీ… ఒక పెద్ద సమస్య ఉంది. నేను నీకు ఒక చేదు నిజం చెప్పాలి…”
ఆ సిద్ధార్థ్ రాసిన సమాధానం చూసి అనన్య చేతిలోని పెన్ను కింద పడిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.
“నేను నీకు ఒక చేదు నిజం చెప్పాలి…“ — ఈ ఒక్క వాక్యం ఆమె మనసును తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది.
వెంటనే పెన్ను అందుకుని వణుకుతున్న చేతులతో రాసింది: “ఏంటి ఆ నిజం సిద్ధార్థ్? నన్ను భయపెట్టకు. అసలు ఏం జరిగింది? త్వరగా చెప్పు!”
కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత డైరీలో సిద్ధార్థ్ అక్షరాలు మెల్లగా ప్రత్యక్షమయ్యాయి: “అనన్యా, నువ్వు నాతో మాట్లాడుతున్న వైజాగ్ సముద్ర తీరం… నువ్వు ఉన్న కాలం ఒకటి కాదు. నా టేబుల్ మీద ఉన్న క్యాలెండర్ లో సంవత్సరం 2021 అని చూపిస్తోంది. నీ డైరీలో తేదీ ఎంత ఉందో ఒకసారి చూడు.”
అనన్య ఒక్కసారిగా స్తంభించిపోయింది. కళ్ళు పెద్దవి చేసి డైరీ పైభాగంలో తను నిన్న రాసిన తేదీని చూసింది. అక్కడ ‘23 జూలై, 2026’ అని స్పష్టంగా ఉంది!
అంటే… తన చేతిలో ఉన్న డైరీ ఐదేళ్ల భవిష్యత్తు నుండి మాట్లాడుతుంటే, సిద్ధార్థ్ చేతిలో ఉన్న డైరీ ఐదేళ్ల గతం నుండి సమాధానం ఇస్తోంది! ఇద్దరి మధ్య ఉన్న దూరం కేవలం వందల కిలోమీటర్లు మాత్రమే కాదు… ఐదేళ్ల కాలం కూడా!
నమ్మలేక అనన్య తల పట్టుకుంది. “ఇది ఎలా సాధ్యం సిద్ధార్థ్? నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కదూ? నన్ను ఆటపట్టించడానికి ఇదంతా చేస్తున్నావా?” అని రాసింది.
సిద్ధార్థ్ నుండి వెంటనే రిప్లై వచ్చింది: “నేను అబద్ధం చెప్పడం లేదు అనన్యా. నీకు నమ్మకం కలగాలంటే ఒక పనిచేద్దాం. ఈరోజు నా టైమ్‌లైన్ (2021) ప్రకారం వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్ లో కొత్తగా ఒక పెద్ద కెఫే ప్రారంభం కాబోతోంది. దాని పేరు ‘ది ఓషన్ బ్రీజ్’. నీ 2026 కాలంలో ఆ కెఫే అక్కడ ఉందో లేదో గూగుల్ లో ఒకసారి సెర్చ్ చేసి చూడు.”
అనన్య వెంటనే తన మొబైల్ తీసి గూగుల్ లో వెతికింది. అవును, ఆ కెఫే వైజాగ్ లో చాలా ఫేమస్. కానీ దాని కింద ఉన్న హిస్టరీ చూసి ఆమె ఒళ్ళు గగుర్పొడిచింది. ‘ఈ కెఫే జూలై 2021లో ప్రారంభించబడింది’ అని ఉంది. అంటే సిద్ధార్థ్ చెప్పింది అక్షరాలా నిజం! అతను గతం నుండి మాట్లాడుతున్నాడు.
కాలం ఆడిన ఈ వింత నాటకానికి అనన్య మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇద్దరూ వేర్వేరు కాలాల్లో ఉన్నా… ఆ డైరీ మాత్రం వారిని వర్తమానంలో ఉన్నట్టు కనెక్ట్ చేస్తోంది.
ఆ రోజు నుండి వారి సంభాషణల తీరు మారిపోయింది. కాలాల మధ్య వ్యత్యాసం ఉన్నా, వారి మనసుల మధ్య బంధం మరింత బలపడింది. సిద్ధార్థ్ తన 2021 ప్రపంచం గురించి చెప్తుంటే, అనన్య 2026 లో రాబోయే మార్పుల గురించి చెప్తూ కాలక్షేపం చేసేవారు. మెల్లగా ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. ఒకరినొకరు చూసుకోకపోయినా, తాము కాలాలను దాటి ప్రేమలో పడ్డామని ఇద్దరికీ అర్థమైంది.
అలా కొన్ని నెలలు గడిచాయి.
ఒకరోజు అనన్య ఇంటర్నెట్లో పాత వార్తలను బ్రౌజ్ చేస్తుండగా అనుకోకుండా ఒక పాత న్యూస్ ఆర్టికల్ ఆమె కంటపడింది. అది అక్టోబర్ 2021 నాటి వార్త. ఆ హెడ్లైన్ చూడగానే అనన్య గుండె ఆగిపోయినంత Panic అయ్యింది.
ఆ వార్తలో ఇలా ఉంది: “వైజాగ్ బీచ్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం… బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిద్ధార్థ్ (26) అక్కడికక్కడే మృతి.” పక్కనే ఉన్న ఫోటో చూడటానికి వీల్లేకుండా ఉన్నా, పేరు, వివరాలు అన్నీ తన సిద్ధార్థ్వే! ఆ ప్రమాదం జరిగిన తేదీ: 25 అక్టోబర్, 2021.
అనన్య క్యాలెండర్ వైపు చూసింది. సిద్ధార్థ్ ఉన్న కాలంలో ఇప్పుడు అక్టోబర్ 20వ తేదీ నడుస్తోంది. అంటే… సరిగ్గా ఇంకో ఐదు రోజుల్లో సిద్ధార్థ్ చనిపోబోతున్నాడు!
కన్నీళ్లు మున్నీరుగా కారుతుండగా, వణుకుతున్న చేతులతో డైరీ తెరిచి పిచ్చిదానిలా రాయడం ప్రారంభించింది: “సిద్ధార్థ్! నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ప్లీజ్ నా మాట విను… ఇంకో ఐదు రోజుల్లో అంటే అక్టోబర్ 25న నువ్వు బయటకి వెళ్ళకూడదు…”
కానీ ఆ పేజీపై అక్షరాలు రాయడానికి పెన్ ఇంక్ సరిగ్గా పడటం లేదు. డైరీ పేజీలు మెల్లగా పసుపు రంగులోకి మారుతూ, అక్షరాలు మసకబారుతున్నాయి. ఆ మాయా డైరీ తన శక్తిని కోల్పోతున్నట్టు అనిపించింది.
అటువైపు నుండి సిద్ధార్థ్ ఆందోళనగా రాశాడు: “అనన్యా! నీ అక్షరాలు నాకు సరిగ్గా కనిపించడం లేదు. చాలా లైట్‌గా వస్తున్నాయి. ఏం రాస్తున్నావు? ప్లీజ్ మళ్ళీ రాయి…”
అనన్య ఎంత ప్రయత్నించినా అక్షరాలు పడటం లేదు. సిద్ధార్థ్ ప్రాణాలు కాపాడటానికి ఆమెకు కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. కానీ కాలం వారి మధ్య ఉన్న ఏకైక మార్గాన్ని మూసేస్తోంది! అనన్య ఇప్పుడు ఏం చేయబోతోంది? సిద్ధార్థ్‌ను ఎలా కాపాడుకుంటుంది?
అనన్య కళ్ళల్లోంచి కన్నీళ్లు నిరంతరాయంగా కారుతూ డైరీ పేజీలపై పడుతున్నాయి. ఆ నీటి బిందువుల వల్ల పేజీల్లోని సిరా మరింత కరిగిపోతోంది. పెన్నుతో ఎంత గట్టిగా రాస్తున్నా ఒక్క అక్షరం కూడా అవతలి వైపు ఉన్న సిద్ధార్థ్‌కు కనిపించేలా పడటం లేదు.
కాలం తన క్రూరత్వాన్ని చూపిస్తోంది. సరిగ్గా ఐదు రోజుల్లో ప్రాణాలు కోల్పోబోతున్న తన ప్రేమికుడిని కాపాడుకోవడానికి ఆమె దగ్గర ఎలాంటి దారీ కనిపించడం లేదు.
ఆ రాత్రంతా అనన్య నిద్రపోలేదు. గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచించసాగింది. “నేను 2026 లో ఉన్నాను. సిద్ధార్థ్ 2021 లో ఉన్నాడు. డైరీ పని చేయకపోతే… నేను గతాన్ని ఎలా మార్చగలను?“ అని ఆలోచిస్తుండగా ఆమెకు ఒక ఉపాయం తట్టింది.
గతం మారితే వర్తమానం కూడా మారుతుంది. ఐదేళ్ల క్రితం వైజాగ్ లో జరిగిన ఆ ప్రమాదాన్ని ఆపడానికి నేరుగా తను వెళ్లలేకపోయినా, 2021 నాటి కాలంలో ఉన్న ఎవరికైనా సమాచారం అందించగలిగితే?
వెంటనే తన మొబైల్ తీసుకుని సోషల్ మీడియాలో 2021 కాలంలో యాక్టివ్‌గా ఉన్న సిద్ధార్థ్ ప్రొఫైల్‌ను వెతికి పట్టుకుంది. అతని అకౌంట్ అలాగే ఉంది, కానీ లాస్ట్ పోస్ట్ 2021 అక్టోబర్ లోనే ఆగిపోయింది. ఆమె వెంటనే ఆ ప్రొఫైల్‌కు మెసేజ్ చేసింది: “సిద్ధార్థ్, అక్టోబర్ 25న నువ్వు ఆర్కే బీచ్ రోడ్ లో బైక్ పై వెళ్లొద్దు. అక్కడ నీకు ప్రమాదం పొంచి ఉంది. ప్లీజ్ ఈ మెసేజ్ చూడు!“ అని పంపింది. కానీ ఆమె పంపిన మెసేజ్ ఐదేళ్ల తర్వాత (2026 లో) డెలివరీ అవుతోంది… అది 2021 లో ఉన్న సిద్ధార్థ్‌కు ఎలా చేరుతుంది? అక్కడ ‘అన్‌రీడ్’ (Unread) అనే చూపిస్తోంది. అనన్య తల పట్టుకుని ఏడ్చేసింది.
మళ్ళీ డైరీ దగ్గరకు వచ్చింది. తెల్లవారుజామున 4 గంటల సమయం. ఆశ్చర్యంగా, డైరీలో మసకబారిన సిద్ధార్థ్ అక్షరాలు చాలా కష్టమ్మీద మళ్ళీ కనిపించాయి. బహుశా రాత్రి కంటే ఇప్పుడు నెట్వర్క్ లాంటి కాలాల కనెక్టివిటీ కాస్త కుదిరినట్టుంది.
సిద్ధార్థ్ రాశాడు: “అనన్యా, నువ్వు ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నావని నాకు అర్థమవుతోంది. నీ అక్షరాలు సరిగ్గా పడకపోయినా… ‘ప్రమాదం’, ‘అక్టోబర్ 25’ అనే ముక్కలు మాత్రం నాకు కొద్దిగా కనిపించాయి. ఏంటి అనన్యా అది? నాకేదైనా కాబోతోందా?”
అనన్యకు ప్రాణం లేసొచ్చింది. సమయం వృధా చేయకుండా, ఈసారి పెన్నుతో కాకుండా తన చేతి వేలికి కాస్త రంగు అద్దుకుని, డైరీ పేజీపై చాలా పెద్ద అక్షరాలతో, స్పష్టంగా బ్లాక్ లెటర్స్ లో ఇలా రాసింది: “25 OCTOBER… NO BIKE… NO BEACH ROAD… ACCIDENT… STAY HOME!”
ఆ అక్షరాలు రాయడానికి ఆమె తన సర్వశక్తులూ ఒడ్డింది. రాసిన వెంటనే ఆ పేజీలోని కాగితం ఒక్కసారిగా వేడెక్కినట్టు అనిపించి, మెల్లగా ఆ అక్షరాలు మాయమయ్యాయి. అంటే సిద్ధార్థ్ వైపు ఆ మెసేజ్ డెలివరీ అయిపోయింది!
ఇటువైపు 2021 అక్టోబర్ 21న ఉన్న సిద్ధార్థ్… తన డైరీలో ప్రత్యక్షమైన ఆ పెద్ద అక్షరాలను చూసి షాక్ తిన్నాడు. అనన్య ఇంతలా భయపడుతూ హెచ్చరిస్తోందంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అతనికి అర్థమైంది. అతడు వెంటనే ఈ విధంగా రాశాడు: “సరే అనన్యా, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి… నేను అక్టోబర్ 25న అస్సలు ఇల్లు దాటి బయటకి వెళ్ళను. బైక్ ముట్టను. నీ మాట నమ్ముతున్నాను.”
ఆ సమాధానం చూశాక అనన్య మనసు కాస్త కుదుటపడింది. సమాచారం తెలిసింది ఇక తనకు ఏమీ కాదు అని సంతోష పడింది.
కానీ, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. సిద్ధార్థ్ అలా రాసిన మరుసటి క్షణమే… అనన్య చేతిలో ఉన్న మాయా డైరీ ఒక్కసారిగా మండి బూడిద అయిపోయింది! కాలాల మధ్య ఉన్న కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. ఇకపై సిద్ధార్థ్‌తో మాట్లాడటానికి ఆమెకు ఎలాంటి మార్గమూ లేదు.
ఇప్పుడు అనన్య చేయగలిగిందల్లా ఒక్కటే… ఎదురుచూడటం. సిద్ధార్థ్ తన మాట విని ఇట్లే ఉండిపోయాడా? గతాన్ని మార్చగలిగాడా? ఒకవేళ గతం మారితే… చనిపోవాల్సిన సిద్ధార్థ్ బ్రతికి ఉంటే… 2026 లో ఉన్న అనన్య ప్రపంచం ఎలా మారబోతోంది?
ఆమె ఉత్కంఠతో 2026 అక్టోబర్ 25వ తేదీ కోసం రోజులు లెక్కబెట్టడం ప్రారంభించింది.
సరిగ్గా అక్టోబర్ 25 వచ్చింది. అనన్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె వెంటనే గూగుల్ ఓపెన్ చేసి ఐదేళ్ల క్రితం నాటి ఆ పాత యాక్సిడెంట్ న్యూస్ లింక్‌ను మళ్ళీ సెర్చ్ చేసింది. పేజీ లోడ్ అవుతోంది…
ఆమె కళ్ళు నమ్మలేకపోయాయి! ఆ పాత న్యూస్ ఆర్టికల్ హెడ్లైన్ ఇప్పుడు మారిపోయింది! అక్కడ ఇలా ఉంది: “వైజాగ్ బీచ్ రోడ్ లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం… లారీ బ్రేకులు ఫెయిల్ అయినా సమయానికి బైక్ రైడర్ అక్కడ లేకపోవడంతో తప్పిన ముప్పు.”
అనన్య ఆనందానికి అవధులు లేవు. సిద్ధార్థ్ బ్రతికే ఉన్నాడు! గతం మారిపోయింది!
అదే క్షణంలో… అనన్య మొబైల్ వైబ్రేట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఐదేళ్లుగా అన్‌రీడ్‌గా ఉన్న సిద్ధార్థ్ ప్రొఫైల్ నుండి ఒక మెసేజ్ పాప్ అప్ అయ్యింది.
ఆమె వణుకుతున్న చేతులతో ఇన్‌బాక్స్ తెరిచింది. అందులో ఇప్పుడే వచ్చిన మెసేజ్ ఉంది: “థాంక్యూ అనన్యా! నీ మాట విని ఆ రోజు నేను ఇల్లు దాటి బయటకి వెళ్ళలేదు. ప్రాణాలతో బ్రతికున్నాను. ఐదేళ్లుగా నీ కోసమే ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు సంవత్సరం 2026… నేను హైదరాబాద్ కి వచ్చేశాను. నీ కాఫీ షాప్ బయట నీ కోసమే నిలబడి ఉన్నాను… ఒక్కసారి బయటకి వస్తావా?”
అనన్య ఫోన్ చేతిలో పట్టుకుని కాఫీ షాప్ కిటికీ గుండా బయట రోడ్డు వైపు చూసింది. వాన జల్లుల్లో గొడుగు పట్టుకుని, చేతిలో అదే మాయా డైరీతో… ఒక అందమైన యువకుడు ఆమె వైపు చూస్తూ నవ్వుతూ నిలబడి ఉన్నాడు!
కాలాలను దాటిన వారి ప్రేమ కథ… చివరకు వర్తమానంలో గెలిచింది.
మీ జీవితంలో కూడా ఇటువంటి కో ఇన్సిడెన్స్ ఏమైనా జరిగాయా ? ఎవరినైనా చూసినప్పుడు వీరిని గతంలో ఎప్పుడో చూసినట్లు ఉంది అని అనిపించిందా? ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఒకప్పుడు ఉన్న ఫీలింగ్ ఉంది అని అనిపించిందా? కొందరు వ్యక్తులతో పరిచయం అయ్యాక ఈ స్నేహం నేనెప్పుడో చేసిన ఫీలింగ్ ఉంది అని అనిపించిందా? ఒక అమ్మాయిని ప్రేమించాక గతంలో కూడా ఈ అమ్మాయి తో ఉన్నమధురానుభూతి కలిగిన ఫీలింగ్ ఉంది అని ఆలోచన వచ్చిందా? మీ ప్రియురాలితో, ప్రియుడుతో మాట్లాడినప్పుడు ఇంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు కూడా జరుగుతున్నాయే అనే ఫీలింగ్ వచ్చిందా? అయితే మీరు కూడా అటువంటి మాయ డైరీలో ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారేమో?
ఇటువంటి ఆసక్తికరమైనటువంటి కథల కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కొరకు వాట్సాప్ చానల్ లో జాయిన్ అవ్వండి.
