పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సరిపోయే సగ్గుబియ్యం వంటలు!
సగ్గుబియ్యం అనగానే మనకు బాగా గుర్తుకు వచ్చేది పండగ రోజుల్లో మనం తినేటటువంటి పాయసం. కానీ సగ్గుబియ్యాన్ని మన రోజువారి ఆహారంలో కూడా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? కేవలం పాయసం చేసుకోవడమే కాదు సగ్గుబియ్యంతో అద్భుతమైనటువంటి బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్,ఎనర్జీ డ్రింక్స్ వంటివి ఎన్నో తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? సగ్గుబియ్యం లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది తక్షణమే మనకి శక్తిని ఇచ్చి, జీర్ణక్రియకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది.
సగ్గుబియ్యంతో చేసే పది రకాలైనటువంటి రుచికరమైన వంటకాలు మరియు అవి ఎందుకు మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయో వివరంగా తెలుసుకుందామా?
సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎందుకు మంచిది? (Health Benefits)
వంటకాల్లోకి వెళ్లేముందు సగ్గుబియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం:
తక్షణ శక్తి: ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
జీర్ణక్రియ: ఇది సులభంగా అరుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
శరీర ఉష్ణోగ్రత: ఎండకాలంలో బాడీని కూల్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
బరువు పెరగాలనుకునే వారికి: కృశించిన వారు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి ఇది సహాయపడుతుంది.
గ్లూటెన్ ఫ్రీ: ఇది సహజంగానే గ్లూటెన్ ఫ్రీ కాబట్టి అందరూ తినవచ్చు.
సగ్గుబియ్యంతో 10 రకాల అద్భుత వంటకాలు
సగ్గుబియ్యం కిచిడీ (Sabudana Khichdi)
కావలసినటువంటి పదార్థాలు
నానబెట్టిన సగ్గుబియ్యం – 1 కప్పు,వేయించిన పల్లీల పొడి – అర కప్పు,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు,పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర
మహారాష్ట్రలో ఎంతో రుచిగా తినేటటువంటి మరియు చాలా ఫేమస్ అయినటువంటి వంటకం సగ్గుబియ్యం కిచిడి ఎలా చేయాలో నేర్చుకుందాం.
తయారీ విధానము
ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి నాలుగు గంటల పాటు నీరు పోసి నానబెట్టాలి. ఒక బాండీలో నెయ్యి వేసి ఆ నెయ్యి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. నెయ్యి లేకపోతే నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు. అందులో మనకు కావాలంటే ఉడికించినటువంటి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత నానబెట్టినటువంటి సగ్గుబియ్యము, వేరుసెనగ పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాండిలో వేసి రంగు మారే వరకు ఉడికించుకొని లేదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చి దించుకోవాలి. చివరిగా నిమ్మరసం అలాగే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా అందరూ మెచ్చే విధంగా సగ్గుబియ్యం కిచిడి తయారవుతుంది.
సగ్గుబియ్యం వడ (Sabudana Vada)
కావలసినటువంటి పదార్థాలు
నానబెట్టిన సగ్గుబియ్యం – 1 కప్పు,ఉడికించిన బంగాళాదుంపలు – 2,వేయించిన పల్లీల పొడి – 3 స్పూన్లు,కారం, ఉప్పు, జీలకర్ర
తయారీ విధానము
సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత సరిపడా ఆలుగడ్డలని ఉడికించుకొని పెట్టుకోవాలి, పచ్చిమిర్చి తరుగు అలాగే అల్లం సన్నగా ముక్కలు తరిగి ఉంచుకోవాలి. కొత్తిమీర,ఉప్పు, శెనగపిండి వేసుకొని అన్నింటిని ఒక చిక్కగా ముద్దలాగా వచ్చేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతితో వడలు లాగా ఒత్తుకొని మరిగినటువంటి నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే విధంగా చూసుకుని దింపుకుంటే సగ్గుబియ్యం వడ రెడీ అయిపోతుంది.
సగ్గుబియ్యం పాయసం (Sago Kheer)
కావలసినటువంటి పదార్థాలు:
సగ్గుబియ్యం – అర కప్పు,పాలు – అర లీటరు,బెల్లం లేదా చక్కెర – తగినంత,యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్
తయారీ విధానము
ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలు పోసుకొని బాగా మరిగించాలి పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టినటువంటి సగ్గుబియ్యం వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికాక అందులో కొంచెం పంచదార లేదా బెల్లాన్ని వేసి మెల్లగా కలుపుకోవాలి (బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆపుకొని ఉంటే మంచిది ఎందుకంటే కొన్నిసార్లు పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ). చివరిగా యాలకుల పొడిని అలాగే వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లని అందులో చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
సగ్గుబియ్యం దోశ (Sago Dosa)
కావలసినటువంటి పదార్థాలు:
సగ్గుబియ్యం – 1 కప్పు,పుల్లటి పెరుగు – 1 కప్పు,బియ్యం పిండి – అర కప్పు,పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు.
తయారీ విధానము
ముందుగా ఒక కప్పులో సగ్గుబియ్యాన్ని అలాగే బియ్యాన్ని రెండింటిని విడివిడిగా కనీసం 5 నుండి 6 గంటలు నానబెట్టాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం పెరుగును వేసి కలియబెట్టి రాత్రంతా ఉంచితే అది పులిసి దోసెలు వేసుకోవడానికి సిద్ధంగా తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం అందులో ఉప్పు జీలకర్ర కలిపి మామూలుగా మనము దోసెలు వేసుకునే విధంగానే పెనంపై దోసెలు వేసుకుంటే ఇవి చాలా మెత్తగా తెల్లగా రుచికరంగా ఉంటాయి. ప్రతిరోజు రొటీన్ గా చేసుకునే దోసెలకు బదులు మనం ఈ విధంగా వెరైటీ దోశలు చేసుకుంటే మనకు బోర్ కొట్టకుండా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
సగ్గుబియ్యం పునుగులు (Sago Bonda)
కావలసినటువంటి పదార్థాలు:
సగ్గుబియ్యం – 1 కప్పు,పుల్లటి పెరుగు – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు,ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి
తయారీ విధానము
ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని అరకప్పు పెరుగులో 4 నుండి 5 గంటలసేపు నానబెట్టాలి. తర్వాత సగ్గుబియ్యం పెరుగును బాగా పీల్చుకున్నాక అందులో తగినంత మైదా పిండి లేదా బియ్యం పిండి కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మరుగుతున్నటువంటి నూనె బాండీలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి చాలా రుచికరంగా ప్రతిరోజు మనం తింటున్నటువంటి బోండాలకి బోండాలకు బదులుగా ప్రతి సాయంకాలం మనం స్నాక్స్ లాగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు ఇంటిల్లిపాది ఆస్వాదించుకోవచ్చు.
సగ్గుబియ్యం ఉప్మా (Sago Upma)
కావలసినటువంటి పదార్థాలు:
నానబెట్టిన సగ్గుబియ్యం – 1 కప్పు,ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు,పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు),వేయించిన పల్లీలు – 2 స్పూన్లు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం.
తయారీ విధానము
ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి. తరువాత ఒక బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు , పచ్చి శెనగ పల్లీలు అలాగే ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలియ పెట్టుకోవాలి . తర్వాత నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేయాలి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాల వరకు ఉడికించాలి. సగ్గుబియ్యం మెత్తబడ్డాక కొత్తిమీర అలంకరణ కోసం వాడుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం ఉప్మా ప్రతిరోజు మనము ఉప్మా తిని బోర్ కొట్టి మానేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి వారు ఈ వెరైటీ ఉప్మాను చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే కొత్త రుచులు చూచినట్లు ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కచ్చితంగా ప్రయత్నం చేయండి.
సగ్గుబియ్యం పుడ్డింగ్ (Sago Pudding)
కావలసినటువంటి పదార్థాలు:
సగ్గుబియ్యం, పాలు, బెల్లం (లేదా చక్కెర), యాలకల పొడి, కొద్దిగా నెయ్యి, కాజు, కిస్మిస్.
తయారీ విధానము:
ముందుగా సగ్గుబియ్యాన్ని నీళ్లలో బాగా నానబెట్టుకోవాల. ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించి, అందులో ఈ నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాల. అవి అద్దం ముక్కల్లా మెరుస్తా ఉడికినప్పుడు, చక్కెర గానీ బెల్లం గానీ వేసి కలపాలా. నెయ్యిలో వేయించిన కాజు, కిస్మిస్ చల్లితే.. పుడ్డింగ్ తయార్! ఇది తింటే “ఆహా” అనాల్సిందే!
సగ్గుబియ్యం అప్పడాలు (Sago Papad)
ఎండకాలం వచ్చిందంటే చాలు, మా ఊర్లో మిద్దెల మీద ఈ అప్పడాలే కనిపిస్తాయి.
కావలసినటువంటి పదార్థాలు: సగ్గుబియ్యం, నీళ్లు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు.
తయారీ విధానము:
ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి బాగా తెర్లనివ్వాల. అందులో సగ్గుబియ్యం, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలా. అది దగ్గరపడి గంజిలాగా అయ్యాక.. ఒక ప్లాస్టిక్ కవర్ మీద చిన్న చిన్న గరిటెలతో బిళ్లల్లాగా పోయాల. రెండు రోజులు ఎండలో బాగా ఎండితే చాలు.. నూనెలో వేస్తే తెల్లగా, పెద్దగా పువ్వుల్లాగా వస్తాయి. పప్పు చారులోకి ఇవి ఉంటే ఆ మజాయే వేరబ్బా!
సగ్గుబియ్యం గంజి (Sago Java)
ఒంట్లో వేడి చేసినా, నీరసంగా ఉన్నా మా ఊర్లో ఫస్ట్ ఇచ్చేది ఇదే!
కావలసినటువంటి పదార్థాలు: సగ్గుబియ్యం, నీళ్లు, కొద్దిగా ఉప్పు, మజ్జిగ (లేదా పాలు).
తయారీ విధానము:
సగ్గుబియ్యాన్ని నీళ్లలో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాల. అది పల్చగా ఉన్నప్పుడే దించేసి, చల్లారాక అందులో గట్టి మజ్జిగ, కొద్దిగా ఉప్పు వేసి తాగితే.. అబ్బా! కడుపులో చల్లగా, ప్రాణం లేచి వస్తాది. మీకు తీపి కావాలంటే చక్కెర వేసుకొని తాగొచ్చు.
సగ్గుబియ్యం పకోడీ (Sago Pakoda)
సాయంత్రం పూట వాన పడుతుంటే, వేడి వేడి పకోడీ పడాల్సిందే కదా!
కావలసినటువంటి పదార్థాలు: సగ్గుబియ్యం, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె.
తయారీ విధానము:
నానబెట్టిన సగ్గుబియ్యంలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి గట్టిగా కలుపుకోవాల. నూనె బాగా కాగాక.. చిన్న చిన్న ముద్దల్లాగా వేసి ఎర్రగా వేయించాల. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. చాయ్‌లో నంజుకుని తింటే ఆ కిక్కే వేరు!
పైన చెప్పినటువంటి ఈ వంటకాలు నిజంగా చాలా రుచిగా ఉంటాయి. మనం ప్రతి రోజు రొటీన్ గా తిని అలిసిపోయి ఏం చేయాలో అర్థం కాక ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే రుచికి రుచి ఉంటాయి కాబట్టి కనీసం నెలలో ఒకసారైనా ఈ వెరైటీ వంటకాలను ట్రై చేయండి. రుచికరంగా అలాగే ఆరోగ్యవంతమైన వంటకాల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ట్రై చేసి మీ ఇంటి సభ్యుల చేత ఆహా ఏమి రుచి అని అనిపించుకోండి.
సగ్గుబియ్యంతో చేసినటువంటి ఈ వంటకాలు మీకు నచ్చాయా అయితే దీనిని మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మా యొక్క వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వలన ఎప్పటికప్పుడు మా వెబ్సైట్ యొక్క అప్డేట్స్ మీకు అందుతాయి
